సాక్షి, అమరావతి: రహదారుల మరమ్మతులకు నిధుల కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రూ.2,205 కోట్లతో రాష్ట్రంలో 7,969 కి.మీ. మేర రహదారులకు ప్రత్యేక మరమ్మతులు చేపట్టేందుకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. మరమ్మతులు మళ్లీ మళ్లీ చేయకుండా రోడ్లపై రెన్యువల్ లేయర్ వేసేందుకు ఆర్‌అండ్‌బీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో వీటికి ఆమోదం తెలుపుతూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఒకే ఏడాదిలో ఆర్‌అండ్‌బీ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం ఇదే మొదటి సారి. ఆర్‌అండ్‌బీలో 13,500 కి.మీ. మేర రాష్ట్ర రహదారులు, 32,725 కి.మీ. మేర జిల్లా ప్రధాన రహదారులున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ
గత ప్రభుత్వ హయాంలో నిర్ణీత కాలంలో రోడ్లకు మరమ్మతులు చేయని కారణంగా, ఈ ఆర్థికఏడాదిలో కురిసిన భారీ వర్షాలు, తుపాన్లకు రహదారులు బాగా దెబ్బతిన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని రూ.500 కోట్ల నిధులను వెంటనే విడుదల చేసింది. అదనంగా మరమ్మతులు చేపట్టేందుకు మరో రూ.500 కోట్లు కేటాయించింది. మొత్తం రూ.వెయ్యి కోట్లతో మరమ్మతులు చేపట్టడంతో రహదారులు ప్రయాణానికి అనుకూలంగా మారాయి. అయితే ఈ మరమ్మతులు మళ్లీ రాకుండా రెన్యువల్ లేయర్ వేసేందుకు రూ.2,205 కోట్లు మంజూరు చేశారు.
మొత్తం 7,969 కి.మీ. ప్రత్యేక మరమ్మతులు
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో ఎన్నడూ లేని విధంగా 13 జిల్లాల పరిధిలోని 2,726 కి.మీ. రాష్ట్ర రహదారులకు రూ.923 కోట్లు, 5,243 కి.మీ. జిల్లా ప్రధాన రహదారులకు రూ.1,282 కోట్లు కేటాయించారు. ఏడాదిలోగా రోడ్ల ప్రత్యేక మరమ్మతులు పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ మంత్రి శంకర్ నారాయణ అధికారులను ఆదేశించారు. మొత్తం 1,123 పనులు చేపట్టనున్నారు.
పసుపు–కుంకుమ పేరిట గత టీడీపీ సర్కార్ దోపిడీ
రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి డీజిల్/పెట్రోల్‌పై రూపాయి వంతున రోడ్ సెస్ వసూలు చేసేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గతేడాది జరిపిన ఆర్‌అండ్‌బీ సమీక్షలో దిశానిర్దేశం చేశారు. వసూలు చేసిన నిధుల్ని రోడ్ల మరమ్మతులకు కేటాయించాలని నిర్ణయించారు. రోజుకు 7 వేల ప్యాసింజర్ కార్ యూనిట్ల ట్రాఫిక్ ఉండే రోడ్లకు మరమ్మతులు త్వరితగతిన పూర్తవుతాయి. గత టీడీపీ ప్రభుత్వం రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్‌డీసీ)ని తనఖా పెట్టి రూ.3 వేల కోట్ల రుణం తీసుకుంది. ఆ నిధుల్ని ఎన్నికలకు ముందు పసుపు–కుంకుమ పేరిట దారి మళ్లించింది. రోడ్ల మరమ్మతులు చేసిన కాంట్రాక్టర్లకు రూ.450 కోట్ల బకాయిలు పెట్టడంతో వీటిని ఇటీవలే మా ప్రభుత్వం చెల్లించింది. మళ్లీ ఇప్పుడు రూ.2,205 కోట్లతో ప్రత్యేక మరమ్మతులకు పరిపాలన అనుమతులు మంజూరు చేశాం.
– శంకర్‌నారాయణ, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి
రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న రహదారి పనులు, కేటాయించిన నిధులు..
Comments
Please login to add a commentAdd a comment