సాక్షి, అమరావతి: సచివాలయాలకు అనుబంధంగా ఉన్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న గ్రామ పశు సంవర్ధక సహాయకుల (వీఏహెచ్‌ఏ) పోస్టుల కోసం 19,323 మంది దరఖాస్తు చేశారు. ఆర్బీకేల్లో ఖాళీగా ఉన్న 1,896 వీఏహెచ్‌ఏ పోస్టుల భర్తీకి గత నెల 20వ తేదీన ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 11వ తేదీతో దరఖాస్తు గడువు ముగియగా, ఒక్కో పోస్టుకు సగటున 10 మంది దరఖాస్తు చేశారు. అనంతపురం జిల్లాలో 473 పోస్టులకు 1,079 మంది దరఖాస్తు చేసుకున్నారు. విజయనగరం జిల్లాలో 13 పోస్టులకు 1,539 మంది దరఖాస్తులు సమర్పించారు.
దరఖాస్తుదారుల అర్హతలను పరిశీలించి ఈ నెల 27వ తేదీ నుంచి హాల్‌టికెట్లు జారీ చేస్తారు. డిసెంబర్ 31వ తేదీన జిల్లా కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష రెండు విభాగాలుగా మొత్తం 150 మార్కులకు ఉంటుంది. పార్ట్ ‘ఏ’లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 50 మార్కులకు, పార్ట్ ‘బీ’ పశు సంవర్ధక సంబంధిత సబ్జెక్టు 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కుల నిబంధన కూడా ఉంది. ఒక్కో తప్పు సమాధానానికి 1/3వ వంతు చొప్పున మార్కులు తగ్గిస్తారు.
ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న వారికి వెయిటేజ్ మార్కులు కూడా కేటాయిస్తారు. గోపాలమిత్ర, గోపాలమిత్ర సూపర్‌వైజర్లు, 1,962 వెట్స్, ఔట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారికి ప్రతి ఆర్నెల్ల సర్విసుకు ఒకటిన్నర మార్కుల చొప్పున గరిష్టంగా 15 మార్కుల వరకు కేటాయిస్తారు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా జిల్లాల వారీగా జాబితాలను విడుదల చేస్తారు. కలెక్టర్ నేతృత్వంలో జిల్లా ఎంపిక కమిటీల ఆధ్వర్యంలో రిజర్వేషన్ల దామాషా ప్రకారం తుది జాబితాలను రూపొందించి నియామక పత్రాలు జారీ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment