గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరిగిపోయి ప్రభుత్వ నిధులతో విద్యార్థులకు కడుపు నింపడమే కష్టంగా మారిన పరిస్థితుల్లో ఆ పాఠశాల్లో విద్యార్థులకు నెలలో ఓ సారి మధ్యాహ్న భోజనంలో చికెన్ బిర్యాని అందుతోంది. అదెలాగో తెలుసుకుందాం.. స్థానిక చౌత్రాలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని ప్రభుత్వ ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలు రిహానా బేగం పాఠశాలలో విద్యార్థుల డ్రా పౌట్లను నివారించడంలో తన వంతు కృషి చేస్తోంది. ప్రభుత్వ మెనూ ప్రకారం వారంలో రెండ్రోజుల కోడిగుడ్డు, పప్పన్నం, కిచిడి సక్రమంగా వండి పెట్టడంతో పాటు నెలలో ఒకరోజు తన సొంత ఖర్యుతో విద్యార్థులకు చికెన్ బిర్యానీ వండి వడ్డిస్తోంది.
సాధారణంగా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు తగ్గకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉండగా, ఇక్కడ మాత్రం మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ నిర్వాహకురాలు రిహానా బేగం ఆ బాధ్యతను తన భుజ స్కందాలపై వేసుకుని విద్యార్థులకు ఇష్టమైన ఆహారాన్ని ప్రేమతో వండి వడ్డిస్తోంది. చిన్నారులు సైతం క్రమం తప్పకుండా పాఠశాలకు వస్తున్నారు. హాజరు పట్టికలో నమోదైన 79 మంది విద్యార్థుల్లో ఏ ఒక్కరూ పాఠశాలకు గైర్హాజరుకాకపోవడం గమనార్హం. పాఠశాల ప్రధానోపాధ్యాయిని రాఫియా బస్రీ, ఇతర ఉపాధ్యాయులు ఆమెకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.
పిల్లల కడుపు నింపాననే సంతృప్తి చాలు
మాది మధ్యతరగతి కుటుంబం. మద్యాహ్న భోజన పథకం నిర్వహణపైనే ఆధార పడి జీవిస్తున్నాం. పాఠశాలలో విద్యార్థులు మధ్యలో చదువు మానివేయకూడదనే ఉద్దేశంతో ఆర్థికంగా భారమైనప్పటికీ ఇంట్లో పిల్లలకు వండి పెట్టినట్లుగానే ఇక్కడ చిన్నారులకు వారికి ఇష్టమైన పదార్ధాలను వండి వడ్డిస్తున్నాను. పిల్లల కడుపు నింపగలిగాననే సంతృప్తి చాలు.
- రిహానా బేగం, ఏజెన్సీ నిర్వాహకురాలు
మధ్యాహ్నం మెనూలో బిర్యానీ
Published Wed, Nov 20 2013 3:49 AM | Last Updated on Thu, Mar 28 2019 6:18 PM
Advertisement
Advertisement