ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: రాయలసీమలోని నాలుగు జిల్లాలను అనుసంధానిస్తూ మెరుగైన రోడ్ కనెక్టివిటీని అభివృద్ధి చేయనున్నారు. మొత్తం రూ.7,392 కోట్లతో 528 కి.మీ. మేర నాలుగు ప్రధాన రహదారులను నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను రూపొందించేందుకు కన్సల్టెన్సీలను నియమించారు. అనంతరం టెండర్ల ప్రక్రియ చేపట్టి వచ్చే ఏడాది పనులు పూర్తి చేయాలన్నది ప్రణాళిక.
ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదన పట్ల జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) సానుకూలంగా స్పందించింది. ఈ జాతీయ రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ‘సాక్షి’కి తెలిపారు.
రాయలసీమలో నాలుగు లేన్లుగా నిర్మించనున్న రహదారులు ఇవీ...
► వైఎస్సార్ జిల్లా మైదుకూరు నుంచి బద్వేలు మీదుగా నెల్లూరు వద్ద చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారితో అనుసంధానిస్తూ 149 కి.మీ. మేర నాలుగు లేన్ల రహదారిని అభివృద్ధి చేస్తారు. అందుకోసం రూ. 2,086 కోట్లతో ప్రతిపాదనలకు ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదం తెలిపింది.
► అనంతపురం నుంచి మైదుకూరు వరకు 154 కి.మీ. మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి రూ. 2,156 కోట్లతో ప్రతిపాదనలకు ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదం తెలిపింది.
► కర్నూలు నుంచి డోర్నాల వరకు 131 కి.మీ నాలుగు లేన్ల రహదారి నిరి్మస్తారు. ఇందుకోసం రూ.1,834 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.
► చిత్తూరు జిల్లాలో మదనపల్లి నుంచి తిరుపతి వరకు 94 కి.మీ.మేర నాలుగు లేన్ల రహదారిని రూ. 1,316 కోట్లతో నిరి్మస్తారు.
రూ.2,205 కోట్లతో రోడ్ల మరమ్మతులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్ల మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు సిద్ధమైంది. బ్యాంక్ ఆఫ్ బరోడా రాష్ట్రానికి రూ.2 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు సమ్మతించడంతో అందుకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలో దాదాపు 9 వేల కి.మీ. మేర రోడ్ల మరమ్మతుల కోసం రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ(ఆర్డీసీ) కొన్ని నెలల కిందట టెండర్ల ప్రక్రియ చేపట్టింది. బ్యాంకు నుంచి రుణ సాయంతో ఈ పనులు చేపట్టాలని నిర్ణయించింది. రోడ్ సెస్ ద్వారా సమకూరే నిధులతో ఆ రుణాలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. దాంతో రోడ్‌సెస్ నిధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎస్క్రో ఖాతాను గ్యారంటీగా చూపి.. రుణాల కోసం ఆర్డీసీ వివిధ బ్యాంకులతో సంప్రదింపులు జరిపింది.
తక్కువ వడ్డీకి రుణం ఇచ్చేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా ముందుకొచ్చింది. ఆ బ్యాంకుతో ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులు జరిపిన చర్చలు ఫలించాయి. మొత్తం 9 వేల కి.మీ మేర.. రూ.2,205 కోట్లతో మరమ్మతులు చేసేందుకు ఆర్డీసీ సన్నాహాలు వేగవంతం చేసింది. అందుకోసం పిలిచిన టెండర్ల ప్రక్రియను ఓ కొలిక్కి తెచ్చే పనిలోపడింది. ఇప్పటికే 33% పనులకు కాంట్రాక్టర్లు బిడ్లు వేశారు. ప్రస్తుతం బ్యాంకు రుణం మంజూరు కావడంతో మిగిలిన 67% పనులకూ కాంట్రాక్టర్లు ఆసక్తి చూపుతారు. దీంతో మొత్తం టెండర్ల ప్రక్రియను త్వరలోనే ఖరారు చేయనున్నారు. ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తామని ఆర్డీసీ ఎండీ శ్రీనివాసులరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment