వరద ముంపులో చిక్కుకున్న ఆటోవాలాలు
సింగ్‌నగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాల్లోనే అత్యధికంగా ఆటో డ్రైవర్లు
విజయవాడలోని సింగ్‌నగర్ కేంద్రంగా సుమారు 6 వేల ఆటోల సేవలు
ఇక్కడ తిరిగే 80 శాతం ముంపు ప్రాంతానికి చెందినవే..
70 శాతం మంది అద్దె ఆటోలు నడుపుకొంటూ జీవనం
గత వారం రోజులుగా బుడమేరు ముంపులో నానుతున్న ఆటోలు
చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో మరమ్మతుల కోసం అగచాట్లు
జీవితాంతం కష్టపడినా ఇంటిలో మళ్లీ సౌకర్యాలను సమకూర్చుకోలేమంటూ ఆవేదన
సాక్షి, అమరావతి: విజయవాడ వరద విలయం.. సగటు బడుగు జీవితాలను ఒక్కసారిగా తిరగబెట్టింది. నిత్యం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తూ జీవనాన్ని సాగించే ‘ఆటో వాలాల’ పరిస్థితి దారుణంగా మారింది. రయ్‌రయ్.. అంటూ రోడ్లపై దూసుకెళ్లే వేలాది ఆటోలు బుడమేరు ఉధృతితో కనబడకుండా పోయాయి. దాదాపు వారం రోజులుగా నీటిలో నానిపోతూ ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి.
శుక్రవారం వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ‘సాక్షి’ బృందం పర్యటించగా.. ముంపులో నుంచి ఆటోలను రోడ్లపైకి తీసుకొస్తూ, రహదారుల పక్కనే చేతనైనా మరమ్మతులు చేసుకుంటున్న ఆటో డ్రైవర్లే కనిపించారు. ఇందులో ఎవరిని పలకరించినా కన్నీటి గాథలే వినిస్తున్నాయి. ఊహించని వరదల్లో విలవిల్లాడుతున్న జీవితాలు కళ్లముందు కదలాడుతున్నాయి. సింగ్‌నగర్ కాలనీలతో పాటు పైపుల రోడ్డు, పాయకాపురం, కండ్రిక, రాజరాజేశ్వరిపేట, అంబాపురంలో అత్యధికంగా ఆటోలు నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నారు.
విజయవాడ నగరంలో తిరిగే ఆటోల్లో 80 శాతంపైగా ఈ ప్రాంతానికి చెందినవే. ఇక్కడ సుమారు 6 వేలకు పైగా ఆటోలు ఉంటాయని అంచనా. బుడమేరు ఒక్కసారిగా ముంచెత్తడంతో ఆ ఆటోలు, యజమానులు నీటిలో చిక్కుకుపోయారు. వరద నీరు ఇంజిన్‌లోకి చేరడంతో పాటు, సీట్లు, కవర్లు నీటిలో నానిపోవడంతో పెద్దఎత్తున నష్టపోయారు.
70 శాతం అద్దె ఆటోలే..
బుడమేరు వరదల్లో ఇంటి ముందు పెట్టిన ఆటోలు కూడా కొట్టుకుపోయాయి. ఇప్పుడు నీటి ఉధృతి తగ్గడంతో యజమానులు ఆటోలను వెతుక్కునే పనిలో పడ్డారు. వాస్తవానికి ఇక్కడి ఆటో డ్రైవర్లలో 60–70 శాతం మంది అద్దె ఆటోలనే నడుపుకొనేవారే. ఆటోను బట్టి రోజుకు రూ. 450 నుంచి రూ. 500 వరకు అద్దె చెల్లిస్తూ.. సర్వీసులు తిప్పుకుంటున్నారు. రోజులో సర్వీసు ఉన్నా.. లేకున్నా ఆటో అద్దె చెల్లించాల్సిందే.
రోజూ వేకువ జాము నుంచి రాత్రి వరకు కష్టపడినా రోజుకు రూ. 500 సంపాదించడం కష్టంగా ఉంటోంది. అలాంటి ఆటోవాలల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. చేతిలో చిల్లిగవ్వ లేక మరమ్మతులు చేసుకోలేక ఆటోవాలాలు దిక్కులు చూస్తున్నారు. ఒక్కో ఆటోకు సుమారు రూ.10 వేల నుంచి రూ. 20 వేలకుపైగా ఖర్చు చేస్తేకానీ మళ్లీ రోడ్డెక్కే పరిస్థితి కనిపించట్లేదని వాపోతున్నారు.
మళ్లీ మొదటికి వచ్చింది..
వరద తగ్గిపోయిందని ఇంటిని శుభ్రం చేసుకోవడం మొదలు పెడితే.. మళ్లీ తెల్లారేçÜరికి మెట్లపైకి వరద చేరింది. పైన అంతస్తుల్లో కాలకృత్యాలు తీర్చుకునే వారి వ్యర్థాలు మొత్తం నీళ్లలోకి చేరుతున్నాయి. ఎంత శుభ్రం చేసినా మళ్లీ మొదటికొచ్చింది. నేను గతంలో కరెంట్ కాంట్రాక్టు పనులు చేస్తూ దెబ్బతిన్నాను.
ఆరోగ్యం రీత్యా నా కొడుకుతో కలిసి ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. మాకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. వారం రోజులుగా ఆహారం అందించిన నాథుడే లేడు. బలవంతుడికి ఆహారం దొరికింది.. మా లాంటి బలహీనులు పస్తులున్నాం. ఇప్పుడు చలి జ్వరంతో ఇబ్బంది పడుతున్నాం. ఇదేం జీవితమో అర్థం కావట్లేదు. – ఏలియా, పాయకాపురం
పాయకాపురం రాధానగర్‌కు చెందిన మణికంఠ. మూడేళ్లుగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుడమేరు వరద మణికంఠ జీవితాన్ని తల్లకిందులు చేసింది. రేయింబవళ్లు ఆటో నడిపి ఇంటిలో సమకూర్చుకున్న వస్తువులన్నీ దెబ్బతినడంతో సుమారు రూ. లక్షకుపైగా నష్టపోయాడు. నడిరోడ్డుపై నీట మునిగిన ఆటో వద్ద.. ఉబికి వస్తున్న కన్నీళ్లను అదిమిపెట్టుకుని ‘సాక్షి’ వద్ద గోడు వెళ్లబోసుకున్నాడు.
‘నాకు రూ.లక్షలు పోసి ఆటోలు కొనే పరిస్థితి లేదు. రోజూ రూ. 500కు అద్దె ఆటో నడుపుకొంటున్నాను. ఉదయం 5గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆటో నడిపితేనే ఒక్కోరోజు ఇంటికి రూ. వంద కూడా తీసుకెళ్లలేని పరిస్థితి. అలాంటిది వారం రోజులుగా ఉపాధి పోయింది. శనివారం రాత్రి వరద వస్తుందని అధికారులు హెచ్చరించలేదు. మేము రాత్రి నిద్రపోయాం. ఆదివారం ఉదయం 7 గంటలకే మా ఇంటిని వరద చుట్టుముట్టింది.
ఆటోను స్టార్ట్ చేసి బయటకు వద్దామంటే ముందుకు కదల్లేదు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కట్టించి ఇచ్చిన అపార్ట్‌మెంట్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లో అద్దెకు ఉంటున్నాం. ఇంటిలోకి నీళ్లు రావడంతో వంట సామగ్రిని తీసుకుని మొదటి అంతస్తులో కారిడార్‌లో కాలం వెళ్లదీస్తున్నాం. మునిగిపోయిన ఆటోను కిలో మీటరుపైగా మా నాన్నతో కలిసి తోసుకుంటూ వచ్చాను. కనీసం తాడు కట్టుకుని లాక్కుని వెళ్దామంటే మరో ఆటోని పోలీసులు లోపలికి రానివ్వట్లేదు.
Comments
Please login to add a commentAdd a comment