సాక్షి, విశాఖపట్నం: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్‌రాజు.. పొంతన లేని వ్యాఖ్యలతో ఇటు సొంత పారీ్టలోనూ, అటు ఇతర పారీ్టల్లోనూ తరచూ నానుతూ ఉంటారు. ఎప్పుడు ఎవరిని పొగడుతారో? ఎప్పుడు ఎవరిని విమర్శిస్తారో? ఆయనకే తెలియదన్న పేరు గడించారు. వివాదాస్పద ప్రకటనలతో పార్టీలోనూ గందరగోళం సృష్టిస్తుంటారు. ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అంతేకాదు సాక్షాత్తూ సొంత పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు. ఆ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ చేసిన పొరపాట్లు సరి చేసుకుంటుందని భావిస్తున్నాను అనడం, ఏపీలో జరిగే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేమని ప్రధాని మోదీ చెప్పినట్లు పేర్కొనడం వంటివి అధిష్టానం సీరియస్ అవడానికి కారణమయ్యాయి. దీంతో ఆయనకు రాష్ట్ర పార్టీ నుంచి షోకాజ్ నోటీసు జారీ అయింది. ఎందుకు మీపై చర్యలు తీసుకోరాదో చెప్పాలంటూ ఆ నోటీసులో పేర్కొంది. ఇది పారీ్టలో తీవ్ర కలకలాన్ని రేపింది.
ఆ కుతూహలం వల్లే..? : ఇప్పటికే విష్ణుకుమార్‌రాజు టీడీపీకి అనుకూలంగా ఉన్నారన్న ప్రచారం చాన్నాళ్లుగా ఉంది. టీడీపీకి చేరువ కావడం ద్వారా ఆ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలన్న కుతూహలం ఆయనకు ఎప్పట్నుంచో ఉందని బీజేపీలోనే పలువురు చర్చించుకుంటున్నారు. అదే ఉద్దేశంతో బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేయాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయడం కూడా పార్టీ అధిష్టానం దృష్టిలో ఉందని చెబుతున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ వ్యతిరేకమన్న విషయం తెలిసి కూడా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుని వంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న విష్ణుకుమార్‌రాజు అలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా అధిష్టానానికి రుచించలేదని అంటున్నారు.
షోకాజ్ నోటీసు జారీ : ఒకపక్క పార్టీ వైఖరికి భిన్నంగా మాట్లాడుతుండడం, టీడీపీ అధినేత చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తడం, మరోపక్క తాజాగా టీవీ ఇంటర్వ్యూలో పార్టీని ఇరకాటంలో పెట్టేలా వ్యాఖ్యలు చేయడం వెరసి అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తనకు జారీ చేసిన షోకాజ్ నోటీస్‌పై విష్ణుకుమార్‌రాజు సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. టీవీ ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యలు ఇప్పటి పరిస్థితులకనుగుణంగా చేసినవి కావని, 2019 ఎన్నికలకు ముందు మోదీ చేసినవని అందులో పేర్కొన్నట్టు సమాచారం. దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుందోనని ఇతర పార్టీల నాయకులకంటే సొంత బీజేపీ నాయకులే ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు.
పార్టీ నేతల్లోనూ అసంతృప్తే..
విష్ణుకుమార్‌రాజు వైఖరిపై బీజేపీలోని కొంతమంది ముఖ్య నాయకులు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి వారంతా ఇప్పుడు ఆయనకు షోకాజ్ నోటీస్ ఇవ్వడంపై లోలోన సంతోస్తున్నారు. గతంలో పార్టీని బ్లాక్‌మెయిల్ చేసే ధోరణిలో తనకు టీడీపీ, మరికొన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయని, ఏ పార్టీలోకి వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నానంటూ ప్రకటనలు చేశారని గుర్తు చేస్తున్నారు. పార్టీలో కీలక పదవిలో ఉంటూ ఇలా తరచూ బహిరంగంగానే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విష్ణుకుమార్‌రాజుపై తాజా టీవీ ఛానల్ ఇంటర్వ్యూ వ్యాఖ్యల నేపథ్యంలోనైనా చర్యలు తీసుకోవాలని వీరు కోరుతున్నారు. విష్ణుకుమార్‌రాజుపై చర్యలుంటాయా? షోకాజ్‌తోనే సరిపెడతారా? అన్నది వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment