ప్రేమ ఖైదీ@ మండీ | mandi biryani culture in hyderabad | Sakshi
Sakshi News home page

ప్రేమ ఖైదీ@ మండీ

Jul 11 2024 10:58 AM | Updated on Jul 11 2024 10:58 AM

mandi biryani culture in hyderabad

నగరంలో పెద్దఎత్తున రెస్టారెంట్లు

బంజారాహిల్స్‌: క్లోజ్‌ ఫ్రెండ్స్‌ ఎవరిని కదిలించినా వారు చెప్పేదొకటే.. మేం చిన్నప్పుడు ఒకే కంచంలో తిన్నాం..రా అని.. అలాంటి ఫ్రెండ్స్‌ అందరికీ ఒకే కంచంలో తినే అనుభూతిని కల్పించే మండీ ట్రెండ్‌ కొనసాగుతోంది. నలుగురైదుగురు ఫ్రెండ్స్‌ అంతా కలిసి ఓ భారీ కంచంలో నచి్చన ఫుడ్‌ తింటూ సరదా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. నగరంలో ఎప్పటి నుంచో మండీ రెస్టారెంట్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం వీటికి కొత్త తరహా థీమ్స్‌ జతచేస్తున్నారు.. దీంతో ఆహార ప్రియులు వాటిని వెతుక్కుంటూ వెళ్తున్నారు. సాధారణ రెస్టారెంట్లతో పోలిస్తే ఈ మండీలలో దొరికే ఫుడ్‌ కాస్త వెరైటీ.. మణికొండలో బాహుబలి ప్లేట్‌ పేరుతో ఒకేసారి 25 మంది కూర్చొని తినే కాన్సెప్ట్‌ ఆ మధ్య ఫేమస్‌ అయ్యింది. దీంతో మరికొన్ని థీమ్స్‌ నగరవాసులను ఆకర్షిస్తున్నాయి.. 

మండీ కల్చర్‌ వాస్తవానికి సౌదీ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే చాలా ఏళ్ల నుంచే నగరంలో ఈ తరహా రెస్టారెంట్లు కొనసాగుతున్నాయి. వీటిలో దొరికే ఫుడ్‌ బయటి రెస్టారెంట్లతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటుంది. సౌదీ దేశాల్లోని మండీ రెస్టారెంట్ల మాదిరే ఇక్కడ బిర్యానీలో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్‌ వాడతారు. తక్కువ స్పైసీతో వంటకాలు చేయడం మండీ రెస్టారెంట్ల ప్రత్యేకత. సహజ మసాల దినుసులు, కారం తక్కువగా వినియోగించి చికెన్, మటన్, ఫిష్‌ తదితర వంటకాలను విభిన్నంగా తయారు చేస్తారు. అయితే ఈ మధ్య కాలంలో తెలుగువారు పెత్త ఎత్తున మండీలకు వస్తుండటంతో  వారి అభిరుచికి అనుగుణంగా వంటకాలను వడ్డిస్తున్నారు.  

ప్రత్యేక థీమ్‌లతో..
సాధారణ మండీలకు వెళ్లి బోర్‌ కొట్టిన నగరవాసుల కోసం వ్యాపారులు ఈ మధ్య జైల్, గర్ల్‌ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మండీ పేరుతో ఏర్పాటైన కొత్త థీమ్‌లు క్రేజ్‌ సొంత చేసుకుంటున్నారు. ముఖ్యంగా జైలు వాతావరణాన్ని తలపించేలా రూపొందించిన జైలు మండీలో రిమాండ్‌లో ఉన్న ఖైదీల మాదిరిగా లోపల కూర్చొని తింటూ నగరవాసులు సెలీ్ఫలు దిగుతూ మురిసిపోతున్నారు. ఈ జైలు మండీలో ఫుడ్‌ను తీసుకొచ్చే వారంతా ఖైదీల దుస్తులతో..ఉంటారు. ఇక కౌంటర్‌లో ఉండే వ్యక్తి జైలర్‌గా, ఫుడ్‌లో ఏదైనా సమస్య వస్తే తీర్చేందుకు ఓ వ్యక్తి లాయర్‌ గెటప్‌లో దర్శనమిస్తారు. ఇక గర్ల్‌ ఫ్రెండ్‌ మండీలో కుటుంబ సభ్యులు, ప్రేమికులు కూర్చొని తినే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నగరంలో సుమారు 150కి పైగా మండీ రెస్టారెంట్లు నడుస్తున్నాయి.

ఫ్యామిలీలు ఎక్కువగా వస్తున్నారు
జైలు మండీలో భోజనం చేసేందుకు ఎక్కువగా ఫ్యామిలీలు వస్తున్నాయి. జైలు థీమ్‌లో ఫొటోలు దిగుతూ సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. జైలులో ఎలాంటి వాతావరణం ఉంటుందో అదే తరహాలో ఉంటుంది. జైలు బ్యారెక్‌లో రుచికరమైన భోజనం చేసి వెళ్తున్నామనే తృప్తి వారికి కలిగిస్తున్నాం. 
– ప్రవీణ్, జైలు మండీ మేనేజర్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement