సమ్మె వద్దు.. ఆర్టీసీని కాపాడుకుందాం | APSRTC Chairman Mallikarjunareddy appeals to company employees | Sakshi
Sakshi News home page

సమ్మె వద్దు.. ఆర్టీసీని కాపాడుకుందాం

Published Fri, Feb 4 2022 4:43 AM | Last Updated on Fri, Feb 4 2022 4:43 AM

APSRTC Chairman Mallikarjunareddy appeals to company employees - Sakshi

సాక్షి, అమరావతి: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన మేలును మర్చిపోవద్దని సంస్థ ఉద్యోగులకు ఆర్టీసీ చైర్మన్‌ ఎ.మల్లికార్జునరెడ్డి సూచించారు. ఇతర సమస్యలను కూడా సీఎం జగన్‌ త్వరలోనే పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు. తాజా పీఆర్సీకి, ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధం లేదన్నారు. ఆర్టీసీని కాపాడుకునేందుకు.. సమ్మెకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీని అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అందులో ముఖ్యమైనదని చెప్పారు.

ఆర్టీసీ ఉద్యోగుల మనఃసాక్షికి కూడా ఆ విషయం తెలుసన్నారు. ప్రభుత్వం రెండేళ్లలో ఆర్టీసీ ఉద్యోగుల జీతాల కోసం రూ.6,200 కోట్లకు పైగా ఖర్చు చేసిందని వివరించారు. సంస్థకు రూ.6 వేల కోట్ల అప్పులుండగా.. కరోనా వల్ల ఆదాయం తగ్గడంతో కేవలం రూ.1,490 కోట్లే తీర్చగలిగామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఎవరో చెప్పిన మాటలకు ప్రభావితమై సమ్మెకు దిగితే.. సంస్థ తీవ్రంగా నష్టపోతుందనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. ఆ భారం కూడా మళ్లీ ఉద్యోగులపైనే పడుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేయడం వల్ల అక్కడి ఉద్యోగుల ప్రయోజనాలకు ఎంతగా విఘాతం కలిగిందో ఓసారి గుర్తు చేసుకోవాలని మల్లికార్జునరెడ్డి సూచించారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు వెళ్లరనే తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కొన్ని సంఘాలు సమ్మెలో పాల్గొనట్లేదని ప్రకటించాయని.. మిగిలిన సంఘాలు కూడా సమ్మెకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకుండా మెరుగైన సేవలందించి.. ఆర్టీసీని అభివృద్ధి పథంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ఉద్యోగులపైనా ఉందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement