విజయవాడ పున్నమి ఘాట్ వద్ద నిర్మాణం పూర్తయిన ఇండోర్ సబ్‌స్టేషన్
సాక్షి, అమరావతి బ్యూరో: ఈ వేసవిలో విద్యుత్ కోతలకు ఆస్కారం లేకుండా ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ సీపీడీసీఎల్) చర్యలు తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఈ డిస్కంలో విద్యుత్ డిమాండ్ లోడు సుమారు 5,010 మెగావాట్ల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. దీనిని దృష్టిలో ఉంచుకుని డిస్కం పరిధిలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 24/7 అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఇంటిగ్రేటెడ్ పవర్ సిస్టం స్కీం (ఐపీడీఎస్) కింద విజయవాడ, గుంటూరు జిల్లాల్లో నిర్మిస్తున్న ఎనిమిది జీఐఎస్ కొత్త ఇండోర్ సబ్‌స్టేషన్ల (33/11కేవీ)ను అందుబాటులోకి తెస్తోంది.
చదవండి: ఉల్లి రైతుకు ఊతం
విజయవాడ భవానీపురం, కాళేశ్వరరావునగర్, రామలింగేశ్వరనగర్, గుంటూరు జిల్లా నిడమర్రు, మంగళగిరి, కుంచనపల్లి, గుంటూరు నెహ్రూనగర్, టీచర్స్ కాలనీల్లో ఇండోర్ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి రూ.54.29 కోట్లు వెచ్చించింది. రూ.98.20 కోట్లతో నిర్మిస్తున్న 33/11 కేవీ సామర్థ్యం ఉన్న 32 కొత్త అవుట్ డోర్ సబ్‌స్టేషన్ల పనులను వేగవంతం చేస్తోంది. వివిధ సబ్‌స్టేషన్లలో 52 పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచడానికి ప్రతిపాదించింది. విద్యుత్ సరఫరా మెరుగు కోసం 33 కేవీ లైన్ల పనులు 35, 11 కేవీ లైన్లకు సంబంధించి 145 పనులు శరవేగంగా పూర్తి చేయడంపై దృష్టి సారించింది. అదనంగా 512 త్రీ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్లు, 703 సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్లను మంజూరు చేసింది. వీటితో పాటు 33 కేవీ, 11 కేవీ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ, మరమ్మతు పనులను సీపీడీసీఎల్ అధికారులు ముమ్మరం చేశారు.
అధిక లోడ్ నియంత్రణ
మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల భద్రత చర్యల్లో భాగంగా ఎంసీసీబీ బాక్సుల ఏర్పాటు సత్వరమే పూర్తయ్యేలా చూస్తున్నారు. ఇలా వేసవి డిమాండ్, అవసరాలను బేరీజు వేసుకుని అంతరాయం లేని విద్యుత్ సరఫరాకు చర్యలు చేపడ్తున్నారు. వేసవిలో అధిక లోడు పంపిణీ జరిగి టీవీలు, ఫ్రిజ్‌లు, కంప్యూటర్లు, ఏసీలు వంటి విలువైన గృహోపకరణాలు కాలిపోకుండా సక్రమంగా విద్యుత్ పంపిణీ జరిగేలా డిస్కం సిబ్బంది నిరంతరం లోడ్‌ను పర్యవేక్షిస్తారు.
వ్యవసాయ ఫీడర్లకు 9 గంటల విద్యుత్
డిస్కం పరిధిలోని వ్యవసాయ పంపుసెట్లకు పగటి పూట తొమ్మిది గంటలు త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా జరిగేలా రూ.117.07 కోట్లను వెచ్చిస్తున్నారు. ఇప్పటి వరకు మూడు ప్యాకేజీల్లో రూ.83.30 కోట్లు ఖర్చు చేశారు. ఇలా మొత్తం 1,400 వ్యవసాయ ఫీడర్లలో 1,392 ఫీడర్లు పగలు తొమ్మిది గంటల పాటు విద్యుత్ సరఫరాకు వీలుగా అభివృద్ధి చేశారు
24/7 విద్యుత్ సరఫరా..
ప్రభుత్వ ఆదేశాలతో వేసవిలో డిస్కం పరిధిలో 24/7 విద్యుత్ సరఫరా జరిగేలా ప్రణాళిక రూపొందించాం. నిధుల కోసం వెనకడుగు వేయకుండా నిరంతరాయంగా విద్యుత్ పంపిణీకి చర్యలు తీసుకుంటున్నాం. వేసవి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సరఫరా మెరుగు పరుస్తాం. నిర్మాణంలో ఉన్న వివిధ సబ్‌స్టేషన్లను సత్వరమే పూర్తి చేస్తున్నాం. విద్యుత్ చౌర్యంతో ఆకస్మికంగా లోడ్ పెరిగి షార్ట్ సర్క్యూట్‌తో గృహోపకరణాలు కాలిపోయే ప్రమాదం ఉంది. డిస్కంనకూ నష్టం వాటిల్లుతుంది. అందువల్ల ఎక్కడైనా విద్యుత్ చౌర్యం జరిగితే వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరుతున్నాం.
-జె. పద్మ జనార్దనరెడ్డి, సీఎండీ, ఏపీ సీపీడీసీఎల్
Comments
Please login to add a commentAdd a comment