సాక్షి, విశాఖపట్నం: ప్రజా రవాణా సంస్థ (ఆర్టీసీ) ప్రయాణికులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తోంది. ప్రయాణికులు ప్రైవేటు ఆపరేటర్ల వైపు మళ్లకుండా తగు చర్యలు తీసుకుంటోంది. ఫలితంగా సంస్థ ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్)తో పాటు ఆదాయాన్ని మెరుగు పరచుకునేందుకు పాటుపడుతోంది. ఇప్పటికే వయోవృద్ధులకు (సీనియర్ సిటిజన్లకు) టిక్కెట్టులో 25 శాతం రాయితీ ఇస్తోంది. తాజాగా ఇప్పుడు మరికొన్ని రాయితీలను అందజేస్తోంది.
నలుగురు ప్రయాణికులు (పిల్లలు సహా) ఒకేసారి టిక్కెట్టు తీసుకుంటే చార్జీ మొత్తంలో ఐదు శాతం రాయితీ ఇస్తుంది. ఇది కుటుంబాలతో కలిసి ప్రయాణం చేసే వారికి లాభదాయకం కానుంది. అలాగే ఈ–వాలెట్ ద్వారా టిక్కెట్టును బుక్ చేసుకున్నా చార్జీలో ఐదు శాతం సొమ్ము తగ్గించే వెసులుబాటు కల్పించింది. కాగా ప్రయాణికులు రానూపోనూ టిక్కెట్టును ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే తిరుగు ప్రయాణం చార్జీలో 10 శాతం తగ్గిస్తుంది.
ఈ సదుపాయాన్ని సంక్రాంతి, దసరా వంటి పండుగల సీజన్లలో నడిపే ప్రత్యేక బస్సులకూ వర్తింపజేస్తుంది. రానున్నది సంక్రాంతి సీజను కావడంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికుల రాకపోకలు సాగిస్తారు. దీంతో ఇది ఇటు ప్రయాణికులకు, అటు ఆర్టీసీకి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఆర్టీసీ అధికారులు ఇప్పటికే రానున్న సంక్రాంతికి విశాఖ జిల్లా నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 550 ప్రత్యేక బస్సులను నడపనున్నారు.
ఈ బస్సుల్లో రెగ్యులర్ చార్జీలే తప్ప మునుపటిలా టిక్కెట్టుపై 50 శాతం అదనపు చార్జీ వసూలు చేయబోమని ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే ప్రకటించింది. ఈ నిర్ణయం కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు పెరిగేందుకు దోహదపడనుంది. ఫలితంగా ఆదాయం కూడా పెరగనుంది. ఆర్టీసీ అందిస్తున్న ఈ రాయితీ సదుపాయాలను ప్రయాణికులు వినియోగించుకోవాలని విశాఖ జిల్లా ప్రజా రవాణా శాఖాధికారి (డీపీటీవో) ఎ.అప్పలరాజు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment