ఈ ఏడాది 7,13,150 మంది రైతులకు టార్పాలిన్‌లు, వ్యక్తిగత యంత్రాలు, పరికరాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. ఇందులో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకు.. 20 శాతం మిగిలిన వర్గాల వారికి ఇవ్వాలి. అవసరమైన చోట భూ విస్తీర్ణాన్ని బట్టి పరికరాలు పంపిణీ చేయాలి. షెడ్యూల్డ్ ఏరియాల్లో ఎస్టీ రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఆర్బీకే యూనిట్‌గా వీటి పంపిణీ జరగాలి.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలోని ప్రతి రైతు భరోసా కేంద్రంలోనూ వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఈ కేంద్రాల్లోని పరికరాలు, యంత్రాలన్నీ రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలి. ఎలాంటి పరికరాలు, వాటి అద్దె, ఏయే సేవలు అందుబాటులో ఉన్నాయో తెలిపే సమగ్రమైన పోస్టర్లను ఆర్బీకేల్లో ప్రదర్శించాలి. రైతు గ్రూపులే కాదు.. ఆయా గ్రామాల్లోని రైతులందరూ సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
వ్యవసాయ అనుబంధ రంగాలపై గురువారం ఆయన తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 10,750 ఆర్బీకేలు ఉండగా, ఇప్పటికే 6,525 ఆర్బీకేల్లో యంత్ర సేవ పథకం కింద వ్యవసాయ ఉప కరణాల పంపిణీ పూర్తి చేశామని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. వరి ఎక్కువగా సాగయ్యే ప్రాంతాల్లో 1,615 క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీలు ఏర్పాటు చేయాలని సంకల్పించగా, ఇప్పటికే 391 చోట్ల హార్వెస్టర్లతో పాటు పలు రకాల యంత్రాల పంపిణీ పూర్తి చేశామని చెప్పారు.
ఇప్పటి వరకు రూ.690.87 కోట్ల విలువైన పరికరాలు పంపిణీ చేయగా, ఇందులో సబ్సిడీ రూపంలో రూ.240.67 కోట్లను ప్రభుత్వం అందించిందని వివరించారు. కాగా, మిగిలిన 4,225 ఆర్బీకేల్లో కూడా యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటుతో పాటు క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీ ఏర్పాటుకు 2022–23కు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,325 కోట్లు ఖర్చు చేయనుందని, ఇందులో వ్యక్తిగత పరికరాల పంపిణీ కోసం రూ.910 కోట్లు వెచ్చిస్తుందన్నారు.
ఇందులో ప్రభుత్వం రూ.1,014 కోట్లు సబ్సిడీ భరిస్తుందని తెలిపారు. రైతులకు టార్పాలిన్లు, స్ప్రేయర్లు, డ్రోన్లు, ఇతర యంత్రాలు, వ్యక్తిగత ఉపకరణాలను దశల వారీగా అందించాలని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
సత్వరమే అగ్రి ఇన్‌ఫ్రా పనులు
► అగ్రి ఇన్‌ఫ్రా కింద చేపట్టిన పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి. ఆర్బీకేల పరిధిలో కలెక్షన్ సెంటర్లు, కోల్డ్ రూమ్‌లతో పాటు గోదాముల నిర్మాణం వేగవంతం చేయాలి.
► ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా మహిళలను తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం వైఎస్సార్ చేయూత ద్వారా వారి సుస్థిర ఆర్థిక ప్రగతికి స్వయం ఉపాధి పథకాలు కొనసాగించాలి. చేయూత పథకం కింద లబ్ధి పొందే వారికి పాడి పశువులు పంపిణీ చేయడం ద్వారా పాల ఉత్పత్తి, విక్రయం తదితర వ్యాపారాల్లో వారిని భాగస్వాములను చేయాలి.
► అమూల్, అలానా తదితర కంపెనీలతో భాగస్వామ్యం ద్వారా చేయూత లబ్ధిదారులైన మహిళలు ఆర్థికంగా ప్రయోజనం పొందేలా చూడాలి. ఇందులో భాగంగా పశువుల పెంపకానికి మరింత ప్రోత్సాహం అందించాలి. మేకలు, గొర్రెల పెంపకానికి అవసరమైన సహకారం అందించాలి. ఈ ప్రక్రియ నిరంతం కొనసాగేలా చర్యలు తీసుకోవాలి.
మరింతగా పాల సేకరణ
► ప్రస్తుతం రాష్ట్రంలో 2,34,548 మహిళా రైతుల నుంచి అమూల్ సంస్థ ఇప్పటి వరకు 419.51 లక్షల లీటర్ల పాలు సేకరించింది. అమూల్‌తో ప్రాజెక్టు ద్వారా ప్రతి రోజూ 1.03 లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతోంది. ఇప్పటి వరకు రూ.179.65 కోట్ల చెల్లింపులు జరిగాయి. ప్రైవేటు డెయిరీలతో పోలిస్తే అదనంగా రూ.20.66 కోట్ల మేర పాడి రైతులు లబ్ధి పొందారు.
► అమూల్ ప్రాజెక్టు వల్ల ఇతర డెయిరీలు పాల సేకరణ ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ఆయా డైరీలు ధరలు పెంచడం వల్ల రాష్ట్రంలో రైతులకు అదనంగా రూ.2,020.46 కోట్ల లబ్ధి పొందగలిగారు. ఈ నేపథ్యంలో అమూల్ ద్వారా పాల సేకరణను మరింత పెంచే దిశగా చర్యలు తీసుకోవాలి. సాధ్యమైనంత త్వరగా చిత్తూరు డెయిరీని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలి.
► అమూల్ పాల సేకరణ వచ్చే రెండు నెలల్లో మరో 1,359 గ్రామాలకు విస్తరిస్తుందని అధికారులు తెలిపారు. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంలో భాగంగా ఫేజ్–1లో చేపట్టిన జువ్వలదిన్నె, మచిలీపట్నం, నిజాంపట్నం పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, వ్యవసాయ, ఉద్యాన, మత్స్య శాఖ కమిషనర్లు చేవూరు హరికిరణ్, ఎస్‌ఎస్ శ్రీధర్, కే కన్నబాబు, పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్ర కుమార్, పౌర సరఫరాల సంస్థ ఎండీ వీర పాండ్యన్, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ అహ్మద్ బాబు, మార్క్‌ఫెడ్ ఎండీ ప్రద్యుమ్న, ఇతర అధికారులు పాల్గొన్నారు.
వ్యవసాయ అనుబంధ రంగాలపై ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్
ధాన్యం సేకరణలో వలంటీర్లకు భాగస్వామ్యం
మిల్లర్ల పాత్ర లేకుండా పారదర్శకంగా ధాన్యం సేకరణకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏ దశలోనూ మిల్లర్లు జోక్యం చేసుకోకుండా చూడాలన్నారు. ఆర్బీకేల ద్వారా ధాన్యం సేకరణతో రైతులకు గరిష్ట ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ధాన్యం సేకరణలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. ఇందులో భాగంగా వలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. ఇందుకోసం వారికి ఇన్సెంటివ్‌లు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు అధికారులు వివరించగా, ఎస్‌ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) పకడ్బందీగా తయారు చేయాలని సీఎం ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment