
గుంటూరు ఎడ్యుకేషన్: పెండింగ్‌లో ఉన్న డీఎస్సీ–2018 ఉపాధ్యాయ నియామకాలకు మోక్షం లభించటం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనమని ఏపీ టీచర్స్ రిక్రూట్‌మెంట్ కన్వీనర్ కె.రవీంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. గుంటూరులోని జిల్లా పరీక్షా భవన్‌లో శనివారం జరిగిన డీఎస్సీ–2018 కౌన్సెలింగ్ ప్రక్రియను రవీంద్రనాథ్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ–2018 ప్రక్రియ పరీక్షలకే పరిమితమైందన్నారు.
న్యాయపరమైన వివాదాలతో నిలిచిపోయిన నియామక ప్రక్రియ సీఎం వైఎస్ జగన్ చొరవతో ఎట్టకేలకు పరిష్కారానికి నోచుకుందని తెలిపారు. శనివారం రాష్ట్రంలోని 13 జిల్లాల వారీగా చేపట్టిన కౌన్సెలింగ్‌లో 3,524 ఎస్జీటీ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు తెలిపారు. నాలుగు రోజుల వ్యవధిలోనే జాబితాల విడుదల, సర్టిఫికెట్ల పరిశీలనతో పాటు కౌన్సెలింగ్ చేపట్టి నియామకాలను పూర్తి చేశామన్నారు.