పెదగంట్యాడ (గాజువాక): ఉవ్వెత్తున ఎగసి పడే అలలు.. అలుపు సొలుపు లేని కెరటాలు.. ఒక దాని వెంట మరొకటి వస్తూ.. అక్కడ ఉన్న బండరాళ్లను సుతారంగా తాకు తూ.. అద్భుతమైన శిల్పాలుగా చెక్కుతున్నాయి.. ఆ ప్రదేశాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నాయి.. చూపరులను ఆశ్చర్య చకితుల ను చేస్తున్నాయి.. శిలలపై శిల్పాలు చెక్కినారు అన్నాడో సినీ కవి.. కానీ ఇక్కడి రాళ్లను చూస్తే.. వాటి ఆకృతులను పరిశీలిస్తే అలలు చెక్కిన శిల్పాలు అనాల్సిందే..
అందమైన సాగర తీరం విశాఖ సొంతం.. ఆహ్లాదాన్ని పంచే ఆర్కే బీచ్, రుషికొండ బీచ్‌తో పాటు యారాడ బీచ్ కూడా విశాఖ ఖ్యాతిని ఇనుమడింపజేస్తాయనడంలో అతిశయోక్తి లేదు.. ఎంతో సువిశాలమైన విశాఖ సాగర తీరంలో.. పెద్దగా ప్రచారం లేని మరోప్రాంతం పెదగంట్యాడ మండలంలోని పాత గంగవరంలో ఉంది.. గంగవరం పోర్టు వెనుక గల సముద్ర తీరం ఆహ్లాదాన్ని పంచుతోంది.. పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తోంది.. ఇక్కడి కొండపై కొలువుదీరిన రాధామాధవ స్వామి ఆలయం వెనుక.. సముద్రం ఒడ్డున ఉన్న ఓ కొండ అందమైన గుహలతో విరాజిల్లుతోంది.. రాధామాధవ స్వామి ఆలయం నుంచి కిందకు దిగుతున్న కొద్దీ వివిధ రూపాల్లో ఉన్న రాళ్లు ఇట్టే ఆకర్షిస్తున్నాయి..
కొండను ఆనుకొని సముద్రం ఉండడంతో సాగరం నుంచి వచ్చే అలలు వాటిని తాకుతూ అందమైన శిల్పాలుగా మల్చడంతో ఈ ప్రాంతం ఇప్పుడు మండలంలో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇటీవల కాలంలో పాతగంగవరం పేరు మారుమోగుతోందంటే దానికి కారణంగా సముద్రం ఒడ్డు న ఉన్న రాళ్లే.. ఇప్పుడు ఈ ప్రాంతం ఒక పర్యాటక కేంద్రంగా మారింది. నిత్యం ఎంతోమంది రాధా మాధవస్వామి ఆలయానికి వెళ్తే.. అక్కడి నుంచి కిందకు దిగుతూ అందంగా పేర్చినట్టు ఉండే రాళ్ల మధ్య ఆటలాడుతూ.. ఫొటోలు దిగుతూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ అక్కడే ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడుపుతున్నారు.. అక్కడే ఉన్న సొరంగాల్లోకి వెళ్తూ.. కేరింతలు కొడుతున్నారు.. ఇంత సుందరమైన సాగర తీరాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు యువత ఉర్రూతలూగుతున్నారు. ఇక్కడి వాతావరణంలో తేలియాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment