ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, గుంటూరు డెస్క్: భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చాయి. దీంతో భార్య అలిగి పుట్టింటికి వెళ్లింది. ఇరు కుటుంబాల పెద్దలు సర్ది చెప్పడంతో కొద్దికాలంగా దంపతులు కలిసే కాపురం చేస్తున్నారు. పుట్టింటి వద్ద ఉన్న రెండేళ్ల కాలంలో ఓ యువకుడితో ఆమెకు వివాహేతర బంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో యువకుడు ఇంటికి వచ్చిపోతుండటం, భార్య తరచూ ఎక్కడికో వెళ్లి వస్తుండటంతో అనుమానం వచ్చిన భర్త ఆమెను పద్ధతి మార్చకోవాలని హెచ్చరించాడు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించిన భార్య, ప్రియుడితో కలిసి హత్య చేయించింది.
అనుమానమే పెనుభూతమై..
ఉపాధి కోసం ముగ్గురు పిల్లలతో పట్టణానికి వచ్చారు ఆ దంపతులు. ఇద్దరూ రోజువారీ కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అధిక సంతానానికి తోడు భర్త మద్యానికి బానిస కావడంతో ఖర్చులు పెరిగాయి. వీరుంటున్న ఇంటి పక్కనే భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళ వేరే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. వీరి ఇబ్బందుల్ని గుర్తించి ఆమె పలుమార్లు డబ్బుసాయం అందించింది. దీంతో ఎక్కువసార్లు భార్య ఆ ఇంటికి వెళ్లేది. ఇది గమనించిన భర్త తన భార్య కూడా తప్పు చేస్తోందనే అనుమానం పెంచుకున్నాడు. నిజం చెప్పాలంటూ భార్యను పలుమార్లు బెదిరించాడు. చివరకు మద్యంలో విషం కలుపుకుని తాగి చనిపోయాడు. ఫలితంగా భార్యాపిల్లలు రోడ్డున పడ్డారు.
వివాహేతర సంబంధంతో అలజడి
భార్యను దూరం పెట్టిన ఓ భర్త సహ ఉద్యోగినితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. రహస్యంగా ఆ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం సహజీవనం చేస్తున్న యువతి ప్రియుడికి తెలిసింది. తాను ప్రేమించిన యువతి డబ్బు మోజులో తనను మోసం చేసిందని స్నేహితులకు చెప్పుకుని ఏడ్చాడు. మిత్రుడి బాధను చూసి అంతా కలిసి స్కెచ్ వేశారు. ఉద్యోగిని మందు పార్టీకని పిలిచి అందులో విషం ఇచ్చి చంపేశారు. పోస్టుమార్టంలో అసలు నిజం వెలుగుచూసి వారందరూ అరెస్ట్ అయ్యారు. ఇక్కడ మృతుడి భార్య ఒంటరిదై పోయింది. ప్రేమించిన యువతి మోసంతో యువకుడు కటకటాలపాలయ్యాడు. ఇవి మానవ సంబంధాల్ని దెబ్బతీస్తున్న కొన్ని ఘటనలు. మన మధ్యే జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలకు వెనుక ఉన్న యథార్థ గాథలు..!
సమాజంలో బంధాలు, అనుబంధాలకు ఎంతో విలువ ఉంది. కొన్ని సందర్భాల్లో అత్యాశ, అనుమానం, వ్యామోహం ఈ విలువలను దిగజార్చేలా చేస్తున్నాయి. ప్రేమ పెళ్లిళ్లు, కొన్నిచోట్ల పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు సైతం వివాహేతర సంబంధాల వల్ల విచ్చినమవుతున్నాయి. హద్దులు దాటాక ఊహించని పరిణామాలు జరిగి వ్యక్తుల జీవితాలు, కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ప్రస్తుతం కాలంలో హత్యలు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.
ఇందుకు వివాహేతర సంబంధాలే కారణం కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అక్రమ సంబంధాలు, ఆస్తికోసం అడ్డు వస్తున్నారని భార్య లేదా భర్త ఒకరినొకరు చంపేందుకు కూడా వెనుకాడటం లేదు. ప్రపంచంలోనే ఆదర్శ కుటుంబ వ్యవస్థ కలిగిన దేశం మనది. నూరేళ్ల జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆశించి చేసుకున్న పెళ్లినాటి ప్రమాణాలు పటాపంచలవుతున్నాయి. ఫలితంగా ప్రాణంగా ప్రేమించిన వారు.. జీవితాంతం తోడుండాల్సిన వారే తోడేళ్లవుతున్నారు.
బంధం బలపడాలంటే..
♦దాంపత్యంలో దాపరికాలు ఉండకుండా చూసుకోవాలి.
♦పొరపాట్లు జరిగినా.. అనుమానాలు.. అవమానాలు ఎదురైనా ధైర్యంగా ఉండాలి.
♦భార్యాభర్తలు ప్రతిరోజు కొంత సమయం ఒకరికొకరు కేటాయించుకోవాలి.
♦ బాధ్యతల్లో పడి ప్రేమించే వారిని ఒంటరిగా వదిలేయకూడదు.
♦మనస్పర్థలు వచ్చినా కూర్చుని మాట్లాడుకోవాలి.
♦ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా అపోహలు తొలిగే ప్రయత్నం రెండువైపులా జరగాలి.
♦ఎవరి తప్పు ఉందో తెలుసుకుని సున్నితంగా పరిష్కరించుకోవాలి.
♦మరోమారు అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడాలి.
♦పిల్లల ముందు అస్సలు గొడవ పడరాదు.
♦ఎవరైనా మనసును ప్రభావితం చేస్తుంటే సున్నితంగా తిరస్కరించాలి.
♦తనకు జీవిత భాగస్వామి, పిల్లలు ఉన్నారని, కుటుంబ బాధ్యత ఉందని గుర్తెరగాలి.
♦వివాహేతర సంబంధాలు ఆర్థిక, సామాజిక, శారీరక, మానసిక అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని గమనించాలి.
చదవండి: యజమాని భార్యతో డ్రైవర్ వివాహేతర సంబంధం.. చివరికి షాకింగ్ ట్విస్ట్
ఆదర్శమైన ఆ ఐదుగురు దంపతులు...
గుండె గుడిలో లక్ష్మీదేవి నిండిపోయి ఉంటుందని చాటుతూ వక్షస్థలంపై చోటిచ్చిన లక్ష్మీనారాయణుల్లా.. దేహంలో సగభాగం పార్వతీ అంటూ అర్ధనారీశ్వురుడైన గౌరీశంకరుల్లా.. దంపతుల ఇద్దరి మాట ఒకటేనంటూ సతీ సరస్వతిని నాలుకపై నిలిపిన బ్రహ్మదీసరస్వతుల్లా.. జీవకోటిని మేల్కొపుతూ పరుగులు పెట్టే భర్తను అనుసరించే భార్య ఛాయాదేవి, సూర్యుడిలా.. సర్దుకుపోయేతత్వం ఉన్న రోహిణిచంద్రుడిని ఆదర్శంగా తీసుకుని అందంగా, ఆనందంగా తీర్చుదిద్దుకోవాలి.
మొత్తం మీద భార్య నుంచి భర్తకు కావాల్సింది ఉపశమనం, సాంత్వన, పోషణ, కాని భార్యకు భర్త నుంచి కావాల్సింది అనుక్షణం సం‘రక్షణ’ ఒక్కటే. పెళ్లినాటి ప్రమాణాలు, నియమాలు, ఒప్పందాలను మర్చిపోకుండా మంచి సమాజం కోసం కుటుంబాన్ని ఆదర్శవంతంగా కొనసాగించినపుడే ఆ దాంపత్యంలో ఆనందం చిరస్థాయిగా ఉంటుంది.
నమ్మకంతో మెలగాలి
దంపతులు ఒకరిపై మరొకరు నమ్మకంతో మెలగాలి. దంపతుల మధ్య దాపరికాలు ఉండకూడదు. సోషల్ మీడియాకు సాధ్యమైనంత దూరంగా ఉంటూ ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపాలి. వృత్తికి, కుటుంబానికి సమపాళ్లలో సమయం కేటాయించాలి. భార్యాభర్తలు ఇంట్లో ఉన్నప్పుడు వ్యాయామం, భోజనం, అల్పాహారం కలిసి చేయడం ద్వారా ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది. పండుగలు, వారంతపు సెలవుల్లో ఒక రోజు తప్పనిసరిగా కుటుంబ సభ్యులకు కేటాయించడం ద్వారా అంతరాలు తొలగిపోయి అనుబంధం బలపడుతుంది.
-డాక్టర్ వడ్డాది వెంకటకిరణ్, మానసిక వ్యాధి వైద్య నిపుణుడు, జీజీహెచ్, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment