ముందుకెళ్లి ఆగిన రైలు ఇంజిన్
వెల్దుర్తి: కర్ణాటకలోని మంగుళూరు సెంట్రల్ నుంచి తెలంగాణలోని కాచిగూడకు ప్రయాణిస్తున్న (ట్రైన్ నంబర్ 02778–కాచిగూడ స్పెషల్) ఎక్స్‌ప్రెస్ రైలుకి ఇంజిన్, బోగీల మధ్య లింక్ తెగిపోయింది. దీంతో రైలు కర్నూలు జిల్లా వెల్దుర్తి రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఆగిపోయింది. గార్డు, లోకో పైలెట్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. ఈ నెల1న శనివారం రాత్రి 8 గంటలకు మంగుళూరు నుంచి కాచిగూడకు రైలు బయలుదేరింది. తమిళనాడు, ఏపీల మీదుగా ప్రయాణిస్తూ 2 వ తేదీన సాయంత్రం 6 గంటలకు వెల్దుర్తి రైల్వేస్టేషన్‌ను దాటింది.
దాటిన క్షణమే ఇంజిన్‌కు, వెనుక ఉండే 19 బోగీల లింక్ తెగిపోయింది. దీన్ని వెనుక బోగీలోని గార్డు గుర్తించి అప్రమత్తమై లోకో పైలెట్‌కు సమాచారమివ్వగా అతడు బోగీలకు ఉండే సేఫ్టీ బ్రేక్ వేశాడు. దీంతో బోగీలు ఆగిపోయాయి. అదే సమయంలో అర కిలోమీటరు ముందుకు వెళ్లిన ఇంజిన్‌ను లోకో పైలెట్ ఆపేశాడు. వెంటనే పైలెట్, గార్డు, సిబ్బంది ఇంజిన్‌ను వెనుకకు తెచ్చి బోగీలకు లింక్ చేశారు.
ఇదేమీ తెలియని 17 బోగీలలోని 1,500కు మించి ప్రయాణికులు ఆందోళన చెందారు. చివరకు ప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. గంట పాటు ఆలస్యమైన రైలు పూర్తి లింక్ మరమ్మతుల అనంతరం సాయంత్రం 7.05 గంటలకు బయలుదేరింది.కాగా, ఘటనా ప్రాంతంలో పెద్ద మలుపు, దాటగానే వంతెన ఉంది. రైలు వేగంగా వెళ్లి ఉంటే బోగీలు పల్టీకొట్టి పెద్ద ప్రమాదం జరిగి ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment