యాదమరి (చిత్తూరు జిల్లా): కాణిపాక శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో మంగళవారం ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలు, 12 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలకు అర్చకులు శేఖర్ గురుకుల్, వేదపండితులు సుబ్బారావు పూజలు చేశారు. ఉదయం ఆలయ ప్రాంగణంలోని అన్వేటి మండపంలో స్వర్ణ ధ్వజస్తంభం వద్ద మూషికపటాన్ని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించడం కోసం ధ్వజస్తంభానికి క్షీర, చందన, ఇతర ద్రవాలతో అభిషేకం చేశారు.
ఈ ఉత్సవాలకు ఉభయదారులుగా కాణిపాకం, అగరంపల్లె, కారకాంపల్లె, వడ్రాంపల్లె, తిరువణంపల్లె గ్రామాలకు చెందిన శీర్‌కరుణీక వంశస్తులు వ్యవహరించారు. సిద్ధి, బుద్ధి, వినాయక స్వామి ఉత్సవమూర్తులను ఆలయ అన్వేటి మండపంలో పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించి పుర వీధులలో ఊరేగించారు. రాత్రి ఆలయాధికారులు ఉభయదారులు మేళతాళాలతో ఊరేగింపుగా స్వామివారిని తీసుకువచ్చి పుష్పాలతో అలంకరించిన హంస వాహనంపై ఆశీనులు చేయగా... స్వామివారు దానిపై విహరించారు.
పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి వినాయకుడికి సోమవారం ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు వ్రస్తాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో చవితిరోజు రాష్ట్ర ప్రభుత్వం స్వామివారికి పట్టు వ్రస్తాలు సమర్పించడం ఆనవాయితి. ఈ ఏడాది మంత్రి పెద్దిరెడ్డితో పాటు ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, ఎమ్మెల్యే వెంకటేగౌడ్ ఊరేగింపుగా పట్టువ్రస్తాలను తీసుకువెళ్లారు. వీరికి ఆలయ చైర్మన్, ఈవో స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు. ఆశీర్వాద మండపంలో వేదపండితులచే ఆశీర్వాదాలు చేయించి, ప్రసాదం, చిత్రపటం అందించారు. మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment