బెస్ట్‌ లేడీ పోలీస్‌.. దుర్మార్గులను చీల్చి చెండాడిన ఏఎస్పీ సుప్రజ | Best Lady Police Officer ASP Supraja | Sakshi
Sakshi News home page

బెస్ట్‌ లేడీ పోలీస్‌.. దుర్మార్గులను చీల్చి చెండాడిన ఏఎస్పీ సుప్రజ

Published Thu, Feb 1 2024 1:30 PM | Last Updated on Thu, Feb 1 2024 3:06 PM

Best Lady Police Officer ASP Supraja - Sakshi

ఆమె ఓ నమ్మకం.. ఆమెపై అచంచలమైన విశ్వాసం.. కేసు టేకప్‌ చేశారంటే బాధితులకు సాంత్వన దొరికినట్లే.. నిందితుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తినట్లే. నిందితులు ఎక్కడ దాక్కున్నా వెదికి పట్టుకుని, వారికి శిక్ష పడేవరకు విశ్రమించరని అంటారు.. ఆమే గుంటూరు ఏఎస్పీ సుప్రజ. బాధితుల పక్షాన నిలిచి, వారి కన్నీళ్లు తుడిచి, న్యాయం చేయడమే కాకుండా సిబ్బందికి అన్నివిషయాల్లో చోదోడు వాదోడుగా ఉంటూ ‘సుప్రజ’ల పోలీస్‌గా పేరు గడించారు. 

గుంటూరు: ముక్కుసూటిగా మాట్లాడటం ఆమె నైజం.. సిబ్బంది కష్టసుఖాల్లో వారికి అండగా నిలుస్తారు.. అడ్మినిస్ట్రేషన్ లో ఆమె పెట్టింది పేరు.. కేసు విచారణ చేపడితే.. నిందితులకు శిక్షపడే వరకు విశ్రమించరు. అవినీతి మచ్చ లేకుండా.. మూడేళ్ల పాటు జిల్లా ప్రజలకు ఎన్నో సేవలందించిన గుంటూరు జిల్లా అడిషనల్‌ ఎస్పీ కె.సుప్రజ అటు అధికారులు.. సిబ్బంది.. ఇటు ప్రజల నుంచి ఎన్నో మన్ననలు పొందారు. జిల్లా అడ్మిన్‌ ఏఎస్పీగా ఉన్న సుప్రజను ఏసీబీకి బదిలీ చేస్తూ.. బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. గుంటూరు ఈస్ట్, వెస్ట్, ట్రాఫిక్‌ డీఎస్పీగా పనిచేయటంతో పాటు, ఏఎస్పీగా ఆమె సమర్ధవంతగా విధులు నిర్వర్తించారు. అనేక కేసుల్లో విచారణాధికారిగా బాధితుల పక్షాన నిలిచి, నిందితులకు జైలు శిక్షలు పడేలా కృషి చేశారు.  

2020లో కోవిడ్‌ సమయంలో గుంటూరు జిల్లా అడ్మిన్‌ ఏఎస్పీగా కె.సుప్రజ బాధ్యతలు స్వీకరించారు. కరోనా కల్లోల సమయంలో సిబ్బందికి రావాల్సిన పలు నగదు అంశాల్లో ఆమె కీలకంగా వ్యవహరించి అవి వారికి చెందేలా చూశారు. గుంటూరు జిల్లా రూరల్, అర్బన్‌ విభజన అంశంలో కీలక పాత్ర పోషించారు. అడ్మినిస్ట్రేషన్‌ పరంగా పూర్తిస్థాయిలో దృష్టి సారించి, మన్ననలు పొందారు.  

అనేక కేసుల్లో విశేష ప్రతిభ..  
జిల్లా అడ్మిన్‌గా బాధ్యతలు చేపట్టక ముందు అనేక కేసుల్లో విచారణాధికారిగా ఉన్న ఏఎస్పీ సుప్రజ నిందితులకు శిక్షలు పడటంలో ఎంతో పట్టుదలతో ముందుకు సాగారు. గుంటూరు ఈస్ట్‌ డీఎస్పీగా పనిచేస్తున్న సమయంలో నేపాల్‌కు చెందిన ఒక కుటుంబం స్వెట్టర్లు అమ్ముకునేందుకు గుంటూరుకు వచ్చిన సమయంలో వారి ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ కుటుంబం స్థానిక వ్యక్తులకు భయపడి ఇక్కడ నుంచి నేపాల్‌కు తిరిగి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ సుప్రజ, ఇక్కడి సిబ్బందిని నేపాల్‌కు పంపి, వారిని తిరిగి ఇక్కడకు పిలిపించి కేసు నమోదు చేయటంతో పాటు, నిందితుడి యావజ్జీవ కారాగార శిక్ష పడేలా కృషి చేశారు.  

► లాలాపేట పీఎస్‌ పరిధిలో ఒక వృద్ధుడు చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడేలా ఆమె కేసును నడిపించారు.  

► రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మేడికొండూరు బాలిక కిడ్నాప్, రేప్‌ కేసులో నెలల తరబడి పని చేసి స్వయంగా రంగంలోకి దిగిన ఏఎస్పీ 82 మంది నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరుపరిచారు. వెస్ట్‌ డీఎస్పీగా ఉన్న సమయంలో చేపట్టిన ఈ కేసులో పురోగతి సాధించటంతో అడ్మిన్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత కూడా, కేసు నిర్వహణ, చార్జిటు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించటంతో పాటు, ఆమెను అభినందించింది.  

 మూడేళ్లు ఒక ఎత్తు.. ఆ మూడు నెలలు ఒక ఎత్తు 
మూడేళ్ల పాటు గుంటూరు అడ్మిన్‌ ఏఎస్పీగా పనిచేసిన సుప్రజ.. ఒక మూడు నెలల పాటు గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. ఆ సమయంలో గుంటూరు రేంజ్‌ ఐజీ జి.పాలరాజు ఆదేశాలతో ఆమె చేపట్టిన అడ్మిని్రస్టేషన్‌ అద్భుతమనే చెప్పాలి. జిల్లాలో ఉన్న 1600  రౌడీషీటర్లుకు సంబంధించి, ఆధిపత్య పోరు, నేరాలు జరుగుతున్న సమయంలో స్వయంగా ప్రతి స్టేషన్‌కు వెళ్లిన ఆమె రౌడీషీటర్‌లకు తమదైన శైలిలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న 8 మంది రౌడీషీటర్లును జిల్లా బహిష్కరణ చేసి, వారిపై పీడీ యాక్టును ప్రయోగించిన ఘనత ఏఎస్పీ సుప్రజదే. వారిలో 1250కిపైగా బైండోవర్‌ చేసి వెన్నులో వణుకు పుట్టించారు. రాత్రి పది గంటలకల్లా దుకాణాలను మూసి వేయించడంతో పాటు, విజుబుల్‌ పోలీసింగ్‌ నిర్వహించి, అర్ధరాత్రి ప్రయాణాలు చేసే ఎంతోమందికి ధైర్యాన్ని కలి్పంచారు. కేవలం ఆ మూడు నెలల వ్యవధిలో 3వేల మందికిపైగా బహిరంగ మద్యపానానికి పాల్పడుతున్న మందుబాబులను పట్టుకుని కౌన్సెలింగ్‌ నిర్వహించారు.  

ఎన్నో అవార్డులు... ప్రశంసలు  
విధి నిర్వహిణలో విశేష ప్రతిభ కనబరిచి.. అవినీతి మచ్చలేని అధికారిగా ఏఎస్పీ సుప్రజ మంచిపేరు సంపాదించుకున్నారు. నేపాల్‌ చిన్నారి రేప్‌ కేసు ఘటనలో స్వయంగా నేపాల్‌ ప్రభుత్వ ప్రతినిధులు గుంటూరు వచ్చి ఆమెను సత్కరించటంతో పాటు, అక్కడ ఆమెకు ప్రకటించిన అవార్డును అందజేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ‘ది బెస్ట్‌ ఇన్విస్టిగేషన్‌’ అవార్డును అందుకున్నారు. ముఖ్యంగా బాలికలు, మహిళలకు సంబంధించి చేపట్టిన కేసుల్లో విశేష ప్రతిభ చూపిన ఆమె ఆరుగురికి యావజ్జీవ శిక్షలు పడేందుకు పాటుపడ్డారు. అనేక అవార్డులు చేపట్టి.. విధి నిర్వహణలో ఎలా ఉండాలో చేసి చూపించారు. అందుకే ‘అడ్మిన్‌ మేడం.. అందరి మనిíÙ’గా పేరు తెచ్చుకున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement