పుష్కర కాలంగా నెలకొన్న మత్స్యకారేతరుల సమస్యకు పరిష్కారం లభించింది. పేదల దశాబ్దాల కల నెరవేరింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపాదనను ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సఫలీకృతం చేశారు. కృష్ణపట్నంపోర్టు పరిధిలో మత్స్యకారేతర ప్యాకేజీ పంపిణీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. త్వరలో సీఎం చేతుల మీదుగా అర్హులకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వేగంగా పావులు కదుపుతున్నారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ముత్తుకూరు: రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తున్న కృష్ణపట్నం పోర్టును దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రూపకల్పన చేసి జాతికి అంకితం చేశారు. అప్పట్లో పోర్టు ఆధారిత పరిశ్రమల కోసం భూ సేకరణ చేశారు. తద్వారా ఉపాధి కోల్పోయిన నిర్వాసితుల కోసం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ప్రకటించారు. మత్స్యకార కుటుంబాలకు రూ.32 కోట్లు అందించారు. అప్పట్లో 2 వేల మంది మత్స్యకారేతరులను గుర్తించారు. అంతలోనే వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం నాన్ ఫిషర్‌మన్ కుటుంబాల పాలిట శాపంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ప్యాకేజీ ఫైల్‌ను బుట్టదాఖలు చేసింది.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ప్యాకేజీ చెల్లింపులకు పీఠముడి వేసింది. ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే మూడు విడతల్లో ప్యాకేజీ ఇస్తామని చెప్పి రూ.3 కోట్లతో సరిపెట్టారు. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏకమైన మత్స్యకారేతర కుటుంబాలు అప్పట్లో రోడ్డెక్కి ఆందోళనలు చేశాయి. అయినా ఫలితం లేకుండా పోయింది. ప్రతిపక్ష నేత హోదాలో వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థానికుల సమస్యను విన్నారు. అధికారంలోకి వచ్చాక ప్యాకేజీ విషయంలో న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల ముందు వరకు తెల్లరేషన్‌కార్డు కలిగిన ప్రతి మత్స్యకారేతర కుటుంబానికి ప్యాకేజీ అందిస్తానని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 16,337 కుటుంబాలకు రూ.35.75 కోట్లు చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ.25 వేల వచ్చే నెలలో సీఎం చేతుల మీదుగా ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు.
మత్స్యకారేతర ప్యాకేజీ అంటే..
కృష్ణపట్నం పోర్టు ఆధారిత పరిశ్రమలతో పాటు విద్యుత్ కొరత తీర్చేందుకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీజెన్‌కో ద్వారా ప్రథమంగా 1,600 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటైంది. వీటితో పాటు ప్రైవేట్ రంగంలో సెంబ్‌కార్ఫ్ పవర్ ప్రాజెక్ట్ కూడా ఏర్పడింది. ఈ ప్రాజెక్ట్‌ల కోసం ముత్తుకూరు మండల తీర ప్రాంతంలో సుమారు 6,000 ఎకరాలకుపైగా భూములు సేకరించారు. పోర్టు విస్తరణకు 5 గ్రామాలను ఖాళీ చేసి, ముత్తుకూరుకు తరలించారు. పోర్టుకు అనుబంధంగా పామాయిల్ ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. ఫలితంగా ఈ భూములపై ఆధారపడి జీవనం సాగించే వ్యవసాయ కూలీ కుటుంబాలు, మాత్స్యకారులు కాకుండా చేపలు పట్టుకొని జీవనం సాగించే ఇతర పేద కులాల కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ సమస్యను గుర్తించారు. ముఖ్యంగా నిరుపేద ఎస్టీ, ఎస్సీ కులాలకు ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించారు. మొదట ప్రాజెక్ట్ ప్రభావిత గ్రామాల్లో సర్వే చేసి, 2,000 మందికి ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించారు. తర్వాత ఇందులో ఉపాధి కోల్పోతున్న బీసీలు, మైనార్టీలు కూడా చేరారు. కాలక్రమేపి మత్స్యకారేతరుల లబి్ధదారుల సంఖ్య 16,337కు చేరింది. ప్రభుత్వాలు మారిన ప్యాకేజీ మాత్రం దక్కని పరిస్థితి ఏర్పడింది.
ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్యాకేజీ
నేలటూరులోని ఏపీజెన్‌కో ప్రాజెక్టు 3వ యూనిట్ నిర్మాణం పూర్తయింది. ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం వైఎస్ జనన్‌మోహన్‌రెడ్డి రానున్నట్లు తెలుస్తోంది. ఆ సందర్భంగా మత్స్యకారేతర ప్యాకేజీ స్వయంగా అందజేయనున్నట్లు సమాచారం. ప్రాజెక్ట్ ప్రారం¿ోత్సవం అటూ ఇటూ అయినా అక్టోబర్‌లో మత్స్యకారేతర ప్యాకేజీ అర్హుల బ్యాంకు ఖాతాలకు జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
చాలా సంతోషంగా ఉంది
ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న మత్స్యకారేతర ప్యాకేజీ త్వరలో పంపిణీ చేస్తారనే విషయం చాలా సంతోషం కలిగించింది. అసలు ఈ ప్యాకేజీ వస్తుందా, రాదా అనే అనుమానం మాలో ఉండేది. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం ప్యాకేజీ సాధించారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకొన్నారు.
– పర్రి రామమ్మ, వెంకన్నపాళెం
మంత్రి కాకాణికి కృతజ్ఞతలు
తెల్లరేషన్ కార్డులున్న కుటుంబాలకు మత్స్యకారేతర ప్యాకేజీ ఇస్తామని ప్రకటించిన మంత్రి కాకాణి గోవర్ధ న్‌రెడ్డికి కృతజ్ఞతలు. కుటుంబానికి రూ.25 వేలు ఇస్తామని చెప్పారు. చాలా సంతోషం. గతంలో కొందరు మాయమాటలు చెప్పారు. అయితే మంత్రి కాకాణి మాత్రం ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారు.
– దారా ముత్యాలమ్మ, ఈపూరు
మంత్రి కాకాణి చొరవ.. సీఎం గ్రీన్‌సిగ్నల్
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అర్హులైన వారందరికీ మత్స్యకారేతర ప్యాకేజీ వర్తింపజేస్తామని అప్పట్లో కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రకటించారు. సీఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తప్పకుండా ప్యాకేజీ పంపిణీ చేస్తామని ప్రతి సందర్భంలో చెప్పుకొచ్చారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాకాణి ఈ సమస్యపై ప్రత్యేక చొరవ కనబర్చారు. వేగంగా ఫైల్ కదిలింది. నిధుల మంజూరుకు మార్గం ఏర్పడింది. ప్యాకేజీ పంపిణీకి రూ.35.75 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా లభించింది. 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి తెల్లరేషన్ కార్డులున్న ప్రతి కుటుంబానికి మత్స్యకారేతర ప్యాకేజీ పంపిణీ అందించనున్నారు. మొత్తంగా 16,337 మంది లబి్ధదారులు ఉండగా ఇందులో 3,550 కుటుంబాలకు ఎన్నికలకు ముందు ఒక విడతగా రూ.14,350 పంపిణీ చేశారు. అందులో మిగిలిన 12,787 కుటుంబాలకు రూ.25 వేలు చొప్పున ప్యాకేజీ మొత్తం అందజేస్తారు. వారికి సుమారు రూ.32 కోట్లు వ్యయమవుతుంది. గతంలో కొంత పరిహారం పొందిన 3,550 కుటుంబాలకు మిగిలిన రూ 10,650 చొప్పున రూ.3.78 కోట్లు పంపిణీ చేసేందుకు నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment