సాక్షి, అమరావతి: బిర్యానీకి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు, హోటళ్లలో అత్యధికులు ఆరగిస్తున్న వంటకాల్లో బిర్యానీదే అగ్రస్థానం. వివాహాలు, పుట్టిన రోజు వేడుకల్లోనూ బిర్యానీ తప్పనిసరి ఐటమ్‌గా మారిపోయింది. గల్లీ స్టాల్స్ నుంచి.. మాల్స్ వరకు బిర్యానీ ప్రియులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త పేర్లు ఫ్లేవర్‌లతో బిర్యానీలు మార్కెట్‌లోకి దూసుకొస్తున్నాయి.
కుండల నుంచి డబ్బా వాలా వరకు..
కుండ నుంచి మొదలైన బిర్యానీ విక్రయాల ట్రెండ్ ఇప్పుడు స్టీల్ బిందె.. స్టీల్ బకెట్.. డబ్బాల్లో విక్రయించే వరకు చేరింది. కుండ, రెడ్ బకెట్, గ్రీన్ బకెట్, బ్లూ బకెట్, స్టీల్ బిందె, స్టీల్ డబ్బా, మండీ, బిగ్ థాలీ బిర్యానీ వంటి ఆకట్టుకునే ప్యాకింగ్‌లతో విక్రయాలు ఊపందుకున్నాయి. ఎంత మందికి.. ఎంత ధర అనే కేటగిరీని బట్టి కుండ, బకెట్, స్టీల్ బిందె, స్టీల్ డబ్బాల సైజులను ఎంపిక చేసి పార్శిల్ ఇస్తున్నారు. ఇంటిల్లిపాది ఆరగించాక మిగిలిన బకెట్, బిందె, డబ్బాలను ఇంట్లో వినియోగించుకునేందుకు ఆహార ప్రియులు ఆసక్తి చూపడంతో ఈ తరహా విక్రయాలకు డిమాండ్ పెరిగింది. నిన్న మొన్నటివరకు మెట్రోలకే పరిమితమైన ఈ కల్చర్ ఇప్పుడు గ్రామాలకూ పాకింది. స్విగ్గీ, జొమాటో తదితర ఆన్‌లైన్ సర్వీసుల ద్వారా కూడా కుండ, బకెట్, బిందె బిర్యానీలు ఆర్డర్ ఇస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.
కుండ బిర్యానీ క్రేజే వేరు
మట్టి కుండలో వండే బిర్యానీకి ఉండే క్రేజే వేరు. తొలినాళ్లలో కుండలోనే బిర్యానీ వండి విక్రయిస్తే.. ఇప్పుడు భారీ గిన్నెల్లో వండిన బిర్యానీని కుండల్లో నింపి విక్రయిస్తున్నారు. కోనసీమలోని రావులపాలెంలో కుండ బిర్యానీ ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు విజయవాడ, విశాఖపట్నంతోపాటు రాష్ట్రంలోని ప్రముఖ పట్టణాలకు కుండ బిర్యానీ విక్రయాలు విస్తరించాయి. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు పంజాబ్, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కుండ బిర్యానీ చాలా ఫేమస్ అయిపోయింది. కాగా.. రెడ్, గ్రీన్, బ్లూ బకెట్ బిర్యానీల ట్రెండ్ కూడా రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తోంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ తదితర నగరాల్లో వీటి విక్రయాలు పెరిగాయి. ఎంత మందికి బిర్యానీ కావాలో చెప్పి అందుకు తగిన ధర చెల్లిస్తే సరిపడా సైజు బకెట్‌లో బిర్యానీ పార్శిల్ ఇస్తున్నారు. కొన్ని రోజుల క్రితం విశాఖపట్నంలో స్టీల్ బిందె, స్టీల్ డబ్బా బిర్యానీలు రంగప్రవేశం చేయగా.. వాటికి మంచి డిమాండ్ ఏర్పడింది.
బిర్యానీ ఏటీఎం వచ్చేసింది
దేశంలో తొలిసారిగా తమిళనాడులోని కొలత్తూర్‌లో ఓ స్టార్టప్ కంపెనీ బిర్యానీ ఏటీఎం తెరిచింది. ఏటీఎం మెషిన్‌లో 32 అంగుళాలతో ఏర్పాటు చేసిన టచ్ స్క్రీన్‌పై వినియోగదారుడి పేరు, ఫోన్ నంబర్ నమోదు చేస్తే మెనూ వస్తుంది. కావాల్సిన బిర్యానీని ఎంపిక చేసి.. ధర మొత్తాన్ని క్రెడిట్ కార్డు లేదా యూపీఐ స్కాన్ ద్వారా చెల్లిస్తే.. మనం ఆర్డర్ ఇచ్చిన బిర్యానీ పార్శిల్ ఏటీఎం నుంచి అందుబాటులోకి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment