తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇలా వచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. ప్రధానంగా ఈ నెల 19న గరుడ వాహనం, 20న పుష్పకవిమానం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం జరుగనున్నాయి. ఉదయం వాహనసేవ 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడ వాహనసేవ రాత్రి 7 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది.
ఈ బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు ఇలా ఉన్నాయి.
- ఈ నెల 14న అంకురార్పణం,
- 15న ఉదయం బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి పెద్దశేష వాహనం,
- 16న ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం,
- 17న ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం,
- 18న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం,
- 19న ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహనం,
- 20న ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం పుష్పకవిమానం, రాత్రి గజ వాహనం,
- 21న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం,
- 22న ఉదయం స్వర్ణ రథం, రాత్రి అశ్వవాహనం సేవ నిర్వహిస్తారు.
- 23న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన 9వ రోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది.
కొనసాగుతున్న భక్తుల రద్దీ
శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 79,365 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.77 కోట్లుగా తేలింది. తలనీలాలు సమర్పించిన భక్తులు 25,952 మంది.
Comments
Please login to add a commentAdd a comment