Bhimavaram Mavullamma Jatara 2023 Dates And Special Pujas Details Inside - Sakshi
Sakshi News home page

Bhimavaram Mavullamma Jatara: మావుళ్ళమ్మ వార్షికోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు

Published Tue, Jan 3 2023 4:02 PM | Last Updated on Tue, Jan 3 2023 6:29 PM

Bhimavaram: Mavullamma Jatara 2023 Dates, Special Pujas Details - Sakshi

భీమవరం(పశ్చిమ గోదావరి జిల్లా): మావుళ్లమ్మ అమ్మవారి 59 వార్షిక మహోత్సవాలను ఈ నెల 13 తేదీ నుంచి వచ్చే నెల 10 వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నీరుల్లి కూరగాయ, పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో దేవస్థాన సహకారంతో అమ్మవారి వార్షిక మహోత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పటికే అమ్మవారి అలంకరణ పనులు పూర్తి చేశారు. 14 రోజుల పాటు అమ్మవారి మూల విరాట్‌ దర్శనం నిలుపుదల చేసి అమ్మవారిని అలంకరించారు. అమ్మవారి ఆలయం వద్ద జాతర మహోత్సవాల ఏర్పాట్లలో భాగంగా ఆలయం వద్ద చలువ పందిళ్లు, భారీ సెట్టింగ్స్‌ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 


సుమారు నెల రోజులపాటు ఉత్సవాలు
     
మావుళ్లమ్మ అమ్మవారి వార్షిక మహోత్సవాలు నెల రోజులపాటు నిర్వహిస్తారు. ఈనెల రోజుల్లో ప్రతీ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారి ఉత్సవాల చివరి 9 రోజులపాటు అలంకరణలు చేస్తారు. ప్రతీరోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకూ జానపద నృత్యాలు, భరత నాట్యాలు, హరికథ, బుర్రకథ, పలు కళా ప్రదర్శనలు, భక్తి కార్యక్రమాలు, సినీ సంగీత విభావరి ఏర్పాటు చేస్తారు. నెల రోజుల పాటు సాంఘిక, పౌరాణిక నాటకాలు ప్రదర్శిస్తారు.  


రూ.90 లక్షల వ్యయంతో నిర్వహణ 

నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో ప్రతీ ఏడాది  నిర్వహించే అమ్మవారి మహోత్సవాలకు సుమారు రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షలు ఖర్చు చేస్తారు. గత రెండేళ్లు కరోనా కారణంగా అమ్మవారి ఉత్సవాలు సాధారణంగానే నిర్వహించారు. ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడడంతో ఈ ఏడాది సుమారు రూ.90 లక్షలు ఖర్చు చేసి వార్షిక మహోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.  

భారీగా తరలి రానున్న భక్తులు 
ఉత్సవాలను తిలకించడానికి రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. నెల రోజులపాటు ఆలయం వద్ద సందడి నెలకొంటుంది. సంక్రాంతి పండుగకు వచ్చే జనంతో పాటు భీమవరం చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భారీగా జనం తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన కళాప్రదర్శనను, ప్రత్యేక ఆకర్షణగా నిలిచే లైటింగ్, సెట్టింగ్స్, విద్యుత్‌ అలంకరణలను తిలకిస్తారు. అమ్మవారి ఉత్సవాలు నిర్వహించే నెలరోజుల పాటు రోజుకు సుమారు 7 నుంచి 8 వేల మంది భక్తులకు అన్నదానం చేస్తారు. ఇక అమ్మవారి ఉత్సవాల ముగింపు రోజున సుమారు లక్ష మందికి అమ్మవారి ప్రసాదాన్ని భోజన రూపంలో అందిస్తారు.  

58 ఏళ్లుగా ఉత్సవాల నిర్వహణ 
గత 58 ఏళ్లుగా నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో దేవస్థాన సహకారంతో విజయవంతంగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో నెల రోజులపాటు నిర్వహించే ఏకైక ఉత్సవాలుగా మావుళ్లమ్మవారి ఉత్సవాలు ప్రసిద్ది చెందాయి. ఉత్సవాల్లో సినీ నటులను ఘనంగా సువర్ణ కంఠాభరణం, హస్త కంకణంతో సత్కరిస్తారు. (క్లిక్ చేయండి: ఆమె ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్‌ అందజేసిన ఎమ్మెల్యే)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement