పిఠాపురం(కాకినాడ జిల్లా): సాగర తీరంలో కనిపించని, కడలి మాటున వేటు వేసే రిప్ కరెంట్ ఎందరో ప్రాణాలను కాటేస్తోంది. చీలిక ప్రవాహాలుగా పేర్కొనే రాకాసి అలలు ఒక్కసారిగా దాడి చేసి పెను విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఏమరపాటుగా ఉంటే రెప్పపాటులో సముద్రంలోకి లాగేస్తుంటాయి. ఆగస్టు, అక్టోబర్ నెలల మధ్య ఈ రిప్ కరెంట్ అలలు ఎక్కువగా తూర్పు తీరంలో సంభవిస్తాయని పరిశోధకులు నిర్ధారించారు. కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు ఉన్న తీర ప్రాంతంలో ఇవి ఎక్కువగా ఏర్పడుతున్నట్టు గుర్తించారు. ఇప్పటికే ఎక్కువ మంది వీటి వల్ల మృత్యువాత పడినట్లు గుర్తించారు. ఉప్పాడ తీరంలో ఆదివారం సంభవించిన పెను ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన రిప్ కరెంట్ ప్రభావాన్ని గుర్తు చేస్తోంది.
చదవండి: ర్యాంటాక్, జింటాక్ టాబ్లెట్స్‌తో క్యాన్సర్?.. 26 ఔషధాలను నిషేధించిన కేంద్రం
రిప్ కరెంట్ అంటే..
బలమైన అలల మధ్య ఇరుకైన ప్రవాహాన్ని రిప్ కరెంట్ అంటారు. ఇవి మనిషిని ఒక్కసారిగా లోతైన ప్రదేశంలోకి లాగేస్తాయి. సముద్ర గర్భంలో సుదూర ప్రాంతంలో ఏర్పడిన గాలి ద్వారా ఏర్పడిన అలలు నీటి అడుగున బలమైన ప్రవాహంగా దూసుకు వస్తాయి. తీరానికి వచ్చే సరికి అవి రాకాసి అలలుగా మారిపోతాయి. అల ఒక్కసారిగా తీరాన్ని తాకినప్పుడు సముద్రం అడుగు భాగాన అత్యంత బలమైన ప్రవాహం ఏర్పడుతుంది. ఆ ప్రవాహంలో ఎవరు ఉన్నా రెప్పపాటులో కడలిలో కలిసి పోతారు. ఎంత గజ ఈతగాడైనా దీని నుంచి తప్పించుకోలేడు.
తీరానికి వచ్చే కొద్దీ వేగం అధికమై తరంగాలు ఏర్పడతాయి. తిరిగి కెరటం వెనక్కి సముద్రంలోకి వెళ్లే టప్పుడు ఏర్పడే తీవ్రత అంతా ఇంతా కాదు. దానినే రిప్ కరెంట్ అంటారు. కరెంట్ షాక్ తగిలితే ఎంత తొందరగా ప్రాణాలు పోతాయో దానికంటే ఎక్కువగా ఇది ప్రమాదాన్ని కలిగిస్తుంది. రెండు సముద్రాలు లేదా రెండు ప్రవాహాలు కలిసే చోట ఇవి సంభవిస్తాయి. కాకినాడ నుంచి విశాఖ వరకు ఉన్న తీరంలో ఎక్కువ ప్రాంతాల్లో ఉప్పుటేరులు కాలువలు కలిసే చోట్లు ఉన్నాయి. అటువంటి చోట్ల రిప్ కరెంట్ ఏర్పడుతుంది. రిప్ కరెంట్ ప్రవాహ వేగం సెకనుకు 2 నుంచి 8 అడుగుల వరకు ఉంటుంది.
ఇది అల చీలికలో ఒడ్డుకు సమాంతరంగా 10 నుంచి 20 అడుగుల వెడల్పుతో ఏర్పడుతుంది. ఇది గజ ఈతగాళ్లను, టన్నుల బరువు ఉండే వాటిని లోపలకు లాగేసే అంత బలమైనవి. ఇప్పటి వరకు రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో సుమారు 350 మంది వరకు రిప్ కరెంట్ వల్ల ప్రమాదానికి గురై అసువులు బాసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఉప్పాడ సముద్ర తీరానికి వచ్చిన అలలు ఒక్కసారిగా ఉప్పుటేరు నీటితో కలిసి బలమైన రిప్ కరెంట్‌గా మారి ప్రమాదాన్ని కలిగించి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రిప్ కరెంట్‌ను కనుగొనడానికి ఏయూ, ఇస్రో సంయుక్తంగా సముద్ర ప్రాజెక్టును నిర్వహిస్తోంది. సముద్ర అలలను కెమెరాల ద్వారా నిత్యం గమనిస్తూ ప్రత్యేక పరికరం ద్వారా అలల తరంగం ఎత్తు, దిశ, సమయాన్ని లెక్కిస్తారు. తద్వారా భవిష్యత్తులో రిప్ కరెంట్ ఎక్కడ ఏర్పడుతుంది? ఎలా ఏర్పడుతుంది? గుర్తించి ముందస్తు హెచ్చరికలు జారీ చేసి విధంగా ప్రయోగాలు చేస్తున్నారు.
అది ప్రమాదకర ప్రదేశం
ఉప్పాడలో ముగ్గురు యువకులు మృతి చెందిన ప్రాంతం రిప్ కరెంట్ ఉత్పత్తి అయ్యే ప్రాంతమే. ఎందుకంటే అక్కడ ఏలేరు కాలువ సముద్రంలో కలుస్తుంది. సముద్రం అక్కడ కొంత ఒంపు తిరిగి కూడా ఉంటుంది. అంటే అక్కడ వచ్చే కెరటాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఇటు నుంచి అటు నుంచి ఒకేసారి కెరటం రావడం రెండు ఢీకొనడం వల్ల రిప్ కరెంట్ (స్క్వేర్ అలలు) ఏర్పడి తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తాయి. వినాయక నిమజ్జనానికి దిగిన యువకులు విగ్రమాన్ని నిమజ్జనం చేసేటప్పుడు అలల ఉధృతి తక్కువగానే ఉన్నా ఉప్పుటేరు ఉధృతి ఒక్కసారిగా పెరగడం, దానికి తోడు సముద్ర అలలు ఎక్కువ కావడంతో రెండూ కలిసి రిప్ కరెంట్‌గా మారి వారి ప్రాణాలను తీసి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఆ ప్రదేశం చాలా ప్రమాదకరం కాబట్టే అక్కడ నిమజ్జనాలను అనుమతించలేదని పోలీసులు చెబుతున్నారు. మత్స్యకారులు సైతం ఆ ప్రదేశంలోకి తాము వెళ్లబోమని అక్కడ లోతు ఎక్కువగా ఉంటుందని అలలు ఉధృతి చాలా భయంగా ఉంటుందని చెబుతున్నారు. యువకులు రెండవ సారి విగ్రహాన్ని సముద్రం లోపలకు తోయడానికి వెళ్లిన సమయంలో రిప్ కరెంట్ ఉత్పత్తి అయ్యి ఉంటుందని అందుకే రెప్పపాటులో కనిపించనంతగా వెళ్లి పోయి గల్లంతయ్యారని భావిస్తున్నారు.
అక్కడ నిమజ్జనాలను నిషేధించాం
ఉప్పాడ హార్బర్ నిర్మాణ ప్రాంతానికి ఆనుకుని ఉన్న తీరం చాలా ప్రమాదకర ప్రదేశం అని గుర్తించారు. అందుకే అక్కడ నిమజ్జనాలను నిషేధించి ఇతర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశాం. ఈ కారణంగానే అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయలేదు. అక్కడకు ఎవరూ వెళ్లరని భావించాం. కాని అనుకోకుండా వీళ్లు అక్కడకు వెళ్లి ప్రమాదం బారిన పడ్డారు.
– వైఆర్‌కే శ్రీనివాస్, సీఐ, పిఠాపురం
షాక్ తగిలిన ఆనవాళ్లు ఉన్నాయి
చనిపోయిన వారి బాడీల్లో ఆకస్మాత్తుగా మరణం సంభవించిన ఆనవాళ్లు ఉన్నాయి. ఒక్కసారిగా నీటిలో మునిగి పోవడం వల్ల ఊపిరాడక నీటిని తాగేసి చనిపోయి ఉంటారు. కేవలం కెరటాల్లో మునిగిపోయి ఊపిరాడక చనిపోయినట్లు తెలుస్తోంది. అకస్మాత్తుగా మరణం సంభవించడం అంటే షాక్ తగిలినట్లు కూడా అనుకోవచ్చు. తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినట్లు కూడా లేనందున ఒక్కసారిగా మరణం సంభవించినట్లు భావిస్తున్నాం.
– కీర్తిప్రియ, ప్రభుత్వ వైద్యురాలు, పిఠాపురం సీహెచ్‌సీ (పోస్టుమార్టం చేసిన డాక్టర్)
గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యం
కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో వినాయక నిమజ్జనానికి వెళ్లి ప్రమాదంలో సముద్రంలో గల్లంతైన ఇద్దరి మృతదేహాలు సోమవారం తీర ప్రాంతంలో లభ్యమయ్యాయి. పిఠాపురం నవఖండ్రవాడలో జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు గల్లంతు కాగా ఒకరి మృతదేహం లభ్యమయ్యింది. కొత్తపల్లి మండలం నాగులాపల్లి నేరేళ్లమ్మ తల్లి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మంటపం నుంచి ఆదివారం సాయంత్రం ఉప్పాడ తీరానికి నిమజ్జనాకి వెళ్లారు. అక్కడ నిమజ్జనం చేసే క్రమంలో జరిగిన ప్రమాదంలో అనిశెట్టి వెంకటరెడ్డి అలియాస్ వంశీరెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందగా చింతపల్లి సతీష్‌రెడ్డి, తమిలిశెట్టి విజయవర్ధనరెడ్డి గల్లంతయ్యారు.
కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపపేట సమీపంలో తీర ప్రాంతంలో వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి. పిఠాపురం సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సాగర తీరంలో సోమవారం ఉదయం నుంచి గాలింపు చేపట్టగా మృతదేహాలు ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో అలల మధ్య తేలియాడుతుండడంతో వాటిని ఒడ్డుకు చేర్చారు. వాటికి పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment