సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీ ఎస్‌ఎస్‌డీసీ) కుంభకోణం తీగ లాగితే దేశవ్యాప్తంగా డొంక కదులుతోంది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితుల పన్నాగంతో సాగిన ఈ కుంభకోణం కేవలం మన రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదనే విషయం సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. షెల్ కంపెనీల ద్వారా కర్ణాటక, గుజరాత్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వైనం తాజాగా వెలుగు చూసింది. మరోవైపు ఏపీ ఎస్‌ఎస్‌డీసీ నిధులను నిబంధనలకు విరుద్ధంగా సింగపూర్‌కు తరలించి దారి మళ్లించినట్టు వెల్లడైంది. దర్యాప్తులో వెలుగు చూసిన ఈ అంశాలను సం బంధిత రాష్ట్రాలతోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి నివేదించాలని రాష్ట్ర సీఐడీ విభాగం నిర్ణయించింది. సీఐడీ దర్యాప్తులో బహిర్గతమైన అంశాలిలా ఉన్నాయి.
చదవండి: దశాబ్దాల దందాలకు కళ్లెం
దేశవ్యాప్త కుంభకోణమిది
యువతకు ఉపాధి కల్పనా నైపుణ్యాల శిక్షణ పేరిట సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ముసుగులో అప్పటి ప్రభుత్వ పెద్దలు రూ.371 కోట్లు కొల్లగొట్టారు. అందుకోసం స్కిల్లర్, తదితర షెల్ కంపెనీలు సృష్టించి నిధులు దారి మళ్లించారు. అదే రీతిలో సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు కర్ణాటక, గుజరాత్, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలతోనూ ఉపాధి కల్పనా నైపుణ్యాల శిక్షణ పేరిట ఒప్పందం చేసుకున్నాయి. అక్కడా షెల్ కంపెనీలకు నిధులను మళ్లించి దోపిడీకి పాల్పడ్డాయి. టీచింగ్ మెటీరియల్స్, మేథో హక్కులు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు, హై–ఎండ్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ మెటీరియల్ పేరిట స్కిల్లర్ అనే షెల్ కంపెనీకి భారీగా నిధులు కట్టబెట్టారు. ఈ కేసులో సీఐడీ అరెస్ట్ చేసిన షెల్ కంపెనీల ప్రతినిధులను విచారించగా మొత్తం బాగోతం బట్టబయలైంది. ఈ విషయాన్ని కర్ణాటక, గుజరాత్, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించాలని సీఐడీ నిర్ణయించింది. ఈ ముఠా దేశవ్యాప్తంగా కుంభకోణానికి పాల్పడినట్టు కూడా సీఐడీ గుర్తించింది. దాంతో సీఐడీ ఈ విషయాన్ని ఈడీ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది.
నకిలీ ఇన్వాయిస్‌లతో..
ఒప్పందం ప్రకారం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు 90 శాతం వాటాను చెల్లించకపోయినా ప్రభుత్వం మాత్రం తన వాటా 10 శాతం రూ.371 కోట్లను ఆ సంస్థలకు చెల్లించేసింది. అందులో రూ.241 కోట్లను నకిలీ ఇన్వాయిస్‌లతో స్కిల్లర్ కంపెనీకి మళ్లించారు. కాగా స్కిల్లర్ కంపెనీ కేంద్ర ఫెమా చట్టాలకు విరుద్ధంగా నిధులను సింగపూర్‌లోని ఓ సంస్థకు తరలించింది. ఈ విషయాన్సి యాక్సిస్ బ్యాంక్ అధికారులు ధ్రువీకరించారు. మరో షెల్ కంపెనీ అలైడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) ప్రతినిధి శిరీష్‌చంద్ర షాను అరెస్ట్ చేసి విచారించడం ద్వారా సీఐడీ అధికారులు మరిన్ని కీలకాంశాలను రాబట్టారు. నిబంధనలకు విరుద్ధంగా బ్యాంక్ అకౌంట్ల ద్వారా నిధులను దారి మళ్లించారని అతడు అంగీకరించాడు. అంటే ఏపీ ఎస్‌ఎస్‌డీసీ కుంభకోణం నిధులను హవాలా ద్వారా కొల్లగొట్టారని తేలింది.
Comments
Please login to add a commentAdd a comment