
సాక్షి, గుంటూరు: జనరిక్ మందులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, వైద్య ఆరోగ్య విభాగానికి చెందిన వారంతా ఈ విషయంపై చొరవచూపాలని ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని సూచించారు. మంగళగిరిలోని నిర్మలా ఫార్మసీ కళాశాలలో ప్రభుత్వం అధికారికంగా జనఔషధి దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించింది. విడదల రజిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్ని కంపెనీలు మార్కెటింగ్, పర్సంటేజీల ఆశచూపుతూ మందులను అధిక ధరలకు విక్రయించే ప్రయత్నం చేస్తుంటాయని, వీరి మాయలో ఎవరూ పడకూడదని కోరారు.
మందుల చీటిలపై రోగానికి సంబంధించిన ఔషధం పేరే రాయలని పేర్కొన్నారు. జన ఔషధి దుకాణాల్లో అత్యంత చౌక ధరకే మందులు దొరుకుతాయని తెలిపారు. నేరుగా కంపెనీ నుంచి వచ్చిన ఔషధాన్ని ప్రజలకు అందజేస్తారని చెప్పారు. చాలా చౌకగా, అత్యంత నాణ్యమైన మందులు జన ఔషధి దుకాణాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. రోగులంతా ఈ దుకాణాల్లోనే మందులు కొనుగోలు చేసేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఔషధ నియంత్రణ అధికారులదేనని చెప్పారు.
జగనన్న లక్ష్యాలు నెరవేర్చాలి
సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమున్నత లక్ష్యంతో పనిచేస్తున్నారని విడదల రజిని తెలిపారు. పేదలందరికి అత్యంత సులువుగా, వేగంగా నాణ్యమైన వైద్యం పూర్తి ఉచితంగా అందాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య శాలలన్నింటినీ నాడు-నేడు కార్యక్రమం కింద పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందజేస్తున్నామన్నారు. జగనన్న లక్ష్యాలు, ప్రభుత్వ సంకల్పం నెరవేర్చేలా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు పనిచేయాలని పేర్కొన్నారు. ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వ్యవస్థలు నడిచేలా చూడాలన్నారు. ఎవరైనా కంపెనీల పేర్లతో మందుల చీటిలు రాస్తున్నా, వాటిని ఏ మందుల దుకాణాలైనా ప్రోత్సహిస్తున్నా చర్యలకు వెనుకాడొద్దన్నారు. అప్పుడే జన ఔషధి దివాస్ కార్యక్రమాల లక్ష్యాలు నెరవేరుతాయని చెప్పారు.
జన ఔషధి దుకాణాల్లో 1,759 రకాల మందులు
జన ఔషధి దుకాణాల్లో ఏకంగా 1,759 రకాల మందులు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. 280 సర్జికల్ డివైజెస్ కూడా దొరుకుతాయని చెప్పారు. ఇవన్నీ అత్యంత తక్కువ ధరకే లభిస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఈ దుకాణాల వల్ల ఎంతో మేలు జరుగుతుందని, వీరంతా ఔషధి దుకాణాల్లోనే మందులు కొనుగోలు చేసేలా చూడాల్సిన బాధ్యత వైద్యులు, డ్రగ్ విభాగం అధికారులదేనని చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 145 జనఔషధి కేంద్రాలు ఉన్నాయని, వీటి సంఖ్యను మరింతగా పెంచబోతున్నామని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఔషధ నియంత్రణ శాఖ డీజీ రవిశంకర్ నారాయణన్, డైరెక్టర్ ఎంబీఆర్ ప్రసాద్, నిర్మల కళాశాల అధ్యక్షురాలు మరియా సుందరి, కళాశాల ప్రిన్సిపల్ అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: మార్చి, ఏప్రిల్ నెలల్లో ఏపీ ప్రభుత్వ కార్యక్రమాల షెడ్యూల్ ఇదే..
Comments
Please login to add a commentAdd a comment