సాక్షి, అమరావతి : దేవుడి భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేలా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం బుధవారం పకడ్బందీ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ఆక్రమణలపై కోర్టు ప్రక్రియ ద్వారా కాలయాపన లేకుండా ఆక్రమణదారునికి కేవలం ఒక నోటీసు ఇచ్చి వారం తర్వాత ఆ భూమిని స్వాధీనం చేసుకునే అధికారాన్ని దేవదాయ శాఖ అధికారులకు కల్పించింది.
ఈ మేరకు 1987, 2007 దేవదాయ శాఖ చట్టాల్లోని 83, 84, 85, 86, 93, 94 సెక్షన్లలో పలు మార్పులు చేస్తూ, కొన్నింటిని తొలగిస్తూ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్‌ను రూపొందించింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదంతో న్యాయ శాఖ ఈ ఆర్డినెన్స్‌ను విడుదల చేసింది. తక్షణమే ఆర్డినె¯Œ్స అమలులోకి వస్తుందని అందులో పేర్కొన్నారు.
ఇప్పటివరకు జరుగుతున్నదిదీ..
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం దేవుడి భూములను ఎవరైనా ఆక్రమిస్తే దేవదాయ శాఖ అధికారులు ముందు ఎండోమెంట్ ట్రిబ్యునల్‌లో పిటీషన్ వేయాల్సి వచ్చేది. ట్రిబ్యునల్‌లో ఆక్రమణదారులు లాయర్ల ద్వారా వారి వాదనలు వినిపించుకోవచ్చు. ట్రిబ్యునల్ ఆ భూములు దేవదాయ శాఖవని తేల్చే వరకు వాటిని అనుభవించే వెసులుబాట ఆక్రమణదారులకే ఉంటుంది.
ఒకవేళ ట్రిబ్యునల్ దేవదాయ శాఖకు అనుకూలంగా తీర్పు ఇస్తే, దానిపై కింద నుంచి పై కోర్టుల వరకు వెళ్లి, కాలయాపన చేసే వెసులుబాటు ఆక్రమణదారులకే ఉంది. దీంతో భూముల వివాదం ఏళ్ల తరబడి ఎండోమెంట్ ట్రిబున్యల్, కోర్టులలో కొనసాగుతోంది. అత్యధిక కేసుల్లో పదేళ్లకు పైనే సాగుతోందని, అంత కాలం ఆ భూములు ఆక్రమణదారులే అనుభవిస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఫలితంగా వేలాది ఎకరాల దేవుడి భూములు ఆక్రమణదారుల చేతిలోనే ఉన్నాయి.
ఇప్పుడు జరగబోయేది ఇదీ..
తాజా ఆర్డినెన్స్ ప్రకారం.. ఆక్రమణదారు నుంచి భూముల స్వాధీనం చేసుకోవడానికి దేవదాయ శాఖ అధికారులు ఆ భూమి దేవుడిదని పేర్కొంటూ ఒక నోటీసు ఇస్తారు. ఆక్రమణదారు జవాబు చెప్పుకోవడానికి ఓ వారం వ్యవధి ఇస్తారు. వారం దాటిన వెంటనే పోలీసు, రెవిన్యూ అధికారుల çసహాయంతో ఆ భూములను స్వాధీనం చేసుకోవచ్చు. ఈమేరకు తాజా ఆర్డినెన్స్ ద్వారా దేవదాయ శాఖ అధికారులకు అన్ని అధికారాలు దఖలు పడతాయి.
న్యాయపరమైన చిక్కులు, ఆలస్యం లేకుండా దేవుడి భూములు దేవదాయ శాఖ చేతుల్లోకి వస్తాయి. ఈ స్వాధీన ప్రక్రియపై అభ్యంతరాలు ఉంటే ఆక్రమణదారుడే కోర్టులకు వెళ్లి, అవి తమ భూములని నిరూపించుకోవాల్సి ఉంటుందని దేవదాయశాఖ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment