సాక్షి, అమరావతి: ఏపీ గిడ్డంగుల సంస్థ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ఆన్‌లైన్ బాట పట్టింది. గిడ్డంగులను రైతులకు మరింత అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నివిధాలుగా చేయూత అందిస్తున్నారు. ఫలితంగా గిడ్డంగుల సంస్థ కార్యకలాపాలు విస్తరించి లాభాల బాట పట్టింది. ఇదే సందర్భంలో సీఎం ఆదేశాల మేరకు సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చే లక్ష్యంతో ఈ సంస్థలో ఆన్‌లైన్ సేవలను ఆరంభించారు. ఇం దుకోసం ప్రత్యేకంగా ఏపీ వేర్ హౌసింగ్ ఆన్‌లైన్ సర్వీస్ (ఏపీడబ్ల్యూఎస్‌ఓ) పోర్టల్‌ను తీసుకొచ్చారు. తద్వారా సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గడంతో పాటు రైతులకు సత్వర సేవలు అందుబాటులోకి వచ్చాయి. అవసరమైన రైతులు తమకు అవసరమైన గిడ్డంగులను ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకుని ఆన్‌లైన్ ద్వారానే చెల్లింపులు చేసే అవకాశం కలిగింది.
పని తగ్గింది.. పారదర్శకత పెరిగింది
లావాదేవీలన్నీ డిజిటలైజేషన్ చేయడంతో తక్కువ సమయంలో రోజువారీ కార్యకలాపాలన్నీ ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా అప్‌డేట్ చేస్తున్నారు. క్షణాల్లో అవసరమైన రిపోర్ట్స్‌ను జనరేట్ చేస్తున్నారు. మాన్యువల్‌గా చేసే సమయంలో కొన్నిసార్లు తప్పులు దొర్లేవి. ఇవి రోజువారీ కార్యకలాపాలకు ప్రతిబంధకంగా మారేవి. ప్రస్తుతం కార్యకలాపాలన్నీ డిజిటలైజేషన్ చేయడం వల్ల తప్పులకు ఆస్కారం లేకుండా ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా సిబ్బంది పొరపాటుగా నమోదు చేస్తే పైఅధికారులకు అలర్ట్ వచ్చేలా ఏర్పాటు చేశారు.
స్టేట్ డేటా సెంటర్‌లో భద్రం
గతంలో రిజిస్టర్లు, రిపోర్టులను మాన్యువల్‌గా భద్రపర్చడం వల్ల ఇబ్బందులు తలెత్తేవి. రికార్డులు చెదలు పట్టి పాడైపోవడంతో కావాల్సిన సమాచారం దొరక్క ఇబ్బందులు తలెత్తేవి. ప్రస్తుతం ఆన్‌లైన్ సర్వీస్ పోర్టల్ ద్వారా రిజిస్టర్లు, నివేదికలను డిజిటలైజ్ చేయడంతో ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతున్నాయి. వాటిని స్టేట్ డేటా సెంటర్‌లో భద్రపర్చడం వల్ల ఇబ్బందులు తలెత్తాయి. ఇన్సూరెన్స్, లైసెన్స్ రెన్యువల్స్, విద్యుత్, టెలిఫోన్, ఇంటర్నెట్ బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వలన గతంలో సంస్థ ఆర్థికంగా నష్టపోయిన సందర్భాలు ఉండేవి. ప్రస్తుతం ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా సంబంధిత అధికారులకు ఆటోమేటిక్ సిస్టమ్ అలర్ట్స్ వచ్చే ఏర్పాటు చేశారు. దీంతో సకాలంలో స్పందించేందుకు వీలు కలుగనుంది.
లాభాల బాటలో
నాలుగు వేల టన్నుల సామర్థ్యంతో 1958లో ఏర్పాటైన రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు 2018–19 నాటికి 5.92 లక్షల టన్నుల సామర్థ్యం గల గోడౌన్స్ ఉండేవి. గడచిన మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితంగా కొత్తగా 2.44 లక్షల టన్నుల సామర్థ్యం కల్గిన గోడౌన్స్ అందుబాటులోకి వచ్చాయి. గిడ్డంగుల సంస్థకు ప్రస్తుతం 69 సొంత గిడ్డంగులు ఉండగా.. 6.39 లక్షల టన్నుల సామర్థ్యం గల మరో 58 ప్రైవేట్ గోడౌన్లను కూడా నిర్వహిస్తోంది. మొత్తంగా 14.75 లక్షల టన్నుల సామర్థ్యం గల గోడౌన్లను నిర్వహిస్తూ 2021–22లో రికార్డు స్థాయిలో రూ.305 కోట్ల ఆదాయాన్ని గిడ్డంగుల సంస్థ ఆర్జించింది. ఖర్చులు, పన్నులు పోగా రూ.33.13 కోట్ల నికర లాభాలను సంస్థ ఆర్జించింది. కాగా, ప్రస్తుతం మరో 69,600 టన్నుల నిల్వ సామర్థ్యం గల గోడౌన్స్ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment