
సుండుపల్లి: ఈదురుగాలులకు నేలకొరిన మామిడి చెట్లు, సుండుపల్లి: నేలరాలిన మామిడి కాయలు
రాయచోటి: జిల్లా పరిధిలో ఆదివారం సాయంత్రం అకాలంగా వచ్చిన వర్షం మామిడి, అరటి, ఇతర పండ్లతోటలకు భారీ నష్టాన్ని చేకూర్చింది. ఉన్నట్టుండి ఈదురుగాలులతో కూడిన వర్షం అధికంగా కురవడంతో మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుండుపల్లి, పీలేరు, రైల్వేకోడూరు, కేవీపల్లి మండలాల పరిధిలో మామిడి చెట్లు వేర్లతో సహా పెకలింపబడ్డాయి.
రాయచోటి, చిన్నమండెం, వీరబల్లి తదితర మండలాల్లో మామిడి కాయలు భారీగా నేలరాలాయి. రైల్వే కోడూరులో 35 హెక్టార్లకు పైగా అరటి తోటలు దెబ్బతినగా, జిల్లా వ్యాప్తంగా 500 హెక్టార్లలో మామిడి తోటలు దెబ్బతిన్నట్లు జిల్లా ఉద్యానవన అధికారి రవీంద్రారెడ్డి తెలిపారు. జరిగిన నష్టంపై సోమవారం ఆయా ప్రాంతాల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికల రూపంలో ప్రభుత్వానికి తెలియపరుస్తామన్నారు.
రెండు ప్రాంతాల్లో పిడుగు
జిల్లా పరిధిలోని వీరబల్లి మండలం ఈడిగ పల్లెలో, సుండుపల్లి ప్రాంతాల్లో టెంకాయచెట్లపై పిడుగు పడి దగ్ధమయ్యాయి. ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు తెగిపోవడం, స్తంభాలు నేలకూలడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అకాలంగా కురిసిన వర్షాలకు మామిడి, అరటి తోటల్లో నష్టం అధికం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment