సాక్షి, అమరావతి: పిల్లల వ్యాక్సినేషన్‌లో ఏపీ దూకుడు కొనసాగుతోంది. నిర్దేశించిన లక్ష్యంలో శుక్రవారం నాటికి 72 శాతం మందికి వైద్య, ఆరోగ్య శాఖ టీకా ప్రక్రియను పూర్తిచేసి దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. ఇక రాష్ట్రంలో కేవలం 28 శాతం మందికి మాత్రమే టీకా వేయాల్సి ఉంది. దేశంలో ఇప్పటివరకూ 50 శాతానికి పైగా వ్యాక్సినేషన్ పూర్తిచేసిన రాష్ట్రాల జాబితాలో ఏపీ, హిమాచల్‌ప్రదేశ్‌లు మాత్రమే ఉన్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో 68.40 శాతం మంది పిల్లలకు టీకా వేశారు. దక్షిణాదితో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న ఏ ఒక్క పెద్ద రాష్ట్రంలోనూ 50 శాతానికి మించి టీకా పంపిణీ కాకపోవడం గమనార్హం.
సీఎం జగన్ ప్రత్యేక దృష్టి..
మరోవైపు.. దేశవ్యాప్తంగా గత సోమవారం నుంచి 15–18 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా పంపిణీ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం వైఎస్ జగన్.. రాష్ట్రంలో అర్హులైన 24,41,000 మంది పిల్లలకు వారం రోజుల్లో టీకా పంపిణీ పూర్తిచేసేలా సర్కారు కార్యాచరణ రూపొందించింది. దీంతో శుక్రవారం నాటికి 17,52,581 మందికి టీకాలు వేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో టీకాలు వేయడంతో పాటు, వీటి పరిధిలో ఉన్న విద్యా సంస్థల వద్దకు ఆరోగ్య సిబ్బంది వెళ్లి మరీ టీకాలు వేస్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో అత్యధికంగా 1,55,086 మందికి టీకా పంపిణీ చేయాల్సి ఉండగా 91.11 శాతం అంటే 1,41,304 మందికి టీకా పంపిణీ జరిగింది. అదే విధంగా తూర్పు గోదావరిలో 86.36 శాతం, నెల్లూరులో 84.76 శాతం, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 53.59 శాతం మందికి వ్యాక్సినేషన్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment