కాకినాడ జిల్లాలో పరవశింపజేసే ప్రకృతి అందాలు.. ఆహ్లాదాన్ని పంచుతున్న ఆంధ్ర శబరిమలై
కోల్‌కతా - చెన్నై హైవే సమీపంలో పర్యాటకుల స్వర్గధామం
కట్టిపడేసే వేళంగి మల్లికార్జున లొద్దు జలపాతం
కొండా కోనల మధ్య ప్రకృతి అందిస్తున్న సోయగాల వనం ఆ గ్రామం. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న ఆ గిరిజన గ్రామం చుట్టూ ప్రతి అంగుళం పరవశింపజేస్తుంది. పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ఎత్తయిన కొండలు, పాములా మెలికలు తిరిగే ఘాట్ రోడ్లు, చుట్టూ పచ్చటి పచ్చిక బయళ్లు, ఎత్తయిన రెండు కొండల మధ్య పాలసముద్రం పొంగుకొస్తోందా అనేట్టు జాలువారే జలపాతాలు.. ఎటు చూసినా ప్రకృతి ప్రేమికులను కట్టిపడేసే అందాలే.
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆంధ్రా ఊటీగా పాచుర్యం పొందిన ఈ ప్రాంతం కాకినాడ జిల్లా శంఖవరం మండలం పెదమల్లాపురం గ్రామం. దీనికి సమీపంలోని సిద్ధివారిపాలెం గ్రామం పర్యాటకులకు మరింత ప్రత్యేకమైనది. ఈ గ్రామంలోని కొండల నడుమ శబరిమలై తరహాలో అయ్యప్ప ఆలయాన్ని నిర్మించారు. 2009లో అప్పటి రోడ్లు, భవనాల శాఖ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు శంకుస్థాపన చేసిన ఈ ఆలయం 2011లో ప్రారంభమైంది.
తొలుత ఆథ్యాత్మిక కేంద్రంగా విలసిల్లి కాలక్రమంలో పర్యాటకులను కూడా ఆకర్షిస్తోంది. ఇక్కడికి వెళ్లే దారిలో ఎత్తయిన కొండలు, మెలికలు తిరిగే ఘాట్ రోడ్లు, పచ్చటి చెట్లు కనువిందు చేస్తాయి. కొత్త అచ్చింపేట ృ గౌరంపేట మధ్యలో అమ్మాయి గొప్పు ఘాట్ పర్యాటకులను కట్టిపడేస్తోంది. కొత్త అచ్చింపేట తర్వాత నిటారుగా పచ్చదనంతో నిండిన నిమ్మలగాడి కొండ, ములుకొండ, దారలలొద్దు కొండలు పర్యాటకులకు స్వర్గధామమే.
చూపు తిప్పుకోలేనంతగా ఇక్కడి అందాలు పర్యాటకులన కట్టిపడేస్తాయి. అక్కడి నుంచి ముందుకు వెళితే కొండల మధ్య పాల నురగా జారుతున్నట్లుగా వేళంగి మల్లికార్జున లొద్దు జలపాతం కనువిందు చేస్తుంది. మహాశివరాత్రి నాడు పెద్ద సంఖ్యలో తరలివచ్చే పర్యాటకులు, భక్తులతో ఈ గిరిజన ప్రాంతం పరవశించిపోతోంది.
ఇలా వెళ్దాం రండి..
చెన్నై- కోల్‌కతా 16వ నంబర్ జాతీయ రహదారికి 20 కిలోమీటర్ల దూరంలో కొండల మధ్య గిరిజన గ్రామం సిద్ధివారిపాలెం ఉంటుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరానికి 28 కిలోమీటర్ల దూరం. విశాఖపట్నం ృ విజయవాడ మధ్య హైవేపై కత్తిపూడి జంక్షన్ నుంచి కుడి వైపు తిరిగితే శంఖవరం మండలం. 3 కిలోమీటర్లు వెళితే నెల్లిపూడి, అక్కడి నుంచి 6 కిలోమీటర్లు వెళ్తే శంఖవరం వస్తాయి.
శంఖవరం నుంచి గొంది కొత్తపల్లి, గౌరంపేట మీదుగా 9 కిలోమీటర్ల దూరంలో అమ్మాయిగొప్పు ఘాటీ వస్తుంది. 200 మీటర్ల ఎత్తులో ఉండే అమ్మాయిగొప్పు కొండను చూస్తే పర్యాటకులు ఆ కొండ మీద పడిపోతుందేమోననే అనుభూతి చెందుతారు. దీనికి సమీపంలోనే నిమ్మలగాడి కొండ. అక్కడి నుంచి కుడివైపు వెళితే సిద్ధివారిపాలెం అయ్యప్పస్వామి ఆలయం దర్శనమిస్తుంది.
నిమ్మలగాడి కొండ నుంచి సిద్ధివారిపాలెం వరకూ 2 కిలోమీటర్లు పుంత రోడ్డు. కార్లు, ద్విచక్ర వాహనాలు వెళ్లొచ్చు. అక్కడి నుంచి 5 కిలోమీటర్లు వెళితే పెదమల్లాపురం వస్తుంది. ఇక్కడికి 2.2 కిలోమీటర్ల దూరంలో కొండల మధ్య వేళంగి మల్లికార్జున ధార జలపాతం కనిపిస్తుంది.
అభివృద్ధి చేయాలి
పెదమల్లాపురానికి నిత్యం వందల మంది పర్యాటకులు వస్తుంటారు. ఈ ప్రాంతానికి వచ్చే భక్తులు, పర్యాటకులకు సిద్ధివారిపాలెంలోని ఆంధ్రా శబరిమలై దేవస్థానంతో పాటు పరిసర ప్రాతాల్లోని జలపాతం వంటి ప్రాంతాల్లో సౌకర్యాలు మెరుగుపరచాలి. మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి. అప్పుడు పర్యాటకులు మరింతగా పెరుగుతారు. - పాము రాములమ్మ, సిద్ధివారిపాలెం, శంఖవరం మండలం
రోడ్లు విస్తరించాలి
నిత్య వందలాదిగా వస్తున్న పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని ఇక్కడి రోడ్లు వెడల్పు చేయాలి. ఈ ప్రాంతంలో ప్రకృతిని ఆస్వాదించే సుందర ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఎత్తయిన కొండలు, చూడచక్కని జలపాతం, పచ్చని చెట్లు, చూసేకొద్దీ చూడాలనిపించే అందాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ప్రభుత్వం దృష్టి పెడితే ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుంది. -చొప్పా శ్రీను, జి.కొత్తపల్లి
Comments
Please login to add a commentAdd a comment