సాక్షి, అమరావతి: కృష్ణా బోర్డు సమావేశంలో చర్చించిన తరువాతే ప్రాజెక్టుల తనిఖీకి కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్ 22న కేంద్ర జల్ శక్తి శాఖ రాసిన లేఖలోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేశామని గుర్తు చేసింది. కృష్ణా, గోదావరి బోర్డుల్లో ఛైర్మన్, సభ్యులు, సీఈలుగా ఇరు రాష్ట్రాలకు చెందని అధికారులను మాత్రమే నియమించాలని కేంద్ర జల్ శక్తి శాఖ గత నెల 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొనటాన్ని గుర్తు చేసింది. కానీ రాయలసీమ ఎత్తిపోతల తనిఖీకి నియమించిన కమిటీలో తెలంగాణకు చెందిన దేవేందర్‌రావును సభ్యుడిగా నియమించారని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు మంగళవారం కృష్ణా బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్‌కు లేఖ రాశారు.
బోర్డు నియమించిన కమిటీ రాయలసీమ ఎత్తిపోతలను ఈనెల 5న పరిశీలిస్తుందని, అందుకు ఏర్పాట్లు చేయాలంటూ కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే సోమవారం శ్యామలరావుకు లేఖ రాశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే కమిటీ ఏర్పాటులో నిబంధనలు పాటించలేదని అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర జల్ శక్తి శాఖ మార్గదర్శకాల ప్రకారం బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించాకే తనిఖీ కమిటీని నియమించాలని కృష్ణా బోర్డును మరోసారి కోరింది. తెలంగాణ సర్కార్ అనుమతి లేకుండా పాలమూరు–రంగారెడ్డి, డిండి, భక్తరామదాస, తుమ్మిళ్ల, మిషన్ భగీరథ, నెట్టెంపాడు సామర్థ్యం పెంపు, కల్వకుర్తి సామర్థ్యం పెంపు, ఎస్సెల్బీసీ సామర్థ్యం పెంపు ప్రాజెక్టులను చేపట్టిందని పేర్కొంది. వీటి తర్వాతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాత ఆయకట్టుకు నీళ్లందించడానికే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టిందని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో అనుమతి లేకుండా మొదట చేపట్టిన ప్రాజెక్టులను తొలుత తనిఖీ చేసి ఆ తర్వాత రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించాలని సూచించింది.
తటస్థులతోనే తనిఖీ కమిటీ
Published Wed, Aug 4 2021 3:22 AM | Last Updated on Wed, Aug 4 2021 3:22 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment