గత ఏడాది ఉగాది రోజు అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామన్న చంద్రబాబు
వేతనం కూడా రూ.10 వేలకు పెంచుతామని హామీ
అధికారంలోకి వచ్చాక యూటర్న్ తీసుకోవడంపై మండిపాటు
గత జూన్ నుంచి జీతాలూ నిలుపుదల
ప్రభుత్వం మోసం చేసిందంటూ ఆర్నెల్లుగా వలంటీర్ల గగ్గోలు
న్యాయం చేయకపోతే ఎమ్మెల్యే, మంత్రుల ఇళ్ల ముట్టడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వలంటీర్ అసోసియేషన్ నేతలు హెచ్చరిక
సాక్షి,అమరావతి/సత్యనారాయణపురం(విజయవా డ సెంట్రల్)/కర్నూలు (సెంట్రల్): ఎన్నికల ముందు ఉగాది పండుగ రోజున చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మి మోసపోయిన వలంటీర్ల ఆందోళనలు మరింతగా ఊపందుకున్నాయి. వరుసగా గురు, శుక్ర, శనివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మరోవిడత ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 2న గ్రామ, వార్డు సచివాలయం అడ్మిన్‌లకు వినతిపత్రాలు ఇవ్వగా.. 3న జిల్లా కేంద్రాల్లో న్యాయం చేయాలని కోరుతూ వలంటీర్లు మోకాళ్ల మీద కూర్చుని భిక్షాటన చేశారు.
ఇక శనివారం (4న) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వలంటీర్లూ వెనుకకు నడుస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వలంటీర్లకు న్యాయంచేస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక యూటర్న్ తీసుకోవడాన్ని నిరసిస్తూ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ బ్యాక్‌వాక్ చేస్తున్నారన్న దానిని గుర్తుచేస్తూ తమ ఆందోళన నిర్వహించారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగించడంతో పాటు వలంటీర్లకు రూ.10 వేలు ఇచ్చే బాధ్యత తమది అంటూ ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వలంటీర్ల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని వలంటీర్ల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. పైగా.. జూన్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి ఇప్పటివరకు వేతనాలు చెల్లించలేదని వారంటున్నారు. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ వలంటీర్లు వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహిస్తున్నారు.
ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తాం..
ఈ నేపథ్యంలో శనివారం విజయవాడ బీఆర్‌టీఎస్ రోడ్డులో వలంటీర్లు ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ వెనక్కి నడిచి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పరుచూరి రాజేంద్రబాబు, లంక గోవిందరాజులు మాట్లాడుతూ.. విజయవాడ వరద ముంపు సమయంలో వలంటీర్లతో సేవలు చేయించుకుని నేడు కనీసం వారికి సచివాలయాల్లో హాజరు వేసుకునే అవకాశం కూడా కల్పించకుండా వేధిస్తున్నారని మండిపడ్డారు.
వలంటీర్లకు గత ఎనిమిది నెలలుగా జీతాలు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇచ్చిన హామీ మేరకు వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించి వారికి రూ.పది వేల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా 2.60 లక్షల వలంటీర్లు, వారి కుటుంబ సభ్యులు అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడించి నిరసన తెలియజేస్తామని వారు హెచ్చరించారు.
బాబుగారూ.. మా కడుపులు కొట్టొద్దు!
ఇక కర్నూలులో కూడా వలంటీర్లు వినూత్నంగా నిరసన వ్యక్తంచేశారు. ఖాళీ ప్లేట్లు పట్టుకుని భిక్షాటన చేశారు. తమ కడుపులు కొట్టొద్దని సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను ఈ సందర్భంగా వేడుకున్నారు. ముందుగా కలెక్టరేట్ గేటు నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా నిర్వహించారు. అనంతరం అక్కడ ధర్నా నిర్వహించి భిక్షాటన చేశారు.
ఈ సందర్భంగా వలంటీర్లు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా స్వచ్ఛంధంగా పనిచేశామని.. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమను తీసివేయడం అన్యాయమన్నారు. ఎన్నికల సమయంలో వలంటీర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. లేదంటే పెద్దఎత్తున వీధి పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమాలకు ఏఐవైఎఫ్ మద్దతిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment