సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న వైఎస్సార్, జగనన్న కాలనీల్లో పేదల కోసం ప్రభుత్వం 15 లక్షల ఇళ్లను నిర్మించనుంది. రాష్ట్రంలో అర్హులైన 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనుండటంతో వారికి ఇళ్లు మంజూరు చేయనున్నారు. ఇప్పటికే 26 వేల ఎకరాలకు పైగా భూముల్లో లేఔట్లు వేసి పట్టాలు పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ప్రత్యేక డిజైన్..
► మొదటి విడతలో 15 లక్షల ఇళ్లు నిర్మించేందుకు వీలుగా గృహనిర్మాణ శాఖ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు.
► ఇందులో భాగంగా ప్రీ–కాస్ట్ ఆర్‌సీసీ శ్లాబ్‌తో లబ్ధిదారులకు సరసమైన ఖర్చుతో ఇళ్లు నిర్మించేందుకు డిజైన్‌ను తయారు చేశారు.
► నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన సెంట్రింగ్ మెటీరియల్ సరఫరా చేసేందుకు గృహనిర్మాణ శాఖ టెండర్లు పిలిచింది.
► ప్రీ–కాస్ట్ ఆర్‌సీసీ శ్లాబ్‌తో నిర్మాణాల కోసం అనుభవం ఉన్న కంపెనీల నుంచి ఇప్పటికే టెండర్లను ఆహ్వానించారు.
► భారీ నిర్మాణాల్లో అనుభవం ఉన్న కంపెనీలకే అవకాశం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
► ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
► నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేస్తారు.
► లబ్ధిదారులు సొంతంగా లేదా అధికారుల పర్యవేక్షణలో నిర్మించుకునేందుకు కూడా అవకాశం కల్పించనున్నారు.
► టీడీపీ హయాంలో 2014 నుంచి 2016 వరకు ఒక్క ఇంటికి కూడా శంకుస్థాపన చేయలేకపోయారు.
► ఆ తర్వాత మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే ఇళ్లతోపాటు వివిధ పథకాల కింద 6.20 లక్షల ఇళ్లు మంజూరు చేశారు.
► ఇందులో 3.50 లక్షల వరకు మాత్రమే పూర్తి చేసినా లబ్ధిదారులకు బిల్లులు చెల్లించకుండా నిధులన్నీ సార్వత్రిక ఎన్నికల ముందు పసుపు–కుంకుమ పథకానికి మళ్లించారు.
► టీడీపీ ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లను ఏం చేద్దామనే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment