ఆపద వేళ.. అమృత హస్తం | Big Relief For Chronic Patients With YSR Health Pension | Sakshi
Sakshi News home page

ఆపద వేళ.. అమృత హస్తం

Published Mon, Oct 31 2022 5:37 PM | Last Updated on Mon, Oct 31 2022 5:56 PM

Big Relief For Chronic Patients With YSR Health Pension - Sakshi

పేద కుటుంబాల్లోని వ్యక్తి తీవ్రమైన అనారోగ్యంతో, దీర్ఘకాలిక వ్యాధులతో మంచం పడితే వైద్యం చేయించుకునేందుకు కూడా డబ్బులు లేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అటువంటి వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ హెల్త్‌ పెన్షన్‌లు మంజూరు చేస్తోంది. వ్యాధిని బట్టి గరిష్టంగా రూ.10 వేల వరకు అందిస్తున్న పెన్షన్‌తో సకాలంలో వైద్యం పొందుతున్నారు.  

ఒంగోలు అర్బన్‌: దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేసి దేశానికే ఆదర్శంగా నిలిచేలా పథకాలు అమలు చేశారు. ఇప్పుడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తండ్రికి మించిన తనయుడుగా అన్నీ వర్గాల పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 108, 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల ఏర్పాటుతో పాటు ఆరోగ్యశ్రీ ద్వారా పేదల ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

వైద్య సేవలే కాకుండా అనారోగ్యంతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి “వైఎస్సార్‌ హెల్త్‌ పెన్షన్‌’ ద్వారా ఉపశమనం కల్పిస్తున్నారు. గతంలో కేవలం వికలాంగులకు మాత్రమే నెలకు రూ.3 వేలు పింఛన్‌ ఇచ్చేవారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్రలో దీర్ఘకాలిక వ్యాధులతో మంచానికే పరిమితమైన వారిని చూసి చలించిపోయారు. కుటుంబ పెద్ద మంచానికి పరిమితం కావడంతో కుటుంబ పోషణ సైతం కష్టమైన పరిస్థితులను గమనించి ప్రభుత్వం ఏర్పడగానే అటువంటి వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు వైఎస్సార్‌ హెల్త్‌ పెన్షన్‌ పథకం అమలు చేసి వ్యాధిని బట్టి నెలకు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు ప్రతి నెలా అందజేస్తున్నారు.  

జిల్లాలో వైఎస్సార్‌ హెల్త్‌ పెన్షన్‌నుకు సంబంధించి ఉన్నతాధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నిజమైన బాధితులకు అండగా నిలుస్తున్నారు. 2020లో ప్రారంభమైన వైఎస్సార్‌ హెల్త్‌ పెన్షన్‌ పథకం ద్వారా ఉమ్మడి ప్రకాశంలో 3,983 మంది ఉండగా ప్రస్తుత కొత్త జిల్లాలో 2558 మంది లబ్ధిదారులు పెన్షన్‌ అందుకుంటున్నారు. ప్రస్తుతం మరో 400 దరఖాస్తులు అప్‌లోడ్‌ చేసిఉన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.3 వేలు పింఛన్‌ ఇస్తుండగా కిడ్నీ, లివర్, గుండె రీప్లేస్‌మెంట్‌ జరిగిన రోగులకు, కిడ్నీ బాధితులు (సీరం క్రియాటిన్‌ 5 ఎంఎం కంటే ఎక్కువ) ఉన్న వారికి, తీవ్రంగా కండరాల క్షీణతతో పాటు ప్రమాదాలతో మంచానికి, వీల్‌చైర్‌కు పరిమితమైన వారికి, చక్రాల కుర్చీ, మంచానికి పరిమితమైన పక్షవాతం ఉన్న రోగులకు, బోదకాలు (రెండు కాళ్లకు) ఉన్న వారికి నెలకు రూ.5 వేలు పింఛన్‌ అందజేస్తున్నారు. తలసేమియా మేజర్, సికిల్‌సెల్, సివియర్‌ హిమోఫీలియా (2 శాతం పైబడి) ఉన్న రోగులకు నెలకు రూ.10 వేలు ఇస్తున్నారు.  

పక్షవాతం, కండరాల క్షీణత, ప్రమాదాలతో మంచానికే పరిమితమైన రోగులకు సదరమ్‌ సర్టిఫికెట్‌తో పెన్షన్‌ మంజూరు చేస్తున్నారు. మిగిలిన వ్యాధులకు తొలుత మెడికల్‌ బోర్డులోని కమిటీ రోగ ధ్రువీకరణæ చేస్తారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని డాక్టర్లు సోషల్‌ ఆడిట్‌ చేసి వ్యాధి నిర్ధారణ చేసి అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని రోగులకు అందజేస్తారు. ధ్రువీకరణ పత్రంతో పాటు రోగులకు సంబంధించిన ఆధార్, బియ్యం కార్డు, బ్యాంకు ఖాతా పాస్‌ పుస్తకం తదితర వివరాలను డీఎంహెచ్‌ఓ కార్యాలయంలోని వైఎస్సార్‌ హెల్త్‌ పెన్షన్‌ విభాగంలో దరఖాస్తు అందచేయాలి. అందిన దరఖాస్తులను డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌కు అప్‌లోడ్‌ చేస్తారు. అక్కడి నుంచి సెర్ప్‌కు వెళ్లి పెన్షన్‌ మంజూరై సంబంధిత సచివాలయాలకు వెళుతుంది. సచివాలయాల ద్వారా వలంటీర్లు బాధితులకు పెన్షన్‌ అందజేస్తారు. 

అనారోగ్యంతో ఉన్న వారికి ప్రభుత్వం చేయూత
దీర్ఘకాలిక అనారోగ్యం, ప్రమాదాలతో నడవలేని పరిస్థితితో సాధారణ జీవనం గడపలేని వారికి ప్రభుత్వం వైఎస్సార్‌ హెల్త్‌ పెన్షన్‌ ద్వారా చేయూతనిస్తోంది. వ్యాధి నిర్ధారణకు సంబంధించి సదరమ్, మెడికల్‌ బోర్డు పారదర్శకంగా పనిచేసేలా పక్కా చర్యలు తీసుకున్నాం. నిరంతరం సంబంధిత ఉన్నతాధికారులతో పర్యవేక్షణ కొనసాగిస్తున్నాం. ప్రభుత్వం తలపెట్టిన పెన్షన్‌ పథకం నిజమైన రోగులకు చేరాలి. ఆ విధంగా పెన్షన్‌ మంజూరులో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. వ్యాధి నిర్ధారణలో అవకతవకలు జరిగితే సహించేది లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం. 
– ఏఎస్‌ దినేష్‌ కుమార్, కలెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement