కాకినాడలో ఉత్పత్తికి సిద్ధమైన లిఫియస్ ఫార్మా యూనిట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో భారీ ఫార్మా సంస్థ ఉత్పత్తికి సిద్ధమైంది. చైనా నుంచి ఫార్మా దిగుమతులను తగ్గించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్‌ఐ) స్కీం కింద లిఫియస్ పేరుతో అరబిందో గ్రూపు పెన్సులిన్ జి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పెన్సులిన్ తయారీలో కీలక ముడిపదార్థంగా పెన్సులిన్ జి వినియోగిస్తారు. కాకినాడ సమీపంలోని తొండంగి వద్ద 250 ఎకరాల్లో సుమారు రూ.2,205 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ శరవేగంగా నిర్మాణాన్ని పూర్తి చేసుకొని, ఉత్పత్తి ప్రారంభానికి సిద్ధమైంది.
ఈ కర్మాగారంలో ఏటా 15,000 టన్నుల పెన్సులిన్ జి యూనిట్, 2,000 టన్నుల సామర్ధ్యంతో 7–ఏసీఏ యూనిట్‌ను అరబిందో గ్రూపు ఏర్పాటు చేసింది. ఈ యూనిట్‌లో 3,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఈ ప్లాంట్ వాణిజ్య ఉత్పత్తికి సిద్ధమవడంతో లిఫియస్ ఉద్యోగ నియామకాలు చేపట్టింది. బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్ (బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ) కోర్సులు పూర్తి చేసిన వారిని వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నట్లు లిఫియస్ ప్రకటించింది.
ఈ నెల 22న హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు వద్ద ఉన్న మనోహర్ హోటల్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఫెర్మిటేషన్స్‌లో ప్రొడక్షన్, మైక్రోబయోలజీ రంగాల్లో నియామకాలకు తాజాగా కోర్సు పూర్తి చేసిన వారి (ఫ్రెషర్స్) దగ్గర నుంచి 10 ఏళ్ల అనుభవం ఉన్నవారికి అవకాశం కల్పిస్తోంది. వాటర్ ట్రీట్‌మెంట్ అసిస్టెంట్ పోస్టులకు కనీసం రెండేళ్ల అనుభవం నుంచి పదేళ్ల వారికి అవకాశం కల్పిస్తోంది.
మరో రెండు ఫార్మా యూనిట్లు
లిఫియస్‌కు సమీపంలోనే పీఎల్‌ఐ స్కీం కింద మరో రెండు ఫార్మా యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. అరబిందో గ్రూపు క్యూలే పేరుతో సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడితో 159 ఎకరాల్లో ఎరిత్రోమైసిన్ థియోసేనేట్ యూనిట్‌ని ఏర్పాటు చేస్తోంది. దీని ఉత్పత్తి సామర్థ్యం 1,600 టన్నులు. దీనికి సమీపంలోనే దివీస్ సంస్థ ఓ ఫార్మా యూనిట్ ఏర్పాటు చేస్తోంది. దీని పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూడు యూనిట్లతో కాకినాడ మేజర్ ఫార్మా హబ్‌గా ఎదగనుంది.
Comments
Please login to add a commentAdd a comment