ప్రతీకాత్మక చిత్రం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: స్థానిక సమరం తొలి దశలో ఏకగ్రీవాలు.. అభ్యర్థుల్లో ఉత్సాహాన్ని నింపాయి. మొదటి దశ పోరు సెమీ ఫైనల్స్‌కు చేరింది. నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. 25 సర్పంచ్, 540 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని అధికారికంగా ప్రకటించారు. కావలి రెవెన్యూ డివిజన్‌లోని 9 మండలాల్లో 163 పంచాయతీలు, 1,566 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల ప్రక్రియ సాగుతోంది. ఏకగ్రీవ స్థానాల అనంతరం మిగిలిన 138 సర్పంచ్, 1,026 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నిక జరగనుంది. సర్పంచ్ స్థానాల్లో 15.33 శాతం, వార్డు సభ్యులు 34.48 శాతం ఏకగ్రీవం అయ్యాయి. మొదటి దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ, ఉప సంహరణ వరకు ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 9న పోలింగ్ ప్రక్రియ జరగనుంది. కావలి డివిజన్‌లోని కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లోని 163 గ్రామ పంచాయతీలు, 1,566 వార్డులకు గత నెల 29 నుంచి 31వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. సర్పంచ్ స్థానాలకు 920, వార్డు సభ్యుల స్థానాలకు 3,788 నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యంతరాలు, పరిశీలన పూర్తి తర్వాత గురువారం ఉప సంహరణకు తుది గడవు పూర్తయ్యే సరికి 25 సర్పంచ్ స్థానాలు, 540 వార్డు సభ్యుల స్థానాల్లో ఒక్కొక్క నామినేషన్ మాత్రమే ఉండడంతో ఏకగ్రీవాలు లాంఛనంగా మారాయి.
ఉదయగిరిలో అత్యధికం
ప్రధానంగా ఉదయగిరి నియోజకవర్గంలో మొదటి విడత ఎన్నికలు జరిగే ఐదు మండలాల్లో 22 సర్పంచ్ స్థానాలు, 366 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కావలి నియోజకవర్గంలో మూడు సర్పంచ్ స్థానాలు, 174 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. జలదంకి మండలంలో 17 పంచాయతీలకు నాలుగు సర్పంచ్, 172 వార్డులకు 57 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. కావలిలో 17 పంచాయతీల్లో ఒకటి, 182 వార్డుల్లో 63, వరికుంటపాడులో 24 పంచాయతీల్లో 5 సర్పంచ్, 212 వార్డు సభ్యుల్లో 85, కలిగిరిలో 23 పంచాయతీల్లో 4 సర్పంచ్, 214 వార్డు సభ్యుల్లో 81, దగదర్తిలో 20 పంచాయతీల్లో ఒక సర్పంచ్, 186 వార్డు సభ్యుల్లో 50, కొండాపురంలో 19 పంచాయతీల్లో 4 సర్పంచ్, 184 వార్డు సభ్యుల్లో 80, బోగోలులో 16 పంచాయతీల్లో ఒక సర్పంచ్, 168 వార్డు సభ్యుల్లో 43, దుత్తలూరులో 17 పంచాయతీల్లో 5 సర్పంచ్, 148 వార్డు సభ్యుల్లో 63 ఏకగ్రీవం అయ్యాయి. అల్లూరులో 10 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరగనుంది. 100 వార్డుల్లో 18 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment