నల్లమల కలపపై ఒకప్పటి టీడీపీ నేత గొడ్డలి వేటు
అక్రమ రవాణాతో రూ.వేల కోట్లకు పడగలు
ఎదురించిన వారంతా చెరువుల్లో చేపలకు ఆహారం
నాటుసారాతో పేద కుటుంబాల ఉసురు తీసిన చరిత్ర
తరచూ పార్టీలు మారుతూ ఊసరవెల్లి నైజం
తండ్రికి తగ్గ తనయగా ఆ నేత కుమార్తె అ‘రాజకీయం’
ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి గా డబ్బులు వెదజల్లుతున్న వైనం
విలువైన కలపను టోకుగా కాజేశాడా నేత.. నల్లమల వీరప్పన్‌గా పేరుమోశాడాయన.. నాటుసారా వ్యాపారంలో అందెవేసిన చేయి.. తన సారా వ్యాపారానికి అడ్డొచ్చి న వారి అంతు చూడడానికి సైతం వెనుకాడనంత దౌర్జన్యపరుడు.. ఈ అక్రమాలన్నిటితో రూ.వేల కోట్లను అనతికాలంలోనే ఆర్జించి.. తన దోపిడీ సామ్రాజ్యాన్ని బలపరుచుకున్న నేత.. అక్కడి జనాన్ని తన కంటి చూపుతో శాసించారు.
సారా వ్యతిరేకోద్యమం ముమ్మరంగా రాష్ట్రంలో ఊపేస్తే.. అప్పటి ఈ టీడీపీ నేత నియోజకవర్గంలో ఒక్కరు కూడా ఈయనకు వ్యతిరేకంగా గొంతెత్తడానికి సాహసించలేకపోయారంటే జనాన్ని ఎంతగా భీతిగొలిపారో అర్థం చేసుకోవచ్చు. తుదకు తనఅక్రమాలకు మద్దతిచ్చే టీడీపీలో చేరారు.. అదొక్కటే కాదు.. అవకాశవాదంతో ఏ ఎండకా గొడుగు పడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లోనూ చేరారు.. ఈ నేత నీడన పెరిగిన ఆయన తనయ ప్రస్తుతం టీడీపీ లోక్‌సభ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
సాక్షి, టాస్‌్కఫోర్స్: ఆ పేరు వింటే చాలు నల్లమల వీరప్పన్ గుర్తుకు వస్తారు. కొన్నేళ్ల కిందట నల్లమల అడవిని అడ్డాగా చేసుకుని తన వ్యాపారాన్ని సాగించారు. కలప చెట్లను ఇష్టానుసారం నరికి హైదరాబాద్‌కు తరలించి రూ. వేల కోట్లు సంపాదించారు. తనకు ఎదురుమాట్లాడితే వారి పని అంతే. అడ్డుకుందామని యతి్నంచిన అధికారులను నయానో భయానో లొంగదీసుకుని తన వ్యాపారాన్ని సాగించారు. అంగబలానికి తోడు అర్ధబలం తోడవడంతో ఆయన అక్రమార్జనకు అడ్డే లేకుండా పోయింది.
తండ్రి రాజకీయ అండతో..: తండ్రి రాజకీయ అండతో ఈ నేత విచ్చలవిడిగా సంపాదించారు. జూపాడుబంగ్లా, పగిడ్యాల, మిడుతూరు, ఓర్వకల్లు మండలాల్లో సొంతంగా సారా అంగళ్లు తెరిచారు. పల్లెలకు సారాను పరిచయం చేశారు. సారా వల్ల అనేక వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సారా అంగళ్లను తమ గ్రామాల్లో తొలగించాలని మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినా, తన అంగబలంతో వాటిని అణచివేశారు.
1989లో రాష్ట్ర వ్యాప్తంగా సారాకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిచాయి. మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. రోడ్ల మీదకి వచ్చి తమ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న సారా రక్కసిని పారదోలాలని రాష్ట్రమంతటా నినదించారు. ఒక్క నందికొట్కూరు నియోజకవర్గంలో మాత్రమే సారా ఉద్యమం చేయాలంటే గజగజ వణకాల్సిన పరిస్థితిని ఈ నేత సృష్టించారు. ఉద్యమం చేస్తే తమను ఏం చేస్తారోనన్న భయం నియోజకవర్గ ప్రజలను వెంటాడింది. ఉద్యమం పెద్ద ఎత్తున ఎగసిపడిన రోజుల్లోనూ స్థానికంగా మాత్రం సారా వ్యాపారం విచ్చలవిడిగా సాగిపోయింది.
రూ.కోట్లలో విభేదాలతో బయటకు...
1993లో ముఖ్యమంత్రిగా ఉన్న కోట్ల విజయభాస్కరరెడ్డితో సారా కాంట్రాక్టు విషయంలో ఈ నేతకు విభేదాలు వచ్చాయి. తన సారా వ్యాపారానికి సహకరించడంలేదన్న కోపంతో ఆయన టీడీపీలో చేరి 1994లో నందికొట్కూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు. అక్షరాస్యత పెద్దగా లేని నాటి రోజుల్లో అమాయక ప్రజలను తన రాజకీయ లబ్ధి కోసం ఈ నేత వాడుకున్నారన్న విమర్శలూ ఉన్నాయి. ఫ్యాక్షన్ రాజకీయాలు చేపట్టి ఎంతో మంది మహిళల పుస్తెలు తెంపిన ఘన చరితా ఈయనదేనన్న ఆరోపణలు ఉన్నాయి.
రెండోసారి ఎన్నికవడంతో....
1999 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆ నేత ఆగడాలు శృతిమించాయి. నల్లమల అడవిని చెరబట్టి అటవీ సంపదను కొల్లగొట్టారు. విలువైన కలపను ఇతర ప్రాంతాలను రవాణా చేసి రూ.కోట్లు గడించారు. అటవీ అధికారులను బెదిరించి విలువైన కలప చెట్లను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు తరలించి రూ.వేల కోట్లు సంపాదించారు. ఆ నేత ఇంటిలో, హైదరాబాద్‌లోని హోటల్లో ఎక్కడ చూసినా విలువైన కలప కళాఖండాలు కనిపిస్తాయని ఉమ్మడి కర్నూలు ప్రజలందరికీ తెలుసు. బీడీల కట్టలు కట్టి అమ్ముకునే నిరుపేదల రక్తం తాగారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
కార్మికుల నుంచి కారుచౌకగా బీడీ కట్టలను కొనుగోలు చేసి తాను మాత్రం ఎక్కువ రేటుకు విక్రయించి లాభాలు గడించారు. ఆ నేతకు వ్యతిరేకంగా మాట్లాడినా, ఆయన ఆగడాలను ప్రశి్నంచినా వారికి భూమ్మీద నూకలు చెల్లినట్లే. ఈ నేతకు విలేకరులంటే అలుసు. అప్పట్లో విలేకరుల సమావేశాలంటూ పిలిచి కురీ్చలు కూడా వేసేవారు కాదు. పాత్రికేయులు నిలుచునే ఆయన చెప్పేది నోట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. జిల్లా కేంద్రాలలో ఉండే ముఖ్య ప్రతినిధి వస్తే మాత్రమే కుర్చీ వేసేవారు.
∗ 2004లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఈ నేత వరుసగా పార్టీలు మారారు. కొద్ది రోజులు రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో హడావుడి చేశారు. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీల్లోకి ఆయన వెళ్లొచ్చారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటకాగుతూ ఊసరవెల్లి రాజకీయాలు సాగించిన ఘనత దక్కుతుంది.
కేసులు..
వ్యక్తిని అక్రమంగా నిర్బంధించడంతో ఆయనపై ఐపీసీ 341 కింద నియోజకవర్గంలో కేసు నమోదైంది. ఐపీసీ 143, 188, 149 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న తనయ
తండ్రికి తానేమీ తక్కువకాదన్నట్లుగా ఆయన తనయ వ్యవహరిస్తున్నారు. బీజేపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన ఈమె నోరు తెరిస్తే చాలు అవతలి వ్యక్తి హడలిపోవాల్సిందేనన్న విమర్శలు ఉన్నాయి. నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లెలో ఈమెపై క్రిమినల్ కేసు నమోదైంది. దళిత వ్యక్తిని దూషించడంతో పాటు దాడి చేయడంతో కేసు నమోదైంది. ప్రస్తుతం ఈమె టీడీపీ తరఫున లోక్ సభకు పోటీ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment