కౌలు రైతులకు మరింత చేయూతనివ్వండి | Sakshi
Sakshi News home page

కౌలు రైతులకు మరింత చేయూతనివ్వండి

Published Tue, Feb 20 2024 5:30 AM

Bankers Committee Meeting in andhra pradesh: buggana rajendranath  - Sakshi

సాక్షి, అమరావతి: కౌలు రైతులకు బ్యాంకులు మరింత చేయూతను అందించాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ కోరారు. అలాగే కోళ్ల పెంపకం, ఆక్వా, మత్స్య రంగాల్లో రైతులకు కూడా తగిన రుణాలందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో వార్షిక రుణ ప్రణాళిక అమలులో 108 శాతం లక్ష్యాన్ని సాధించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బ్యాంకులను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం మంత్రి బుగ్గన అధ్యక్షతన 226వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది.

ఇందులో గత సమావేశం సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలు, 2023–24 వార్షిక రుణ ప్రణాళికలో సాధించిన ప్రగతి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రాయోజిత పథకాలు, డిజిటల్‌ జిల్లాలు, కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ కౌలు రైతులకు పెద్దఎత్తున రుణాలు అందించి వారిని ఆదుకోవాలనేది ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశమని తెలిపారు. ఈ నేపథ్యంలో కౌలు రైతులకు రుణాలందించడంలో బ్యాంకులు పూర్తి స్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే పాడిపరిశ్రమాభివృద్ధికి కూడా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. ఈ రంగంలో కూడా తగిన రుణాలు అందించాలని కోరారు. ముఖ్యంగా మూడు నాలుగు జిల్లాల్లో డెయిరీ రంగం అభివృద్ధికి ఎక్కువ అవకాశాలున్నాయన్నారు. ఏపీ టిడ్కో కింద జగనన్న నగరాల నిర్మాణంలో లబ్ధిదారులకు మరింత చేయూతనిచ్చి వేగంగా ఇళ్లు నిర్మించుకునేందుకు తగిన సహాయం అందించాలని కోరారు. ప్రభుత్వ పథకాల అమలులో వివిధ ప్రైవేటు బ్యాంకులు తమ వంతు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

గుడ్‌ గవర్నెన్స్‌లో ఉత్తమ రాష్ట్రంగా ఏపీ 
యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ రాజీవ్‌ మిశ్రా మాట్లాడుతూ రాష్ట్రంలో మెరుగైన ఈ–క్రాపింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నారని కొనియాడారు. గుడ్‌ గవర్నెన్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఉత్తమ రాష్ట్రంగా నిలిచిందన్నారు. ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జనరల్‌ మేనేజర్‌ ఎం.రవీంద్రబాబు మాట్లాడుతూ 2023–24 వార్షిక రుణ ప్రణాళిక కింద రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల ద్వారా రూ.4.43 లక్షల కోట్ల రుణాలు అందించడం లక్ష్యం కాగా డిసెంబర్‌ నాటికే రూ.4,77,234 కోట్లు రుణాలు అందించి 108 శాతం లక్ష్యాన్ని సాధించామన్నారు.

దీనిలో ప్రాధాన్యత రంగం కింద రూ.3.23 లక్షల కోట్లు అందించాల్సి ఉండగా రూ.2.88 లక్షల కోట్లు అందజేశామని తెలిపారు. అలాగే రూ.2.31 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు లక్ష్యం కాగా రూ.2.08 లక్షల కోట్లు అందించామన్నారు. ఎంఎస్‌ఎంఈ రంగంలో రూ.69 వేల కోట్లకు గాను రూ.71,113 కోట్లు అందజేశామని వెల్లడించారు. అలాగే ప్రాధాన్యేతర రంగంలో రూ.1.20 లక్షల కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా రూ.1,88,557 కోట్లు ఇచ్చామన్నారు. అలాగే బ్యాంకు లింకేజ్‌ కింద 35 వేల స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించాల్సి ఉండగా ఇప్పటికే 31,699 సంఘాలకు సాయం అందజేశామన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకం స్టాండ్‌ అప్‌ ఇండియా కింద 13,078 ఖాతాదారులకు సహాయం అందించాల్సి ఉండగా డిసెంబరు నెలాఖరు నాటికి 12,768 మందికి సాయమందించామని తెలిపారు. పీఎం ముద్రా యోజన కింద రూ.13 వేల కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా రూ.14,860 కోట్లు ఇచ్చామని చెప్పారు. గతేడాది డిసెంబర్‌ వరకు వివిధ బ్యాంకులు సాధించిన ప్రగతిని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా జీఎం రవీంద్రబాబు వివరించారు.

కిసాన్‌ క్రెడిట్‌ కార్డుదారులకు రుణాల్లో మంచి ప్రగతి
నాబార్డు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎంఆర్‌ గోపాల్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాల అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని తెలిపారు. బ్యాంకులు ఆయా రంగాల్లో మరింత తోడ్పాటును అందించేందుకు కృషి చేయాలన్నారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుదారులకు రుణాలు అందించడంలో మంచి ప్రగతిని సాధించారన్నారు.

ఈ సమావేశంలో ఆర్బీఐ ఏపీ ఇన్‌చార్జి రాజేష్‌ కె.మహానా, యూబీఏ జీఎం గుణనాధ్‌ గమి, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీ సత్యనారాయణ, చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత, వ్యవసాయ శాఖ ఇన్‌చార్జి కమిషనర్‌ శేఖర్‌ బాబు, ఏపీ టిడ్కో ఎండీ శ్రీధర్, మెప్మా ఎండీ విజయలక్ష్మి, వివిధ బ్యాంకుల రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్లు, లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement