
సాక్షి, అమరావతి: కడపలో ఉక్కు కార్మాగారం ఏర్పాటుపై పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి బుధవారం క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లిబర్టీ స్టీల్స్ అనే కంపెనీతో కలిసి కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని తొలుత నిర్ణయించామని, అయితే ఆ కంపెనీ ఆర్ధిక పరిస్థితి అంత మెరుగ్గా లేకపోవడం వల్ల ఆ నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టామని పేర్కొన్నారు. లిబర్టీ స్టీల్స్ కు ఫండింగ్ చేసే సంస్థలు దివాళా తీశాయని, ఆ ప్రభావం లిబర్టీ స్టీల్స్‌పై పడిందని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో సదరు కంపెనీతో కలిసి కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న విషయం సహేతకం కాదని భావించి పెండింగ్‌లో పెట్టామని వివరణ ఇచ్చారు.
ఈ విషయమై లిబర్టీ స్టీల్స్‌తో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, ఎల్-2గా వచ్చిన కంపెనీని పరిగణనలోకి తీసుకోవాలా లేక ప్రభుత్వమే నేరుగా చేపట్టాలా అనే అంశం పరిశీలనలో ఉందని, త్వరలో ఏ నిర్ణయం వెల్లడిస్తామని ఆయన ప్రకటించారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వానికి ప్లాన్-బి అమలు చేసే ఉద్దేశం కూడా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని పెద్ద, మధ్య తరహా పరిశ్రమలకు సుమారు రూ. 1000 కోట్లు, ఎంఎస్ఎంఈలకు రూ. 300 కోట్ల ప్రొత్సహాకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఏప్రిల్ 2న ఐటీ వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని, వివిధ సంస్థలకు చెందిన సీఈఓలు, సీఎఫ్ఓలు వర్క్ షాపునకు హాజరు కానున్నారని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment