
సాక్షి, అమరావతి బ్యూరో: ఆదాయం రెట్టింపు అవడంతోపాటు, ఖర్చులు తగ్గాలంటే రైతులు సేంద్రీయ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. గుంటూరులో ఓ ప్రైవేట్ క్లబ్‌లో మంగళవారం లైవ్ భారత్ ఫౌండేషన్ నిర్వహించిన సంక్రాంతి సంబరాలు, వివేకానంద జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో సాంకేతికత ఎంత ముఖ్యమో సేంద్రీయ విధానం కూడా అంతే ముఖ్యమని చెప్పారు. సేంద్రీయ వ్యవసాయం ద్వారానే ఆరోగ్యకరమైన ఆహారం సాధ్యమన్నారు.
దేశంలోనే అత్యధికంగా సేంద్రీయ వ్యవసాయం హిమాచల్‌ప్రదేశ్‌లో జరుగుతోందని తెలిపారు. ఏపీలో కూడా ఆ విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనను కలిసిన సందర్భంగా సూచించినట్లు చెప్పారు. సంక్రాంతి రైతుల పండుగ అని, రైతులు సంతోషంగా ఉంటేనే అసలైన పండుగని పేర్కొన్నారు. భారతీయత గొప్పదనం గురించి దేశవిదేశాల్లో చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని చెప్పారు. ప్రపంచంలో ఎక్కువమంది యువత ఉన్న యంగ్ ఇండియా 2030 కల్లా అగ్రగామిగా ఎదుగుతుందని పేర్కొన్నారు. మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, రావెల కిషోర్‌బాబు, గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్, లైవ్ భారత్ ఫౌండేషన్ చైర్మన్ వల్లూరి జయప్రకాష్‌నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment