
సాక్షి, అమరావతి: దసరా సందర్భంగా ప్రత్యేక బస్సుల్ని నడపటం ద్వారా ఏపీఎస్‌ఆర్టీసీ రూ.135 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నడిపిన దసరా ప్రత్యేక బస్సులకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. అత్యధికంగా ఈ నెల 18న రూ.17.05 కోట్ల రాబడి సాధించింది. ప్రత్యేక బస్సుల ద్వారా మొత్తం 1.40 లక్షల మంది అదనపు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది.
దసరా స్పెషల్ కింద ఆర్టీసీ 907 బస్సు సర్వీసులు నడిపింది. వాటిలో హైదరాబాద్‌కు 303, విజయవాడకు 152, విశాఖపట్నానికి 122, బెంగళూరుకు 95, రాజమహేంద్రవరానికి 89, తిరుపతికి 41, చెన్నైకి 12, ఇతర ప్రాంతాలకు 93 ప్రత్యేక బస్సులను నడిపింది. కాగా, రోజువారీ సర్వీసుల కింద నడిపిన 3,332 బస్ సర్వీసుల్లో సాధారణ చార్జీలనే వసూలు చేశారు.
కోవిడ్ నిబంధనల్ని అనుసరించి, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా 50 మంది అధికారులు, 250 మంది సూపర్‌వైజర్లను వివిధ ప్రాంతాల్లో వినియోగించి బస్ సర్వీసుల నిర్వహణను ఆర్టీసీ పర్యవేక్షించింది. ఆర్టీసీని ఆదరించిన ప్రయాణికులకు ఆ సంస్థ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు కృతజ్ఞతలు తెలిపారు. దసరా రద్దీ సమయంలో సమర్థంగా విధులు నిర్వర్తించిన ఆర్టీసీ ఉద్యోగులను అభినందించారు.