మాట్లాడుతున్న మంత్రి మేరుగ నాగార్జున. చిత్రంలో స్పీకర్ తమ్మినేని తదితరులు
సాక్షి, అమరావతి/గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): అంబేడ్కర్ ఆలోచనలతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని చేతల్లో చేసి చూపిస్తున్నారని పలువురు వక్తలు కొనియాడారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను కేవలం ఓట్ల కోసం వాడుకుని వదిలేసిందని.. కానీ, జగన్ మాత్రం వారిని రాజ్యాధికారంలో భాగస్వాముల్ని చేస్తున్నారన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 131వ జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఘనంగా నిర్వహించింది. ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సభకు స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిగా అంబేడ్కర్ జయంత్యుత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. 66 దేశాల్లో అంబేడ్కర్ జయంత్యుత్సవాలను జరుపుకుంటున్నారని.. అలాగే, అంబేడ్కర్ పుట్టిన రోజుని ప్రపంచ జ్ఞానదినంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిందని మంత్రి గుర్తుచేశారు.
గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. అంబేడ్కర్, పూలే ఆలోచన విధానాన్ని సీఎం వైఎస్ జగన్ అమలుచేస్తున్నారన్నారు. దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో బీసీ, ఎస్సీలు ముఖ్యమంత్రులుగా పనిచేసినా సామాజిక న్యాయాన్ని ఏపీలో జగన్ తరహాలో చేయలేకపోయారన్నారు. సీఎం జగన్‌ను మరో 25 ఏళ్లపాటు అధికారంలో కొనసాగేలా ఆయనకు మనం అండగా నిలవాలని, సీఎంగా జగన్ ఉంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మనుగడ అని అన్నారు.
మహనీయులకు వర్థంతులుండవు : తమ్మినేని
మహనీయులకు జయంతులే కాని వర్థంతులుండవని స్పీకర్ తమ్మినేని సీతారాం కొనియాడారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని తూచ తప్పకుండా అమలుచేస్తున్న అభినవ అంబేడ్కర్ íసీఎం జగన్ అని కితాబిచ్చారు. విజయవాడ మేయర్ స్థానం జనరల్ అయితే.. బీసీ మహిళకు అవకాశం ఇవ్వడం గొప్ప విషయమన్నారు. గత పాలకులు అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటును ప్రకటించి ఐదేళ్లు గడిచినా పట్టించుకోలేదని, సీఎం వైఎస్ జగన్ మాత్రం విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహంతో స్మృతివనాన్ని ఏర్పాటుచేస్తున్నారని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు.
సీఎం జగన్‌ను ఒక్కసారి చేజార్చుకుంటే మన భవిష్యత్ అంధకారమేనన్నారు. కార్యక్రమంలో.. మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలువురు ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొని మాట్లాడారు. తొలుత తుమ్మలపల్లి కళాక్షేత్రం బయట ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి, సభ ప్రాంగణంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
గడువులోగా అంబేడ్కర్ విగ్రహం పూర్తి
మరోవైపు.. విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటుచేసిన 25 అడుగుల అంబేడ్కర్ నమూనా కాంస్య విగ్రహానికి మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, విశ్వరూప్, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 125 అడుగుల విగ్రహం, స్మృతి వనం పనులను గడువులోగా పూర్తిచేయాలని కాంట్రాక్టు సంస్థను మంత్రుల బృందం ఆదేశించింది.
బాబుకు అంబేడ్కర్ పేరెత్తే అర్హతే లేదు
రాజ్యాంగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిన చంద్రబాబుకు అంబేడ్కర్ పేరెత్తే అర్హతేలేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. బాబు పాలనలో దళితులపై అతిపెద్ద దాడి జరిగిందని, ఆ వర్గాలకు ప్రధాన శత్రువు చంద్రబాబేనని చెప్పారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగనన్న పాలనలో దళితులకు అన్నింటా అగ్రతాంబూలం ఇస్తున్నారని చెప్పారు. అంబేడ్కరిజాన్ని గుండెల నిండా నింపుకొని సీఎం జగన్ రాష్ట్రంలో సామాజిక విప్లవానికి బాటలు వేస్తున్నారని కొనియాడారు.
రాజధాని అమరావతిలో అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం అంటూ ఐదేళ్లు కాలయాపన చేసి, ఆఖరికి ఆ ప్రాంతాన్ని పిచ్చి మొక్కలకు ఆలవాలంగా మార్చిన టీడీపీ నేతలు సీఎం జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. కానీ, రూ.కోట్ల విలువ చేసే అత్యంత ఖరీదైన స్థలంలో, విజయవాడ నడిబొడ్డున రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా వైఎస్ జగన్ అంబేడ్కర్ విగ్రహాన్ని, స్మృతివనాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు.
సీఎం జగన్ ఈరోజు కూడా ఆ పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారని.. గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారని.. ఇదీ ఆయన చిత్తశుద్ధని చెప్పారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగానికి అధ్యక్షుడి హోదాలో తాను అమరావతిలోని అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేసే ప్రాంతాన్ని చూడటానికి వెళ్తే తనని ముప్పతిప్పలు పెట్టి అరెస్తుచేశారని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment