సాక్షి, అమరావతి: ఈనాడు రామోజీరావు తన కళ్లకు ‘పచ్చ’కామెర్లు కమ్మాయని మరోసారి నిరూపించుకున్నారు. అందుకే జాతీయ రహదారుల నిర్మాణంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో ఉన్న వాస్తవం ఈనాడు కళ్లకు కనిపించడంలేదు. ‘జాతీయ రహదారుల పనుల్లో వెనుకబాటు’ అంటూ ఓ అసత్య కథనం ప్రచురించి రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లేందుకు యత్నించింది.
జాతీయ రహదారుల నిర్మాణం, అందుకోసం వేగంగా భూసేకరణలో ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటిస్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిన విషయన్ని ఈనాడు ఉద్దేశపూర్వకంగానే విస్మరించింది. చంద్రబాబు ప్రభుత్వంలో నత్తనడకన సాగిన ప్రాజెక్టులను కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సత్వరం పూర్తిచేసి.. కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలనూ శరవేగంగా సాగేలా చూస్తోంది. ఉదా..
♦ విజయవాడలో బెంజిసర్కిల్ మొదటి ఫ్లై ఓవర్, కనకదుర్గ ఫ్లైఓవర్ పనులను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిచేయలేకపోయింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ రెండు ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసింది.
♦ విజయవాడ బెంజిసర్కిల్ రెండో ఫ్లైఓవర్ పనులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రారంభించి ఏడాదిలో పూర్తిచేసింది. విజయవాడ పశ్చిమ బైపాస్ పనులను శరవేగంగా పూర్తిచేస్తోంది.
♦ అలాగే ఎన్‌హెచ్–216 నిర్మాణ పనులు అత్యంత వేగంగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటోంది.
♦ కేంద్ర ప్రభుత్వం ఈ జాతీయ రహదారిని 2015–16, 2016–17లో మంజూరు చేసింది. ఒంగోలు నుంచి కత్తిపూడి వరకూ తీర ప్రాంతాన్ని ఆనుకుని 374.83 కి.మీ. పొడవున రూ.3,826.84 కోట్లతో జాతీయ రహదారి నిర్మించాలని నిర్ణయించింది. అందుకోసం మొత్తం 10 ప్యాకేజీలుగా ఈ పనులను విభజించారు. ఇందులో చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఒక్క ప్యాకేజీ పనులనే పూర్తిచేయగలిగింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు ప్యాకేజీల పనులను పూర్తిచేశారు. మొత్తంగా ఏడు ప్యాకేజీల రూపంలో 360కి.మీ మేర రహదారిని నిర్మించారు. మిగిలిన మూడు ప్యాకేజీల పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
♦ కాకినాడ బైపాస్ కింద తిమ్మాపురం–గురజానపల్లి జాతీయ రహదారి పనులు 95శాతం పూర్తయ్యాయి. వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి ఆ రహదారి నిర్మాణం పూర్తవుతుంది.
♦ పాసర్లపూడి–దిండి సెక్షన్‌లో రహదారి నిర్మాణం కోసం టీడీపీ ప్రభుత్వ హయాంలో భూసేకరణ పూర్తిచేయలేకపోయారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే ఆ భూసేకరణ ప్రక్రియను పూర్తిచేసి పనులు ప్రారంభించింది. ఇప్పటికే 50శాతం పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది మే నాటికి ఈ రహదారి నిర్మాణం పూర్తిచేస్తారు.
♦ ఇక రేపల్లె, ఈపురుపాలెం సెక్షన్‌లో రహదారి పనుల కోసం భూసేకరణ ప్రక్రియను కూడా టీడీపీ ప్రభుత్వం పూర్తిచేయలేకపోయింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దానిని పూర్తిచేయడమే కాక 90శాతం వరకు నిర్మాణం పనులు పూర్తిచేసింది. ఈ నెలాఖరు నాటికి ఈ పనులు పూర్తికానున్నాయి. ఆర్‌ఓబీతో రహదారిని అనుసంధానించడంతోపాటు టోల్‌ప్లాజా, రెస్ట్ ఏరియా ఏర్పాటు పనులు మాత్రమే పెండింగులో ఉంటాయి. వాటిని కూడా వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిచేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment