సాక్షి, అమరావతి: టెండర్లు ఖరారయ్యాక మూడు నాలుగు నెలల్లో యుద్ధప్రాతిపదికన గోదాముల నిర్మాణాలు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రైతు భరోసా కేంద్రాల పరిధిలో పంటల సేకరణ, విత్తనాలు, ఎరువుల పంపిణీ చేస్తున్న నేపథ్యంలో.. వాటికి సమీపంలో 9 వేల గోదాములు, వాటికి అనుబంధంగా పంటలను ఆరబెట్టే ప్లాట్‌ఫామ్‌లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు వీటి నిర్మాణంలో ఎటువంటి జాప్యం జరగకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించడంతో శుక్రవారం వ్యవసాయం, మార్కెటింగ్, వేర్ హౌసింగ్, ఆయిల్‌ఫెడ్, సహకార శాఖలకు చెందిన ముఖ్య బాధ్యులు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. నాబార్డు నుంచి రుణం తీసుకుంటున్న సర్కార్ తొలి విడత నాలుగు వేల గోదాములు, ప్లాట్‌ఫామ్‌లను నిర్మించనుంది. వీటి నిర్మాణాలకు రూ.2,706 కోట్లతో అంచనాలు రూపొందించారు. ప్రస్తుతం మార్కెటింగ్ శాఖకు మండల, జిల్లా స్థాయిలో 1,055 గోదాములు ఉన్నాయి. వీటి నిల్వ సామర్థ్యం 9 లక్షల టన్నులు. వీటిని ఆ శాఖ భారత ఆహార సంస్థ, పౌరసరఫరాల సంస్థ, ఇతర వ్యాపార సంస్థలకు అద్దెకు ఇస్తోంది.
ఫ్రీ ఫ్యాబ్రికేషన్ విధానంలో నిర్మాణాలు
500 టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములనే అధికంగా నిర్మించాలని సీఎం ఆదేశించారు. ప్రత్యేక పరిస్థితులు ఉన్న చోట 2 వేల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు కడతారు. పాత విధానంలో జాప్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఫ్రీ ఫ్యాబ్రికేషన్ విధానంలో వీటిని నిర్మించనున్నారు. నాలుగు వేల గోదాములను ఐదారు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు ఆహ్వానించనున్నారు. ఫ్రీ ఫ్యాబ్రికేషన్ నిర్మాణంలో అనుభవం కలిగిన ప్రముఖ సంస్థలు టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు విధించనున్నారు.
సర్టిఫికెట్ ఇస్తేనే నగదు చెల్లింపులు
గోదాముల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ విభాగం.. పనులను పరిశీలించి, సర్టిఫికెట్ ఇచ్చాకే నగదు చెల్లింపులు చేస్తారు. పనుల పర్యవేక్షణకు అవసరమైతే గ్రామ సచివాలయాలు, మార్కెటింగ్ సిబ్బందిని వినియోగిస్తారు. నిర్మాణాలు పూర్తయ్యాక వీటి పర్యవేక్షణ, వచ్చే ఆదాయం తదితర బాధ్యతలను సహకార శాఖకు అప్పగించే విధానంలో పాటించాల్సిన నిబంధనలపై అధికారులు చర్చించారు. కస్టమ్ హైరింగ్ సెంటర్లకు పంపిణీ చేయాల్సిన యంత్ర పరికరాలు, ఇతర బాధ్యతలను ఆగ్రోస్‌కు అప్పగించారు. ఏ ప్రాంతంలో రైతులకు ఎటువంటి యంత్రాలు అవసరమవుతాయి? వాటిని రైతులకు అద్దెకు ఇచ్చే సమయంలో రైతు సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పాటించాల్సిన విధివిధానాలపై చర్చించారు. పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను సీఎం ఆమోదానికి పంపనున్నామని మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మధుసూదనరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment