biryani food
-
ప్రేమ ఖైదీ@ మండీ
బంజారాహిల్స్: క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరిని కదిలించినా వారు చెప్పేదొకటే.. మేం చిన్నప్పుడు ఒకే కంచంలో తిన్నాం..రా అని.. అలాంటి ఫ్రెండ్స్ అందరికీ ఒకే కంచంలో తినే అనుభూతిని కల్పించే మండీ ట్రెండ్ కొనసాగుతోంది. నలుగురైదుగురు ఫ్రెండ్స్ అంతా కలిసి ఓ భారీ కంచంలో నచి్చన ఫుడ్ తింటూ సరదా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. నగరంలో ఎప్పటి నుంచో మండీ రెస్టారెంట్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం వీటికి కొత్త తరహా థీమ్స్ జతచేస్తున్నారు.. దీంతో ఆహార ప్రియులు వాటిని వెతుక్కుంటూ వెళ్తున్నారు. సాధారణ రెస్టారెంట్లతో పోలిస్తే ఈ మండీలలో దొరికే ఫుడ్ కాస్త వెరైటీ.. మణికొండలో బాహుబలి ప్లేట్ పేరుతో ఒకేసారి 25 మంది కూర్చొని తినే కాన్సెప్ట్ ఆ మధ్య ఫేమస్ అయ్యింది. దీంతో మరికొన్ని థీమ్స్ నగరవాసులను ఆకర్షిస్తున్నాయి.. మండీ కల్చర్ వాస్తవానికి సౌదీ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే చాలా ఏళ్ల నుంచే నగరంలో ఈ తరహా రెస్టారెంట్లు కొనసాగుతున్నాయి. వీటిలో దొరికే ఫుడ్ బయటి రెస్టారెంట్లతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటుంది. సౌదీ దేశాల్లోని మండీ రెస్టారెంట్ల మాదిరే ఇక్కడ బిర్యానీలో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ వాడతారు. తక్కువ స్పైసీతో వంటకాలు చేయడం మండీ రెస్టారెంట్ల ప్రత్యేకత. సహజ మసాల దినుసులు, కారం తక్కువగా వినియోగించి చికెన్, మటన్, ఫిష్ తదితర వంటకాలను విభిన్నంగా తయారు చేస్తారు. అయితే ఈ మధ్య కాలంలో తెలుగువారు పెత్త ఎత్తున మండీలకు వస్తుండటంతో వారి అభిరుచికి అనుగుణంగా వంటకాలను వడ్డిస్తున్నారు. ప్రత్యేక థీమ్‌లతో..సాధారణ మండీలకు వెళ్లి బోర్ కొట్టిన నగరవాసుల కోసం వ్యాపారులు ఈ మధ్య జైల్, గర్ల్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మండీ పేరుతో ఏర్పాటైన కొత్త థీమ్‌లు క్రేజ్ సొంత చేసుకుంటున్నారు. ముఖ్యంగా జైలు వాతావరణాన్ని తలపించేలా రూపొందించిన జైలు మండీలో రిమాండ్‌లో ఉన్న ఖైదీల మాదిరిగా లోపల కూర్చొని తింటూ నగరవాసులు సెలీ్ఫలు దిగుతూ మురిసిపోతున్నారు. ఈ జైలు మండీలో ఫుడ్‌ను తీసుకొచ్చే వారంతా ఖైదీల దుస్తులతో..ఉంటారు. ఇక కౌంటర్లో ఉండే వ్యక్తి జైలర్‌గా, ఫుడ్‌లో ఏదైనా సమస్య వస్తే తీర్చేందుకు ఓ వ్యక్తి లాయర్ గెటప్‌లో దర్శనమిస్తారు. ఇక గర్ల్ ఫ్రెండ్ మండీలో కుటుంబ సభ్యులు, ప్రేమికులు కూర్చొని తినే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నగరంలో సుమారు 150కి పైగా మండీ రెస్టారెంట్లు నడుస్తున్నాయి.ఫ్యామిలీలు ఎక్కువగా వస్తున్నారుజైలు మండీలో భోజనం చేసేందుకు ఎక్కువగా ఫ్యామిలీలు వస్తున్నాయి. జైలు థీమ్‌లో ఫొటోలు దిగుతూ సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. జైలులో ఎలాంటి వాతావరణం ఉంటుందో అదే తరహాలో ఉంటుంది. జైలు బ్యారెక్‌లో రుచికరమైన భోజనం చేసి వెళ్తున్నామనే తృప్తి వారికి కలిగిస్తున్నాం. – ప్రవీణ్, జైలు మండీ మేనేజర్ -
ఆకలితో బిర్యానీ కోసం వెళ్తే.. చాలా దారుణంగా..
భద్రాద్రి: ఆకలితో ఉన్న వారు రెస్టారెంట్‌కు వెళ్తే బిర్యానీతో పాటు పెరుగు పురుగులు రావడంతో ఆందోళనకు దిగారు. టేకులపల్లికి చెందిన లక్ష్మణ్‌రావు, సురేశ్, రమేశ్ కొత్తగూడెంలోని ఆర్టీఓ కార్యాలయానికి వచ్చి పనిముగిశాక కొత్తగూడెం సెవెన్‌హిల్స్ ఏరియాలోని రెస్టారెంట్‌కు వెళ్లారు. ముగ్గురు బిర్యానీ తీసుకుని తినే క్రమాన బిర్యానీతో పాటు పెరుగులోనూ చిన్నచిన్న పురుగులు కనిపించడంతో సిబ్బందిని ప్రశ్నించారు. అయితే, వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో నిలదీశారు. పోలీసులు చేరుకుని వివరాలను సేకరించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి తనిఖీలు చేపట్టారు. -
ఫంక్షన్ ఏదైనా అటెన్షన్ బిర్యానీదే
● ● జిల్లాలో 20 రకాలకుపైగా బిర్యానీలు లభ్యం ● నిమిషానికి పది బిర్యానీలు ఆర్డర్ పెట్టి తింటున్న వైనం ● శ్రీకాకుళం: బారసాల నుంచి దశ ది న కర్మల వరకు, పుట్టిన రోజు నుంచి పెళ్లిళ్ల వరకు ఫంక్షన్ ఏదైనా అటెన్షన్ అంతా బిర్యానీలదే. ఈ వంటకం ఎంతబాగా కుదిరితే కార్యం అంత చక్కగా జరిగినట్టు. అందులోనూ హైదరాబాదీ బిర్యానీ అంటే సిక్కోలు వాసులు లొట్టలేసుకుని తింటున్నారు. ఒకప్పుడంటే ఈ బిర్యానీ దొరకడం కష్టంగా ఉండేది గానీ.. ఇప్పుడు దాదాపు అన్ని ఊళ్లలోనూ బిర్యానీ సెంటర్లు కనిపిస్తున్నాయి. జిల్లాలో దాదాపు 20 రకాల బిర్యానీలు దొరుకుతున్నాయి. నేడు ప్రపంచ బిర్యానీ దినోత్సవం. వెజ్ అయినా.. నాన్‌వెజ్ అయినా.. ఎర్రటి మాంసం ముక్కలు కనిపిస్తే నే బిర్యానీ మజా ఇస్తుందనుకుంటే పొరపాటే.. పుట్టగొడుగుల నుంచి పన్నీరు వరకు, ఆవకాయ నుంచి గోంగూర వరకు పలు రకాల బిర్యానీలు చికెను, మటను బిర్యానీలకు గట్టి పోటీ ఇస్తున్నా యి. ఇటీవలే ప్లాంట్‌బేస్డ్ చికెన్, మటన్ పేరిట బిర్యానీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవి శాకాహారమే. మాంసాహార విషయానికి వస్తే హైదరాబాదీ దమ్బిర్యానీతో పాటు పొట్లం బిర్యానీ, మటన్, ప్రాన్ బిర్యానీలంటూ రకరకాలు నోరూరిస్తున్నాయి. రూ.100 నుంచి రూ.700లకు పైబడి బిర్యానీ ధర ఉంది. జిల్లాలో నిమిషానికి 10 బిర్యానీలు ఆన్లైన్ ఆర్డర్లు వస్తున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. హైదరాబాద్ బిర్యానీకే ఆదరణ ఎన్నో రకాలు బిర్యానీలు ఉన్నా హైదరాబాద్ దమ్ బిర్యానీకి ఉన్న ఆదరణ ప్రత్యేకం. అన్ని బిర్యానీల్లో యాభై శాతం ఇవే వెళ్తాయి. వెజ్, నాన్ వెజ్ల బిర్యానీలలో దమ్కే ప్రథమస్థానం. – తపన్‌కుమార్, బాబూరావు,చెఫ్‌లు బిర్యానీ అంటే ఎంతో ఇష్టం ప్రతి వారం చివర్లో బిర్యానీ తప్పక తింటాను. బిర్యానీ అంటే అంత ఇష్టం. ఆహార ప్రియు ల అభిరుచి మేరకు తయారీ దారులు కూడా రకరకాల రుచులను అందుబాటులోకి తెస్తున్నారు. ఇది మావంటి వారికి సంతోషం. – ఇప్పిలి సురేష్, శ్రీకాకుళం -
బిర్యానీ బిందాస్..ఏటీఎం సైతం వచ్చేసింది!
సాక్షి, అమరావతి: బిర్యానీకి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు, హోటళ్లలో అత్యధికులు ఆరగిస్తున్న వంటకాల్లో బిర్యానీదే అగ్రస్థానం. వివాహాలు, పుట్టిన రోజు వేడుకల్లోనూ బిర్యానీ తప్పనిసరి ఐటమ్‌గా మారిపోయింది. గల్లీ స్టాల్స్ నుంచి.. మాల్స్ వరకు బిర్యానీ ప్రియులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త పేర్లు ఫ్లేవర్లతో బిర్యానీలు మార్కెట్లోకి దూసుకొస్తున్నాయి. కుండల నుంచి డబ్బా వాలా వరకు.. కుండ నుంచి మొదలైన బిర్యానీ విక్రయాల ట్రెండ్ ఇప్పుడు స్టీల్ బిందె.. స్టీల్ బకెట్.. డబ్బాల్లో విక్రయించే వరకు చేరింది. కుండ, రెడ్ బకెట్, గ్రీన్ బకెట్, బ్లూ బకెట్, స్టీల్ బిందె, స్టీల్ డబ్బా, మండీ, బిగ్ థాలీ బిర్యానీ వంటి ఆకట్టుకునే ప్యాకింగ్లతో విక్రయాలు ఊపందుకున్నాయి. ఎంత మందికి.. ఎంత ధర అనే కేటగిరీని బట్టి కుండ, బకెట్, స్టీల్ బిందె, స్టీల్ డబ్బాల సైజులను ఎంపిక చేసి పార్శిల్ ఇస్తున్నారు. ఇంటిల్లిపాది ఆరగించాక మిగిలిన బకెట్, బిందె, డబ్బాలను ఇంట్లో వినియోగించుకునేందుకు ఆహార ప్రియులు ఆసక్తి చూపడంతో ఈ తరహా విక్రయాలకు డిమాండ్ పెరిగింది. నిన్న మొన్నటివరకు మెట్రోలకే పరిమితమైన ఈ కల్చర్ ఇప్పుడు గ్రామాలకూ పాకింది. స్విగ్గీ, జొమాటో తదితర ఆన్లైన్ సర్వీసుల ద్వారా కూడా కుండ, బకెట్, బిందె బిర్యానీలు ఆర్డర్ ఇస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కుండ బిర్యానీ క్రేజే వేరు మట్టి కుండలో వండే బిర్యానీకి ఉండే క్రేజే వేరు. తొలినాళ్లలో కుండలోనే బిర్యానీ వండి విక్రయిస్తే.. ఇప్పుడు భారీ గిన్నెల్లో వండిన బిర్యానీని కుండల్లో నింపి విక్రయిస్తున్నారు. కోనసీమలోని రావులపాలెంలో కుండ బిర్యానీ ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు విజయవాడ, విశాఖపట్నంతోపాటు రాష్ట్రంలోని ప్రముఖ పట్టణాలకు కుండ బిర్యానీ విక్రయాలు విస్తరించాయి. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు పంజాబ్, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కుండ బిర్యానీ చాలా ఫేమస్ అయిపోయింది. కాగా.. రెడ్, గ్రీన్, బ్లూ బకెట్ బిర్యానీల ట్రెండ్ కూడా రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తోంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ తదితర నగరాల్లో వీటి విక్రయాలు పెరిగాయి. ఎంత మందికి బిర్యానీ కావాలో చెప్పి అందుకు తగిన ధర చెల్లిస్తే సరిపడా సైజు బకెట్లో బిర్యానీ పార్శిల్ ఇస్తున్నారు. కొన్ని రోజుల క్రితం విశాఖపట్నంలో స్టీల్ బిందె, స్టీల్ డబ్బా బిర్యానీలు రంగప్రవేశం చేయగా.. వాటికి మంచి డిమాండ్ ఏర్పడింది. బిర్యానీ ఏటీఎం వచ్చేసింది దేశంలో తొలిసారిగా తమిళనాడులోని కొలత్తూర్‌లో ఓ స్టార్టప్ కంపెనీ బిర్యానీ ఏటీఎం తెరిచింది. ఏటీఎం మెషిన్లో 32 అంగుళాలతో ఏర్పాటు చేసిన టచ్ స్క్రీన్‌పై వినియోగదారుడి పేరు, ఫోన్ నంబర్ నమోదు చేస్తే మెనూ వస్తుంది. కావాల్సిన బిర్యానీని ఎంపిక చేసి.. ధర మొత్తాన్ని క్రెడిట్ కార్డు లేదా యూపీఐ స్కాన్ ద్వారా చెల్లిస్తే.. మనం ఆర్డర్ ఇచ్చిన బిర్యానీ పార్శిల్ ఏటీఎం నుంచి అందుబాటులోకి వస్తుంది. -
మండి బిర్యానీ తిని 12 మందికి అస్వస్థత.. కారణం అదేనా?
మెదక్: ఓ హోటల్లో బిర్యాని తినడంతో పలువురు అస్వస్థతకు గురై చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన పవన్, అరవింద్, మహేందర్ ఈనెల 18వ తేదీ రాత్రి నర్సాపూర్‌లోని ఓ మండి హోటల్లో మండి బిర్యాని పార్శిల్ తీసుకెళ్లి తిన్నారు. అలగే నర్సాపూర్‌కు చెందిన అజీజ్ మరో ఆరుగురు మిత్రులతో కలిసి అదే మండి హోటల్ తిని అస్వస్థతకు గురయ్యారు. ఇదిలాఉండగా నర్సాపూర్‌కు చెందిన మహేశ్, షకీల్, నాని కూడా అస్వస్థతకు గురై వాంతులు, విరేచనాలు కావడంతో మహేశ్ ఆదివారం రాత్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. మిగిలిన వారు ఇంటి వద్దనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ మీర్జానజీంబేగ్‌ను అడగ్గా ఫుడ్ పాయిజన్‌తో వారికి వాంతులు విరేచనాలు అయ్యాయని చెప్పారు. శాంపిల్స్ సేకరణ నర్సాపూర్‌లోని మన్నత్ అరేబియన్ మండి హోటల్ నుంచి పలు శాఖల అధికారులు శాంపిల్స్ సేకరించినట్లు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ సునీత తెలిపారు. మన్నత్ మండి హోటల్ బిర్యాని తిన్న పలువురు యువకులు అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కలెక్టర్ రాజర్షిషా ఆదేశాల మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ సునీత, వైద ఆరోగ్య శాఖ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయనిర్మల, మున్సిపల్ కమిషనర్ వెంకట్‌గోపాల్ తదితరులు మంగళవారం హోటల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ హోటల్లో వాడుతున్న పదార్థాలను పరిశీలించడంతో పాటు కొన్ని శాంపిల్స్ సేకరించారు. తాము సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపుతామని, ఆ నివేదికలు వచి్చన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. హోటల్లో అధికారులు కలియ తిరిగారు. -
ఫుడ్ ఆర్డర్లలో బిర్యానీదే హవా..సెకనుకు 2 బిర్యానీలు.. హాంఫట్
గతంతో పోలిస్తే హైదరాబాదీలలో ఆరోగ్య స్పృహ పెరిగిందనేది ఫుడ్ ఆర్డర్ల ద్వారా మరోసారి రుజువైంది. విందు వినోదాల వీకెండ్ తర్వాత రోజు ఇది మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ.. వార్షిక నివేదిక వెల్లడించిన ఆసక్తికరమైన అంశాలివీ.. – సాక్షి, హైదరాబాద్ గ్రాసరీస్‌తో సహా విభిన్న రకాల కేటగిరీ ఉత్పత్తులను స్విగ్గీ అందిస్తున్నప్పటికీ.. మొత్తం ఆర్డర్లలో 48 శాతం ఫుడ్‌కు సంబంధించినవే. ఈ ఏడాది పెట్ ఫుడ్ కూడా ఆర్డర్లు బాగా పెరిగాయి. ఆసక్తికరంగా.. 20వేల ఆర్డర్స్ పెట్ ఫుడ్ కోసం వచ్చాయి. ఫుడ్ ఫర్ హెల్త్.. ఆరోగ్యకరమైన ఆహారం కోరుతూ హెల్త్ హబ్‌కి ఆర్డర్లు ఈ ఏడాది 200 శాతం పెరిగాయి. దేశంలోనే ఆరోగ్య స్పృహ కలిగిన ఆహారం కోరే నగరాల్లో బెంగళూరు ప్రథమ స్థానంలో ఉండగా గతం కంటే మెరుగ్గా హైదరాబాద్ రెండో స్థానం దక్కించుకోవడం విశేషం. ఆ తర్వాత స్థానంలో ముంబై నిలిచింది. విందూ వినోదాలు ఎక్కువగా జరిగే వారాంతపు రోజుల అనంతరం సోమవారం ఆరోగ్యకర ఆహారం గురించి ఆర్డర్లు ఎక్కువగా వస్తుంటే.. ఆ తర్వాత స్థానం గురువారం దక్కించుకుంది. కీటో శైలి ఫుడ్‌లో 23 శాతం వృద్ధి కనిపించగా, వెగాన్ శైలి, శాకాహారపు ఆర్డర్స్‌లో 83 శాతం పెరుగుదల నమోదైంది. చదవండి: అంతరిక్షానికీ ఫుడ్ డెలివరీ.. సెకనుకు 2 బిర్యానీలు.. హాంఫట్.. నగరంలో చికెన్ బిర్యానీ ఆర్డర్లకే ఫస్ట్ ప్లేస్ దక్కుతోంది. అలాగే యాప్‌ని తొలిసారి వినియోగిస్తున్నవారిలో అత్యధికులు చికెన్ బిర్యానీతోనే అరంగేట్రం చేస్తున్నారట. దేశవ్యాప్తంగా గత ఏడాది నిమిషానికి 90 బిర్యానీల ఆర్డర్లు వస్తే.. ఈ ఏడాది అది 115కి పెరిగింది. అంటే సెకనుకు 2 బిర్యానీలుగా చెప్పొచ్చు. చికెన్ బిర్యానీ వినియోగంలో వరుసగా చెన్నై, కోల్‌కతా, లక్నో, హైదరాబాద్‌లు టాప్‌లో ఉన్నాయి. ముంబైలో మాత్రం చికెన్ బిర్యానీని దాల్ కిచిడీ దాటేసింది. చదవండి: ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి.. అక్కడ రూ.1కే మిర్చిబజ్జి ! బ్రౌనీస్ బాక్స్ డెలివరీకి 43.3 కి.మీ జర్నీ.. ► అత్యధిక దూరం ప్రయాణం చేయించిన ఆర్డర్లలో నగరానికి రెండో స్థానం దక్కింది. ఓ కస్టమర్ తన ప్రియ నేస్తానికి ఆర్డర్ చేసిన చాక్లెట్ బ్రౌనీస్ బాక్స్‌ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అందించడం కోసం సిటీకి చెందిన డెలివరీ బాయ్ 43.3 కి.మీ ప్రయాణం చేశాడు. ► ఈ విషయంలో ప్రథమ స్థానం దక్కించుకున్న బెంగళూరులో ఫుడ్ ప్యాక్ అందించడానికి ఓ స్విగ్గీ బాయ్ ఏకంగా 55.5 కి.మీ ప్రయాణం చేశాడు. కోల్‌కతాలో ఓ బిర్యానీ ప్రేమికురాలు తనకు ఇష్టమైన మటన్ బిర్యానీ కోసం 39.3 కి.మీ ప్రయాణం చేయించింది. చదవండి: బిర్యానీ కోసం టెంప్ట్ అయ్యాడు, అలా ఆర్డర్ పెట్టి..ఇలా పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు మనసు దోసె... దోసెలు ఆర్డర్ చేయడంలో బెంగళూరు టాప్‌లో ఉంది. బటర్ దోసె ఆర్డర్లలో బెంగళూరు తర్వాత స్థానం నగరానికి దక్కగా ముంబై మూడో స్థానంలో ఉంది. నగరవాసులు అత్యధికంగా ఆర్డర్ చేసిన వాటిలో.. చికెన్ బిర్యానీ తొలిస్థానంలో ఉండగా, చికెన్ 65 తర్వాతి స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత స్థానంలో పన్నీర్ బటర్ మసాలా నిలవగా, మసాలా దోసె 4, ఇడ్లీ 5వ స్థానాల్లో నిలిచాయి. సాధారణంగా రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య ఫుడ్ ఆర్డర్స్ ఎక్కువ. రాత్రి 10 గంటల తర్వాత స్నాక్స్‌కు ఆర్డర్స్ పెరిగాయి. 80 శాతం మంది ఆన్లైన్ ద్వారా పేమెంట్స్‌కు మొగ్గు చూపుతున్నారు కొద్దిమంది మాత్రమే డెలివరీ తర్వాత నగదు చెల్లిస్తున్నారు. -
అదిరిపోయే ఆఫర్లు.. ఇంకెందుకు ఆలస్యం
కొత్త సంవత్సరం ఎన్నో ఆశలను, ఆశయాలను తీసుకువస్తుంది. ప్రతి ఏడాది మనకు అనేక జ్ఞాపకాలను, అనుభూతులను అందిస్తుంది. వీటికితోడు కొన్ని చేదు అనుభవాలను సైతం ఇస్తుంది. గడిచిన ప్రతి క్షణం రేపటికి ఒక జ్ఞాపకమే. మంచి చెడుల సమ్మేళనమే జీవితం. అలాంటి జీవితంలో మరో నూతన అధ్యాయాన్ని స్వాగతిస్తూ.. న్యూ ఇయర్‌కు వెల్కమ్ చెబుతాం.. న్యూ ఇయర్ ఇంకో నెల రోజులు ఉంది అనగానే వేడుకలు, సంబరాల గురించి మదిలో ఆలోచనలు మెదులుతాయి. గత ఏడాది కంటే భిన్నంగా ఈసారి డిసెంబర్ 31 వేడుకల నిర్వహణకు హైదరాబాదీయులు తహతహలాడుతున్నారు. మొదట్లో ఈ కల్చర్‌కు ఇంత క్రేజు లేకున్నా రానూ రానూ పరాయి వేడుకపై మోజు బంగారం ధరలా పెరుగుతూనే ఉంది. ఇక ఈ నూతన సంవత్సర సంబరాలలో ప్రజలను ఆకర్షించే వాటిలో ఆఫర్లు ప్రధానమైనవి. కేకుల నుంచి ఫేస్ క్రీమ్ వరకు అన్ని ఆఫర్లే (క్లాతింగ్, ఫుట్‌వేర్, జ్యూవెల్లరీ, ఫుడ్, కాస్మోటిక్స్).. వీటిలో మరీ ముఖ్యమైనది ఫుడ్. కోటి విద్యలు కూటి కొరకే అన్నారు పెద్దలు. ఫుడ్‌ను ఇష్టపడని వారంటూ ఉండరు. అసలే హైదరాబాదీలు భోజన ప్రియులు. ఇక ఆఫర్లు కనిపిస్తే ఊరుకుంటారా... లేదండోయ్ ఆవురావురంటూ లాంగిచేయడమే. చాలా సందర్బాల్లో ఫుడ్ ఫెస్టివల్స్‌ను సైతం నిర్వహిస్తుండటం తెలిసిందే. మరీ ఫుడ్‌కు ఉన్న డిమాండేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.. ఆఫర్లే ఆఫర్లు... నగరంలో ఇంచుమించుగా 12వేల వరకు చిన్న, పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు ఉండగా. మరో 10వేల దాకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మెస్‌లు హోటల్ ఉన్నాయి. హోటళ్లు, రిసార్ట్లు ప్రజలను ఆకర్షించేందుకు వినూత్నడిస్కౌంట్లు, స్పెషల్ ఆఫర్లతో తలుపులు తెరుస్తున్నాయి. నోరూరించే ఆహారాన్ని అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. రెస్టార్లెంటు, హోటళ్లు, దాబాలు, చిన్న చిన్న హోటళ్లు సైతం తమదైన రీతిలో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఒకటి కొంటే మరొకటి ఉచితమని,, ఒక్కొదానిపై 30, 40, 50 శాతం వరకు డిస్కౌంట్‌ను ప్రకటిస్తున్నాయి. కొన్ని రెస్టారెంట్లయితే బఫేపై వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఇస్తున్నాయి. కొన్నిచోట్ల అన్లిమిటెడ్ ఫుడ్, బేవరేజ్‌ను ఆఫర్ చేస్తున్నారు. పేరుగాంచిన హోటళ్లు పాశ్చాత్య వంటకాలు, కాక్టైల్స్, మాక్‌టైల్స్‌ను రుచి చూపించనున్నాయి. నాన్ వెజ్ ఆఫర్లు.. ఆదివారం వచ్చిందంటే ముక్క లేనిది ముద్ద దిగదు. అలాంటిది వేడుకల్లో నాన్ వెజ్ లేకుంటే.. నో నో తప్పకుండా ఉండాల్సిందే అంటున్నారు హైదరాబాదీలు. మరీ నాన్ వెజ్ లవర్స్ వారి కోసం ప్రముఖ రెస్టారెంట్లు ఇస్తున్న ఆఫర్లు ఏంటో తెలుసుకుందాం. హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు... ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్బంలో బిర్యాని లాంగించేస్తూ ఉంటారు. వీటిలో చికెన్, మటన్, మష్రూమ్,ఫిష్ బిర్యానీలు ప్రత్యేకం. ఈ సారి ఈ బిర్యానిపైలపై ఆఫర్లు ఆశించిన స్థాయిలో లేనట్లు కన్పిస్తోంది. సాధారణ రోజుల్లో బిర్యాని ధర రెస్టారెంట్లను బట్టి 150 నుంచి 300 వరకు ఉండగా... న్యూ ఇయర్ సందర్భంగా ఈ ధరను 100 నుంచి 250 లోపు తగ్గించారు. అదేవిధంగా కొన్ని రకాల ఐటమ్‌లపై 10 నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. ఇక స్టాటర్లు, సూప్‌లు ధరలు అదేవిధంగా కొనసాగుతున్నాయి. ఆన్లైన్ ఫుడ్ సర్వీసింగ్.... ఆన్లైన్ ఫుడ్ సర్వీస్‌లు వచ్చాక నగరంలో తిండికి కొదవే లేకుండా పోయింది. యాంత్రిక టెక్నాలజీ వచ్చాక బిజీ సిటీ లైఫ్‌లో అటు ఉద్యోగం ఇటు జీవితాన్నిసమన్వయం చేయలేక నానా తాంటాలు పడుతున్న కుటుంబాలు ఎన్నో. అలాంటి వారికి ఆన్లైన్ ఫుడ్ డెలీవరీ యాప్‌లు ఎంతగానో దోహదపడుతున్నాయి. కేవలం తినాలనుకున్న సమయానికి అరగంట ముందు కావాల్సిన ఫుడ్‌ను ఆర్డర్ చేసుకుంటే సరి. దీనికి కావాల్సింది. కేవలం సంబంధిత యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడమే. హోటల్ కు వెళ్లి తినేవారు తగ్గడంతో ఆన్లైన్ ఫుడ్ సర్వీస్‌లను డిమాండ్ పెరిగింది. ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించడంతో ఫుడ్డీస్ రెస్టారెంట్లకు క్యూ కడుతున్నారు. వెజ్, నాన్‌వెజ్, ఫాస్ట్‌ఫుడ్ ఐటమ్ ఏదైనా సరే మనీ ఉంటే చాలు. మీ దరికి విచ్చేస్తుంది. అంతేగాక 10 శాతం నుంచి 50 శాతం వరకు డిస్కౌంటు లభిస్తుంది. పైగా డెలివరీ కూడా ఫ్రీ... అర్థరాత్రి అపరాత్రి అన్న తేడా కూడా లేదు. ఎప్పుడంటే అప్పుడు.. ఎక్కడంటే అక్కడ మీరు కోరుకున్న ఆహారం.. మీ చెంతకు చేరుతుంది. దీంతో ఫుడ్ ఆర్డరింగ్ అనేది చాలామంది జీవితాలలో ఓ ఫ్యాషన్‌లో మారిపోయింది. ఫేమస్ ఫుడ్ యాప్‌లు ఆన్లైన్ ఫుడ్ యాప్‌లో స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఈట్స్, ఫుడ్ పాండా వంటివే అధికం. సిటీలో నిత్యం అమ్ముడయ్యే ఫుడ్‌లో 60శాతం మేర ఆన్ లైన్ డెలివరీలే ఉంటాయి. ఒక్క స్విగ్గీ ఫుడ్ డెలివరీ సంస్థనే నగరంలో రోజూ 80వేల ఆర్డర్ల వరకు యాప్ ద్వారా విక్రయిస్తోంది. ఇలా మిగతా ఫుడ్ డెలివరీ సంస్థలు అన్ని కలిసి దాదాపు ప్రతి నెల 10లక్షలకు పైనే ఆర్డర్లను చేరవేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండానే తమ వద్దకు ఫుడ్ వస్తుండటంతో ఈ యాప్‌లకు క్రేజ్ పెరిగిపోయింది. దీంతో ప్రత్యేక ప్యాకేజీల రూపంలో తమ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. భోజన ప్రియులను కట్టిపడేస్తున్నాయి. ఇంకేముంది ఆర్డర్ చేసిన అరగంటలో నోరూరించే వంటకాలు మన ముంగిట ప్రత్యక్షమవుతున్నాయి. ప్రమోషన్ ఆఫర్లు, డిస్కౌంట్ల వర్షాలు.. కొద్ది తేడాతో దాదాపు అన్ని సంస్థలు ఒకే విధమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా బిర్యానీలు, పిజ్జాలు, మిల్క షేక్‌లు,ఫ్యామిలీ ప్యాక్ వంటివి అధికంగా ఉన్నాయి. ఈ న్యూ ఈయర్‌కు మరీ ఏ సంస్థ ఏ ఆర్డర్‌ను అందిస్తోందో ఓ లుక్కేద్ధాం... జొమాటో...న్యూ యూజర్లకు 40 శాతం డిస్కౌంట్‌ను అందిస్తుంది. అంతేగాక ప్రోమో కోడ్లు అందిస్తుంది. అలాగే పేటీఎం యూపీఐ ద్వారా రూ. 350 మించి కొనుగోలు చేస్తే 30 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇందుకు ZOMATO300 కోడ్‌ను ఆప్లై చేయాలది. అదే విధంగా స్నాక్స్‌పై 50 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. టాప్ రెస్టారెంట్లలో రూ. 99 కంటే కొనుగోలు చేస్తే 50 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇందుకు ZOMATO కోడ్‌ను అప్లై చేయాలి. కోటక్ మహీంద్ర కార్డు ద్వారా రూ. 250 కంటే ఎక్కు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్‌ను అధికంగా రూ75 వరకు అందిస్తోంది. ప్రత్యేక పార్టీ ఆఫర్ పేరుతో రూ .500 విలువైన ఆహార ఆర్డర్లలో రూ .1000 వరకు ఆదా ఇస్తుంది. ఇది కేవలం ఎంచుకున్న రెస్టారెంట్లలో మాత్రమే. స్విగ్గీ.. కొత్త యూజర్లకు 33 శాతం డిస్కౌంట్‌ను ఇస్తుంది. దీంతోపాటు ఫ్రీ డెలివరీ లభిస్తుంది. ఫుడ్ డెలివరీ యాప్స్ అన్నీ కొత్త యూజర్లను ఆకట్టుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తాయి. ఆఫర్లు కూడా వారికే ఎక్కువ ఉంటాయి. సంబంధిత రెస్టారెంట్ల ద్వారా WELCOME50... ద్వారా 50 శాతం డిస్కౌంట్‌ను ఇస్తుంది. 150LPAYNEW ద్వారా 150 క్యాష్ బ్యాక్ అందిస్తోంది. రెండు మీడియం పిజ్జాలను ఒక పిజ్జా ధరకే పిజ్జా హట్ ద్వారా ఇస్తోంది. ఉబర్ ఈట్స్.. ఉబర్ రైడ్లతోపాటు ఉబర్ ఈట్స్ ఆహార డెలివరీ యాప్ ప్రముఖంగా నిలుస్తోంది అన్ని రకాల పదార్థాలపై 30 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. సెలక్టెడ్ రెస్టారెంట్ల నుంచి 50 శాతం బిర్యానిపై డిస్కౌంట్‌ను అందిస్తోంది. సంబంధిత రెస్టారెంట్లపై30,40, 50 శాతం వరకు కూడా తగ్గింపును అందిస్తోంది. వీటికి ఎలాంటి ప్రోమో కోడ్ అవసరం లేదు. నేచురల్ ఐస్ క్రీం నుంచి కప్ ఐస్ క్రీమ్నుఒకటి కొంటే ఒకటి ఉచితంగా అందిస్తోంది. మిల్క్ షేక్‌లను కేవలం 99 రూపాయలకే అందిస్తోంది. HYDFEAST50, HYDFEAST30, HYDFEAST20 ద్వారా 50,30, 20 శాతం డస్కౌంట్ను ఇస్తుంది బేకరీల్లో బారులు.. న్యూయర్ దగ్గర పడుతుండటంతో బేకరీలలో కేకుల తయారీలు జోరందుకున్నాయి. కేకుల్లో వెజ్, నాన్ వెజ్, పేస్ట్రీస్ వంటివి.. విభిన్న రకాల ఆకృతిలో అందుబాటులో ఉన్నాయి.. ఒక్కో బేకరీలలో దాదాపు 500 నుంచి 1000 కేకుల వరకు తయారీ చేస్తున్నారు. నూతన సంవత్సర సందర్భంగా కేక్‌లు కొనుగోలు చేసేందుకు బేకరీ నిర్వాహకులు వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నారు. బేకరీలలో అయితే. కేజీ కేకు 400 రూపాయలు, అర కేజీ కేకు 200 రూపాయలకే అందిస్తున్నాయి. అంతేగాక వీటికి 500 ఎంఎల్ కూల్‌డ్రింక్, మిక్చర్ వంటివి ఉచితంగా అందజేస్తున్నాయి. వీటితోపాటు పిజ్జా, బర్గర్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బేకరీలు ఆఫర్లను జోరుగా అందిస్తున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం.. వెంటనే న్యూ ఇయర్ ఆఫర్లను ఆరగించండి.. - గుండా భావన (వెబ్ డెస్క్ ప్రత్యేకం) -
ఎన్నికల హోరు.. ‘బిర్యానీ’ జోరు
సాక్షి, రాజేంద్రగనర్: నియోజకవర్గ పరిధిలోని హోటళ్లలో తినేందుకు బిర్యానీ లభించడం లేదు. ఎన్నికల నేపథ్యంలో మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో బిర్యానీ కొరత నెలకొంటోంది. సాధారణ రోజుల్లో రాత్రి వరకు లభించే బిర్యానీ ప్రస్తుతం ఆర్డర్ ఇచ్చినా దొరకడంలేదు. హైదర్‌గూడ, అత్తాపూర్, ఆరాంఘర్ చౌరస్తా, దుర్గానగర్, శంషాబాద్, నార్సింగి తదితర ప్రాంతాల్లోని ప్రధాన హోటళ్లు బిర్యానీకి పెట్టింది పేరు. ఈ ప్రాంతాలలోని హోటళ్లలో బిర్యానీ తినేందుకు స్థానిక ప్రాంత వాసులతో పాటు ప్రయాణికులు, వాహనాదారులు ఆసక్తి చూపుతారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ హోటళ్లల్లో బిర్యానీ అమ్మకాలు జోరుగా సాగుతాయి. ప్రస్తుతం ఎన్నికల నేపధ్యంలో వివిధ పార్టీ అభ్యర్థులతో పాటు స్వాతంత్ర అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. తమ తమ అనుచరులకు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో బిర్యానీలను భోజనంగా అందజేస్తున్నారు. దీంతో బిర్యానీలకు కొరత ఏర్పడింది. ఇదేమని అడిగితే ఎన్నికల సీజన్ కదా.. అని యజమానులు అంటున్నారు. -
బిరియానితో హీరోయిన్లను వశీకరిస్తున్న హీరో
వివాహ భోజనంబు వింతైన వంటకంబు అనేది మంచి పాట. బిరియానితో విందు దీని తస్సదీయ భలే పసందు. కొందరి వశీకరణకిది మంచి మందు అన్నది మాట. కొందరిని మంచి చేసుకోవాలన్నా. కొన్ని పనులు జరగాలన్నా ముందుగా అవుతోంది బిరియాని విందు. సినిమా రంగానికొస్తే కోలీవుడ్‌లో నటుడు ఆర్య బిరియాని విందుతో అందమైన హీరోయిన్లను వశపరచుకుంటారన్న పేరుంది. ఇదేదో బాగున్నట్లుందని నటి ప్రియా ఆనంద్ ఆర్య ననుసరించాలనుకుంటున్నారట. బిరియాని విందుతో హీరోలను కాకాపట్టే పనిలో ఉన్నట్లు సమాచారం. ప్రియా ఆనంద్ ప్రస్తుతం కోలీవుడ్‌లోని బిజీ హీరోయిన్లలో ఒకరు. వైరాజావై, ఒరు ఊరుల రెండు రాజా తదితర చిత్రాల్లో నటిస్తున్న ప్రియా ఆనంద్‌కు ఇప్పటి వరకు వంట చేయడం రాదట. నేర్చుకుందామంటే టైమ్ చాలడం లేదట. దీంతో ఇటీవల పది రోజుల విరామం లభించడంతో వంటలతో కుస్తీ పట్టారట. దీంతో ఈ బ్యూటీ ఇప్పుడు నార్త్ ఇండియన్ వంటకాలతోపాటు చైనీస్ కుకింగ్లోను తర్ఫీదు పొందారట. తన వంటకాల చాతుర్యాన్ని త్వరలోనే పరిక్షించదలచారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఒరు ఊరుల రెండు రాజా చిత్ర యూనిట్ తన చేతి బిరియాని రుచిని చూపిస్తానని చెప్పారట. దీంతో ప్రియా ఆనంద్ బిరియాని విందు కోసం ఆ చిత్ర హీరో విమల్, హాస్యనటుడు సూరి, దర్శకుడు ఆర్.కన్నన్ తదితర యూనిట్ సభ్యులు ఎదురు చూస్తున్నారట. ఉండబట్టలేక బిరియాని విందు ఎప్పుడని ప్రియా ఆనంద్‌ను అడిగేశారట. దీనికా ముద్దుగుమ్మ చిత్ర షూటింగ్ ముగింపు రోజున బిరియాని విందునిస్తానని మాటిచ్చారట. ఇక ప్రియా ఆనంద్ నటించే ప్రతి చిత్ర షూటింగ్ చివరి రోజున ఆమె బిరియాని విందును రుచిచూడవచ్చన్న మాట. -
మధ్యాహ్నం మెనూలో బిర్యానీ
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరిగిపోయి ప్రభుత్వ నిధులతో విద్యార్థులకు కడుపు నింపడమే కష్టంగా మారిన పరిస్థితుల్లో ఆ పాఠశాల్లో విద్యార్థులకు నెలలో ఓ సారి మధ్యాహ్న భోజనంలో చికెన్ బిర్యాని అందుతోంది. అదెలాగో తెలుసుకుందాం.. స్థానిక చౌత్రాలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని ప్రభుత్వ ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలు రిహానా బేగం పాఠశాలలో విద్యార్థుల డ్రా పౌట్లను నివారించడంలో తన వంతు కృషి చేస్తోంది. ప్రభుత్వ మెనూ ప్రకారం వారంలో రెండ్రోజుల కోడిగుడ్డు, పప్పన్నం, కిచిడి సక్రమంగా వండి పెట్టడంతో పాటు నెలలో ఒకరోజు తన సొంత ఖర్యుతో విద్యార్థులకు చికెన్ బిర్యానీ వండి వడ్డిస్తోంది. సాధారణంగా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు తగ్గకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉండగా, ఇక్కడ మాత్రం మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ నిర్వాహకురాలు రిహానా బేగం ఆ బాధ్యతను తన భుజ స్కందాలపై వేసుకుని విద్యార్థులకు ఇష్టమైన ఆహారాన్ని ప్రేమతో వండి వడ్డిస్తోంది. చిన్నారులు సైతం క్రమం తప్పకుండా పాఠశాలకు వస్తున్నారు. హాజరు పట్టికలో నమోదైన 79 మంది విద్యార్థుల్లో ఏ ఒక్కరూ పాఠశాలకు గైర్హాజరుకాకపోవడం గమనార్హం. పాఠశాల ప్రధానోపాధ్యాయిని రాఫియా బస్రీ, ఇతర ఉపాధ్యాయులు ఆమెకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. పిల్లల కడుపు నింపాననే సంతృప్తి చాలు మాది మధ్యతరగతి కుటుంబం. మద్యాహ్న భోజన పథకం నిర్వహణపైనే ఆధార పడి జీవిస్తున్నాం. పాఠశాలలో విద్యార్థులు మధ్యలో చదువు మానివేయకూడదనే ఉద్దేశంతో ఆర్థికంగా భారమైనప్పటికీ ఇంట్లో పిల్లలకు వండి పెట్టినట్లుగానే ఇక్కడ చిన్నారులకు వారికి ఇష్టమైన పదార్ధాలను వండి వడ్డిస్తున్నాను. పిల్లల కడుపు నింపగలిగాననే సంతృప్తి చాలు. - రిహానా బేగం, ఏజెన్సీ నిర్వాహకురాలు