
గవర్నర్‌తో ‘గత ప్రభుత్వ విధ్వంసం’ వంటి వ్యాఖ్యలు చెప్పించడం దారుణం
ప్రతిపక్ష గుర్తింపుపై పవన్ కళ్యాణ్ అవగాహన లేని మాటలు
హాజరు కోసం సభకు రాలేదు.. స్పీకర్ అడిగితే ఇదే చెబుతాం
గ్రూప్2 అభ్యర్థుల అభ్యంతరాలను పట్టించుకోలేదు
సీఎంవో లేఖకే విలువ లేకపోవడం సీఎంకే అవమానం
వైఎస్సార్‌సీపీ నేత, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ
సాక్షి, అమరావతి: గవర్నర్ ప్రసంగంలో దశ, దిశ లేదని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. మంగళవారం శాసన మండలి సమావేశాల నుంచి వాకౌట్ చేసిన తరువాత వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలతో కలిసి ఆయన అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌తో రాజకీయ విమర్శలు, గత ప్రభుత్వ విధ్వంసం వంటి అసంబద్ధ వ్యాఖ్యలు చేయించడం దారుణమని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల గురించి కాకుండా 2047 నాటికి అమలు చేయబోయే సూపర్ టెన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు.
అంటే ఇప్పుడు చెప్పిన సూపర్ సిక్స్‌కు నీళ్లొదిలినట్లేనని వారు చెబుతున్నారా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదాపై డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడారని ధ్వజమెత్తారు. శాసన సభలోని రాజకీయ పార్టీల్లో మూడు పక్షాలు అధికార పక్షంగా ఉన్నాయని, మిగిలింది వైఎస్సార్సీపీనే కాబట్టి ప్రతిపక్షంగా గుర్తించాలని కోరామని తెలిపారు.
గవర్నర్ ప్రసంగం రోజున సభకు హాజరైనా లెక్కకు రాదన్న వాదనలను తాము పట్టించుకోవడం లేదని తెలిపారు. తాము హాజరు కోసం సభకు రాలేదని, తమకున్న హక్కును గవర్నర్ ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావాలనే అసెంబ్లీకి వచ్చామని చెప్పారు. స్పీకర్ పిలిచి అడిగినా ఇదే చెబుతామన్నారు. తమది రాజకీయ పార్టీ అని, అన్ని అంశాలపైనా సందర్భం, సమయాన్ని బట్టి తయారుగా ఉంటామన్నారు.
వీసీల మూకుమ్మడి రాజీనామాలపై విచారణ జరగాలి
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో యూనివర్సిటీ వైస్ చాన్సలర్లు (వీసీలు) అందరితో మూకుమ్మడిగా చేయించిన రాజీనామాలపై విచారణ జరగాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. వీసీలను అధికార బలంతో బెదిరించి రాజీనామాలు చేయించి, వారికి నచ్చిన వారితో భర్తీ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై సభలోనే విద్యా శాఖ మంత్రి లోకేశ్ వ్యాఖ్యలకు సమాధానం చెప్పామన్నారు.
తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించామని అన్నారు. గ్రూప్ 2 అభ్యర్థుల అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోలేదని బొత్స మండిపడ్డారు. వారి ఆందోళనలను పరిశీలిస్తామని, న్యాయం చేస్తామని విద్యా శాఖ మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా చెప్పినా, న్యాయం జరగలేదన్నారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని సీఎం కార్యాలయం నుంచి లేఖ పంపినా ఏపీపీఎస్సీ ఖాతరు చేయలేదని వారే చెప్పారని అన్నారు.
సీఎం కార్యాలయం లేఖకే విలువ లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబుకు అవమానం కాదా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తోట త్రిమూర్తులు, కపిలవాయి సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment