veldurthy
-
ఇంటర్ సప్లిమెంటరీ.. మహేశ్ ఒక్కడు పరీక్ష రాస్తే.. 8 మంది పర్యవేక్షణ
వెల్దుర్తి (తూప్రాన్): ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రానికి ఒక్క విద్యార్థి హాజరైతే ఎనిమిది మంది సిబ్బంది పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రభుత్వ శ్రీ రాయరావు సరస్వతీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించారు. ద్వితీయ సంవత్సరం సివిక్స్ పరీక్షకు వర్షపల్లి మహేశ్ అనే ఒక్క విద్యార్థి హాజరయ్యాడు. మొత్తం ముగ్గురు విద్యార్థులు ఫెయిల్ కాగా.. ఒక్క విద్యార్థి ఫీజు చెల్లించి పరీక్ష రాశాడు. పర్యవేక్షణకు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఎగ్జామినేషన్ ఇన్చార్జి, ఇన్విజిలేటర్, సహాయ ఇన్విజిలేటర్, జూనియర్ అసిస్టెంట్, ఏఎన్‌ఎంతోపాటు కాపలాగా ఒక కానిస్టేబుల్ విధులు నిర్వర్తించారు. పరీక్ష ముగిసిన అనంతరం పరీక్ష పత్రాలను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
రైలు ఇంజిన్, బోగీల మధ్య తెగిన లింక్
వెల్దుర్తి: కర్ణాటకలోని మంగుళూరు సెంట్రల్ నుంచి తెలంగాణలోని కాచిగూడకు ప్రయాణిస్తున్న (ట్రైన్ నంబర్ 02778–కాచిగూడ స్పెషల్) ఎక్స్‌ప్రెస్ రైలుకి ఇంజిన్, బోగీల మధ్య లింక్ తెగిపోయింది. దీంతో రైలు కర్నూలు జిల్లా వెల్దుర్తి రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఆగిపోయింది. గార్డు, లోకో పైలెట్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. ఈ నెల1న శనివారం రాత్రి 8 గంటలకు మంగుళూరు నుంచి కాచిగూడకు రైలు బయలుదేరింది. తమిళనాడు, ఏపీల మీదుగా ప్రయాణిస్తూ 2 వ తేదీన సాయంత్రం 6 గంటలకు వెల్దుర్తి రైల్వేస్టేషన్‌ను దాటింది. దాటిన క్షణమే ఇంజిన్‌కు, వెనుక ఉండే 19 బోగీల లింక్ తెగిపోయింది. దీన్ని వెనుక బోగీలోని గార్డు గుర్తించి అప్రమత్తమై లోకో పైలెట్‌కు సమాచారమివ్వగా అతడు బోగీలకు ఉండే సేఫ్టీ బ్రేక్ వేశాడు. దీంతో బోగీలు ఆగిపోయాయి. అదే సమయంలో అర కిలోమీటరు ముందుకు వెళ్లిన ఇంజిన్‌ను లోకో పైలెట్ ఆపేశాడు. వెంటనే పైలెట్, గార్డు, సిబ్బంది ఇంజిన్‌ను వెనుకకు తెచ్చి బోగీలకు లింక్ చేశారు. ఇదేమీ తెలియని 17 బోగీలలోని 1,500కు మించి ప్రయాణికులు ఆందోళన చెందారు. చివరకు ప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. గంట పాటు ఆలస్యమైన రైలు పూర్తి లింక్ మరమ్మతుల అనంతరం సాయంత్రం 7.05 గంటలకు బయలుదేరింది.కాగా, ఘటనా ప్రాంతంలో పెద్ద మలుపు, దాటగానే వంతెన ఉంది. రైలు వేగంగా వెళ్లి ఉంటే బోగీలు పల్టీకొట్టి పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. -
పంటనష్టంపై స్పందించని అధికారులు
వెల్దుర్తి: కుండపోత వర్షాలు, వరదల బీభత్సంతో చేతికి వచ్చిన పంటలు నాశనమైనా అధికారులు స్పందించడం లేదని వెల్దుర్తికి చెందిన రైతులు చెంద్రయ్య, రాజు, మల్లయ్య ఆరోపించారు. బుధవారం వారు మొలకెత్తిన మొక్కజొన్న కంకులను చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. దెబ్బతిన్న పంటల వివరాలను సేకరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. నాలుగు రోజులుగా రెవెన్యూ, వ్యవసాయ అధికారులకు ఫోన్లు చేస్తున్నా స్పందించడం లేదని ఆరోపించారు. కార్యాలయాల చుట్టూ తిరిగినా కనిపించడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంట నష్టాలపై సర్వే చేయాలని కోరారు. -
పొంగుతున్న వాగులు
వెల్దుర్తి: మూడురోజులుగా కురిసిన భారీ వర్షాలకు మండలవ్యాప్తంగా వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు, చెరువు, కుంటలు, అలుగులు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు రోడ్లకు అడ్డంగా ఉన్న కల్వర్టుల ద్వారా భారీగా తరలి వెళ్లడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పాత ఇళ్లు కూలుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 9 సెం.మీ వర్షపాతం నమోదైందని, మండలంలో 220 ఇళ్లు పాక్షికంగా, శెట్టిపల్లి, బండపోసాన్‌పల్లి ఒక్కో ఇల్లు పూర్తిస్థాయిలో కూలిపోయినట్లు డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ తెలిపారు. వరద తాకిడికి మండలంలో రెండు హెక్టార్లలో కంది, 20 హెక్టార్లలో వరి, 10 హెక్టార్లలో మొక్కజొన్న పంటలు నీట మునిగాయని వ్యవసాయ శాఖ అధికారులు రాజనారాయణ, హజార్ తెలిపారు. దేవతల చెరువు అలుగు పొంగిపొర్లడంతో ఎల్కపల్లి వద్ద గల కుమ్మరి వాగు వరద ఉధృతికి రోడ్డుపై భారీ ఎత్తున నీరు పారడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వెల్దుర్తి నుంచి దామరంచకు పోయే రహదారికి కుకునూరు వద్ద వంతెన పైనుంచి అరగజం ఎత్తులో నీరు పొంగిపొర్లడంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. హకీంపేట హల్దీవాగుపై గల ప్రాజెక్టు ద్వారా వరద నీరు పొంగిపొర్లుతోంది. -
చెరువులు నిండె .. అలుగులు పారె!
వెల్దుర్తి: ఎణ్ణాళ్ల కెన్నేళ్లకో తీపి కబురు వినిపిస్తోంది పల్లెల్లో.. వర్షాల కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూసిన జనానికి పట్టలేనంత ఆనందాన్ని మిగిల్చాడు వరుణుడు.. వరుసగా మూడేళ్ల నుంచి తీవ్ర వర్షాభావంతో చెరువు, కుంటలు ఎండిపోయి.. వర్షాలు లేక.. పంటలు సాగు చేయలేక నీటి గోసతో ఇటు ప్రజలు, అటు పశు పక్ష్యాదులు అల్లాడుతున్న తరుణంలో వరుణుడు కరుణించాడు.. వర్షాకాలం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా ఆశించిన వర్షాలు లేక ఆందోళన చెందుతున్న తరుణంలో నాలుగు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండుకుంటున్నాయి. అలుగులు పారుతున్నాయి. హల్దీవాగుపై ఉన్న చెక్‌డ్యాంలలోకి ఇప్పుడిప్పుడే భారీగా వరద నీరు చేరుతోంది. కుంటలు నిండి, అటవీ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు చెరువులలోకి పారుతున్నాయి. సోమవారం నుండి గురువారం వరకు వరుసగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం 28.4 మి.మీలు, మంగళవారం 150.8 మి.మీలు , బుధవారం 11.8 మి,మీలు వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. దీంతో మండలంలోని చెర్లపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న నర్సిన్ చెరువులోకి భారీగా వరద నీరు చేరడంతో చెరువు నిండిపోయి అలుగు పారుతోంది. అలుగు ద్వారా భారీగా నీరు వెల్దుర్తి శివారులో ఉన్న దేవతల చెరువులోకి పారుతోంది. ప్రస్తుతం దేవతల చెరువు 30 ఫీట్ల లోతు ఉండగా గురువారం నాటికి 19 ఫీట్ల నీరు చేరింది. ఇంకా నర్సిన్ చెరువు అలుగు నుండే కాకుండా అల్లీపూర్ అటవీ ప్రాంతం నుండి భారీగా వరద నీరు చేరుతోంది. ఇదిలా ఉండగా ఎల్కపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న ఖాన్ చెరువులోకి భారీగా నీరు చేరి నిండిపోయింది. మరి కొన్ని గంటలు గడిస్తే అలుగు పారే అవకాశం ఉంది. ఈ చెరువులోకి అల్లీపూర్, యశ్వంతరావుపేట అటవీ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు చేరుతోంది. చెరువులు నిండి అలుగులు పారడంతో ఆయా గ్రామాల ప్రజలు, ఆయకట్టు పొలాల రైతులు సంబరపడిపోతున్నారు. నర్సిన్ చెరువుకు పొంచి ఉన్న ప్రమాదం చెర్లపల్లి అటవీ ప్రాంతంలో ఉన్నచెరువుకు ప్రమాదం పొంచి ఉంది. గత ఏడాది మిషన్ కాకతీయ మొదటి ఫేజ్‌లో చెరువును పునరుద్ధరించారు. అధికారుల పర్యవేక్షణ లేక కాంట్రాక్టరు నాసిరకంగా పనులు చేసి చేతులు దులుపుకున్నాడు. తూము దిగువ భాగంలో ఉన్న కట్టకు రాతి తెట్టెను ఏర్పాటు చేయకపోవడంతో కట్ట కుంగిపోయింది. ఈ చెరువు పూర్తిగా నీటితో నిండడంతో ప్రమాదం సంభవించే అవకాశం ఉందని, బుంగ పడితే నీరు వృథాగా పోయే అవకాశం ఉందని రైతులు తెలిపారు. ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చినా నేటికీ వచ్చి పరిశీలించలేదని అధికారులపై రైతులు మండిపడుతున్నారు. -
‘సరస్వతమ్మ’ను పట్టించుకోరా?
వెల్దుర్తి: స్థానిక ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సరస్వతమ్మ విగ్రహం కళ తప్పుతోంది. ఈ కళాశాల నిర్మాణానికి 2006లో స్థానికంగా ఉన్న డాక్టర్ రాయరావు వెంకటేశ్వరరావు ఐదు ఎకరాల స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు. నాటి నుంచి నేటివ రకు ప్రభుత్వాలు దశల వారీగా కళాశాల నిర్మాణానికి లక్షలాది రూపాయలు మంజూరు చేశారు. అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం మూలంగా భవన నిర్మాణాలు అసంపూర్తిగా నిర్మిస్తూనే ఉన్నారు. 2013లో సరస్వతమ్మ విగ్రహాన్ని కళాశాల ఆవరణలో కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. ఆదరణ తగ్గడంతో సరస్వతమ్మ విగ్రహం రంగు వెలసి కళావిహీనంగా ఉంది. ఇప్పటికైనా విగ్రహానికి రంగులు వేసి ఆదరణ చూపాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
అక్రమ పేలుళ్లను అడ్డుకున్న రైతులు
తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యాపారిని పట్టుకుని వదిలిపెట్టిన అధికారులు వెల్దుర్తి: పట్టణ పరిసరాల్లో అక్రమంగా బండలను బ్లాస్టింగ్ చేస్తున్న ఓ వ్యాపారిని మంగళవారం అడ్డుకుని, స్థానిక తహసీల్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేశారు. మాసాయిపేటకు చెందిన ముద్దంగుల వీరేశం కడీలు, ధ్వజ స్తంభాల వ్యాపారం చేస్తుంటారు. ఎక్కడ ప్రభుత్వ బండలు కనిపిస్తే అక్కడకు చేరుకొని తన వ్యాపారాన్ని కొనసాగిస్తారు. అదే తరహాలో వెల్దుర్తి పరిసరల్లోని చర్లపల్లికి వెళ్లే దారి పక్కన రాతి కడీల కోసం అక్రమంగా పేలుళ్లు జరుపుతున్నారు. పరిసర ప్రాంతంలో వ్యవసాయ చేనుకునే రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే మంగళవారం సదరు వ్యాపారీ రాతీ కడీలను ఇతర ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా గమనించి తహసీల్ కార్యాలయానికి చేరుకొని ఆందోళనకు దిగారు. అప్పుడే తహసీల్దార్ అన్వర్ రాగా అడ్డుకున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలుపగా , రైతులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఆయన వీఆర్వోను విచారణకు ఆదేశించారు. ఘటన స్థలానికి వెళ్లిన వీఆర్వో అక్కడే ఉన్న వ్యాపారీ ఉపయోగించే వాహనంలో సామాగ్రి ఉండడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని, పోలీసులకు అప్పగించి, వాహనంతో పాటు వ్యాపారీపై కేసునమోదు చేయనున్నట్లు తెలిపారు. సాయంత్రం సమయంలో వాహనాన్ని వదిలిపెట్టడమే కాకుండా, ఎలాంటి కేసును నమోదు చేయలేదు. అక్రమ పేలుళ్లతో తమ బోరుబావులు ధ్వంసం అయితే ఎవరు బాధ్యులని వారు ప్రశ్నించారు. వ్యాపారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాహనంతో పాటు అతనిని వదిలిపెట్టడంపై రెవెన్యూ అధికారుల తీరును రైతులు తప్పుబట్టారు. -
స్టూడెంట్స్ కోసం వివాహం వాయిదా
వెల్దుర్తి: ఆమె తమ విద్యాలయంలో చదివే బాలికలు శిఖరాగ్రాన నిలుచునేందుకు తన వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి 20 మంది బాలికలు కిలిమంజారో పర్వత అధిరోహణకు వెళ్లిన విషయం తెలిసిందే. వీరంతా సోమవారం పర్వత శిఖరంపై భారత జాతీయ పతాకాన్ని సగర్వంగా ఆవిష్కరించారు. కాగా, ఈ బృందంలో మెదక్ జిల్లాకు చెందిన 9 మంది కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి చెందిన విద్యార్థినులు ఉండగా, వీరిలో ఇద్దరు వెల్దుర్తి కేజీబీవీకి చెందిన వారు. ఈ విద్యాలయం పీఈటీ కమల.. తన విద్యార్థినులు కవిత, జ్యోతికి ధైర్యం చెప్పేందుకు, తోడుగా ఉండేందుకు ఆమె వారి వెంట వెళ్లారు. పర్వత అధిరోహణ కోసం వెళ్లిన వీరంతా ఈ 18న తిరిగి రానున్నారు. పీఈటీ కమల వివాహం అంతకుముందే ఈ 18న చేయడానికి ముహూర్తం నిర్ణయించారు. అయితే, అదే రోజున వారు ఇక్కడికి తిరిగి వస్తున్నందున, వివాహానికి తగిన సమయం లేనందున కమల తన వివాహ తేదీని వాయిదా వేసుకున్నారు. ఆగస్టు 26న మరో ముహూర్తం ఖరారు చేశారు. బాలికల విజయం కోసం వివాహాన్నే వాయిదా వేసుకున్న పీఈటీ కమలను పలువురు అభినందిస్తున్నారు. -
సాహసబాలికలకు అభినందనలు
వెల్దుర్తి: మండల కేంద్రమైన వెల్దుర్తిలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న కవిత, జ్యోతిలు ఆదివారం అర్దరాత్రి ఆఫ్రికా దేశం టాంజానియాలోని కిలిమంజారో పర్వత శిఖరంపై తెలంగాణ కీర్తిని నిలబెట్టి జాతీయ జెండాను ఎగురవేసి నందుకు సాహస బాలికలకు సర్వత్రా అభినందన వెల్లువలు రేకెత్తుతున్నాయి. జిల్లా నుండి గురుకుల పాఠశాలకు చెందిన బాలికలు కలెక్టర్ రోనాల్డ్‌రాస్ కృషి ఫలితంగా విజయం సాధించారని కొనియాడారు. ముఖ్యంగా జ్యోతి, కవితల సాహసంతో మండలానికి, గురుకుల పాఠశాలకు , బాలికల గ్రామాలైన దామరంచ, మానెపల్లి గ్రామాలకు కీర్తి ప్రతిష్టలు పెరిగాయని పలువురు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఆబాలికలతో సన్నిహితంగా ఉన్న తోటి బాలికలు , పాఠశాల టీచర్లు , తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేను ఓడి.. మిత్రురాళ్లు గెలిచి.. నా మిత్రురాళ్లు జ్యోతి, కవితలతో నేను రన్నింగ్‌లో గెలిచి భువనగిరి కొండల్లో శిక్షణలో ఓడి పోయా. అయినా వారు పర్వతారోహణ చేసినందుకు గర్వంగా ఉంది. నేనే సాహసం చేసినట్లుగా బావిస్తున్నా. వారి సాహసం మాపాఠశాలకు, మామిత్రురాల్లకు ఇదో సంతోషం. - మమత. క్లాస్మేట్. మాకు గర్వంగా ఉంది మాజ్యోతి, కవితలు పర్వత శిఖరంపై త్రివర్ణ పతాకం ఎగురవేసినందుకు సంతోషంగా ఉంది. ముందు ముందు ఇలాంటి సాహసాలు చేసి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. మా క్లాస్మేట్లు ఈసాహసం చేసినందుకు గర్వంగా ఉంది. - మహేశ్వరి. క్లాస్మేట్ ఎంతో పేరు వచ్చింది మాది మధ్య తరగతి కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. ఉన్న ముగ్గురు కూతుళ్లను చదివిస్తున్నాం. మా రెండో కూతురు జ్యోతి ఇంత సాహసం చేయడం మాకు పేరు తెచ్చి పెట్టింది. అందరూ మమ్ములను మెచ్చుకుంటున్నారు. ముందు ముందు మంచి ప్రయోజకురాలు కావాలన్నదే మా కోరిక. - జ్యోతి తల్లిదండ్రులు మైసమ్మ, రాజులు దామరంచ. ఉన్నత స్థానంలో నిలవాలి కవిత పుట్టిన ఏడాదికి తల్లిదండ్రులు నాగమణి, రాజయ్యలు నాచేతిలో పెట్టి పట్నంకు వలస పోయారు. పెంచి పెద్ద చేసి చదివిస్తున్నా. ఇంత సాహసం చేయడంతో ఆమె తలిదండ్రులు, మా గ్రామస్తులు మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉంది. ఉన్నతమైన స్థానంలో నిలవాలన్నదే మా కోరిక. - కవిత పెద్దమ్మ రాజమణి. మానెపల్లి. మా పాఠశాలకు కీర్తి పెరిగింది మాబాలికలు ఇంత సాహసం చేయడంతో మాపాఠశాలకు పేరు ప్రతిష్టలు, కీర్తి పెరిగింది. మాతోటి టీచర్లకు కూడా పేరు వచ్చింది. ముందు ముందు మాబాలికలు ఇలాంటి సాహసాలు చేసి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నదే మాఆకాంక్ష. - జ్యోత్స్న పాఠశాల ఎస్ఓ వెల్దుర్తి. ఘనంగా సన్మానిస్తాం.. గురుకుల పాఠశాల బాలికలు కవిత, జ్యోతిల సాహసంతో మండలానికి గుర్తింపు వచ్చింది. వారు రాగానే ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ రాజమణిముర ళీయాదవ్ల చేతుల మీదుగా వారిని ఘనంగా సన్మానిస్తాం. - సునిత ఎంపిపి వెల్దుర్తి. -
బీసీ హాస్టల్ మూసివేత
ఆగమైన విద్యార్థులు.. పట్టించుకోని అధికారులు వెల్దుర్తి: గత 40 ఏళ్ల నుంచి వేలాది మంది నిరుపేద విద్యార్థులకు వసతి కల్పించి... వారి జీవితాల్లో వెలుగు నింపిన బీసీ సంక్షేమ వసతి గృహం అమాంతరంగా మూసివేయడంతో విద్యార్థులు ఆగమయ్యారు. అధికారుల ఆలసత్వం, పాలకుల నిర్లక్ష్యంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని మాసాయిపేట గ్రామంలో గల బీసీ హాస్టల్‌ను గత 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. వేలాది మంది విద్యార్థులకు వసతి లభించింది. రెండేళ్ల నుంచి అధికారులు చుట్టపు చూపుగా హాస్టల్‌కు రావడం... నిర్వాహణ లోపించడంతో విద్యార్థులు హాస్టల్‌కు రావడానికి ఇష్టపడటం లేదు. ఇదే అదునుగా భావించి... విద్యార్థుల సంఖ్య తగ్గిందని హాస్టల్‌ను ఈసారి ఎత్తివేశారు. హాస్టల్లో ఉండటానికి రామంతాపూర్, బొమ్మారం, నాగ్సాన్పల్లి గ్రామాల నుంచి మాసాయిపేట ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతుల్లో 55 మందికి పైగా విద్యార్థులు చేరారు. పాఠశాలలో చేరిన విద్యార్థులకు హాస్టల్ ఎత్తివేయడంతో కలత చెందుతున్నారు. అసలే కరువు కాలం, దీనికి తోడు పాఠశాలకు రావడానికి ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరం ఉంది. వాహన సదుపాయం లేక కాలినడకతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ముందే తెలిస్తే పాఠశాలలో చేరకుంటిమని, దగ్గరలో ఉన్న పాఠశాలల్లో చేరేవారిమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ ఎత్తివేతపై విద్యార్థులు, గ్రామస్తులు ఆందోళన చేయడంతో అమాత్యులు హామీ ఇచ్చారు. నెలన్నర రోజులు గడుస్తున్నా హాస్టల్ తెరవకపోవడంతో వారి మాటలు గాలిలో కలిసాయని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న మంత్రి హరీశ్‌రావు హాస్టల్ భవన నిర్మాణానికి రూ.90 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని, హాస్టల్ ఎక్కడా పోదని ఇచ్చిన హామీ నెలన్నర రోజులు గడుస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తక్షణమే హాస్టల్‌ను తెరిపించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ముందే తెలిస్తే.. హాస్టల్ ఎత్తివేస్తారని ముందే తెలిస్తే మాసాయిపేట పాఠశాలలో చేరకుంటిమి. మా రామంతాపూర్ నుండి వడ్యారం పాఠశాలకు రెండు కిలోమీటర్ల దూరం. ఈ పాఠశాలకు ఆరు కిలోమీటర్లు దూరం ఉంది. వాహన సౌకర్యం లేక రానుపోను కాలినడకతో ఇబ్బందులు పడుతున్నాం. కాళ్లు నొప్పులు పెడుతున్నాయి. - విష్ణు, 6వ తరగతి విద్యార్థి. ఇబ్బందిగా.. రామంతాపూర్ నుంచి మాసాయిపేట పాఠశాలకు కాలి నడకతో రావడానికి ఇబ్బంది పడుతున్నాం. కరువు కాలం, దూరభారంతో హాస్టల్లో ఉండొచ్చని అనుకున్నాం. ఇక్కడికి వస్తే హాస్టల్ మూతపడటంతో అవాక్కయ్యాం. వచ్చే ఏడు ఇక్కడి నుంచి వెళ్లిపోయి వడ్యారం పాఠశాలలో చేరతాం. - వినాయక్, 6వ తరగతి విద్యార్థి నట్టేట ముంచారు నాలుగేళ్ల నుంచి హాస్టల్లో ఉంటున్నాం. మాది నాగ్సాన్పల్లి. కొప్పులపల్లి గ్రామంలో పదో తరగతి ఏర్పాటైంది. కొప్పులపల్లి పాఠశాలకు పోదామనుకున్నాం. ఒక సంవత్సరమే ఉన్నందున హాస్టల్లో ఉండొచ్చని నమ్ముకున్నాం. మా నమ్మకాన్ని నట్టేట ముంచారు. 6 కిలోమీటర్ల దూరభారంతో ఇబ్బందులు పడుతున్నాం. - సాయికుమార్, 10వ తరగతి విద్యార్థి -
హరితవనం.. పాఠశాల ఘనం
‘మొక్క’వోని దీక్షతో కంటికి రెప్పలా సంరక్షణ నిత్యం హెచ్ఎం పర్యవేక్షణ పాఠశాలలో గత ఏడాది వంద.. సెప్టెంబర్ 3న మొక్కల పుట్టిన రోజుకు సన్నద్ధం వెల్దుర్తి: మారుమూల గ్రామంలోని ఓ పాఠశాల అది.. హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థుల కృషితో హరితమయమైంది.. వినోదానికి వేదికైంది.. వెల్దుర్తి పంచాయతీ పరిధిలోని శేరి గ్రామంలోని పాఠశాల.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గత సంవత్సరం విద్యార్థులు, ఉపాధ్యాయులు మొక్కలు నాటారు. కంటికి రెప్పలా పెంచి పెద్దచేశారు. నేడు ఆ మొక్కలు పెరిగి పెద్ద అయ్యాయి. చెట్ల చల్లని నీడలో కూర్చొని విద్యార్థులు భోజనాలు చేస్తూ ఆనందంగా చిందులేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం అరికెల వెంకటేశ్ ఆధ్వర్యంలో గత ఏడాది సెప్టెంబర్ 3న హరితహారంలో భాగంగా పాఠశాల ఆవరణలో వంద మొక్కలను నాటారు. వాటిలో 93 మొక్కలు పెరిగి చెట్లుగా ఎదిగి విద్యార్థులకు చల్లని నీడను ఇస్తున్నాయి. ఈ నెలలో మరో 40 మొక్కలు నాటినట్టు హెచ్ఎం తెలిపారు. వాటిని సైతం కంటికి రెప్పలా కాపాడుతున్నామన్నారు. ఇదిలా ఉండగా గత ఏడాది నాటిన మొక్కలకు సెప్టెంబర్ 3న పుట్టిన రోజు వేడుకలను నిర్వహిస్తామని తెలిపారు. -
చదువుకు స్వస్తి వంటకోసం కుస్తీ
వెల్దుర్తి : ఉన్న ఊరిని, తల్లిదండ్రులను వదిలి చదువుకునేందుకు వచ్చిన ఆ విద్యార్థినులకు ఆదిలోనే ఇబ్బందులు మొదలయ్యాయి. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా చదువులు పక్కన పెట్టి వంట చేసుకోవాల్సిన పరిస్థితి మండల కేంద్రమైన వెల్దుర్తిలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో దాపురించింది. ఇక్కడి బాలికలు చదువులను పక్కనపెట్టి వంట కార్మికుల అవతారం ఎత్తుతున్నారు. పాఠశాలలో ఆరు నుంచి పది వరకు ఉన్న తరగతుల్లో 163 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలలో ప్రత్యేకాధికారి లేకపోవడంతో ఉపాధ్యాయులే విధులు నిర్వహిస్తున్నారు. పాఠశాల ప్రారంభమైన నాటి నుంచి వంట సిబ్బంది లేక స్వీపర్లు, అటెండర్లే వంట చేస్తున్నారు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు బాలికలకు అల్పాహారం ఇవ్వాల్సి ఉండగా వంట సిబ్బంది లేకపోవడంతో బాలికలే వంటపనిలో నిమగ్నమయ్యారు. ఆకలి వేయడంతో వంట చేయక తప్పడంలేదని బాలికలు చెబుతున్నారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో సమయానికి కంటే రెండు గంటల ఆలస్యంగా భోజనాలు చేస్తున్నామని, అదికూడా తాము వంట పనికి సహకరిస్తే భోజనం దొరుకుతోందని బాలికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి వంట సిబ్బందిని ఏర్పాటు చేసి సమయానికి భోజనం అందించే ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. తమ చదువులను పక్కన పెట్టి ఇలాగే వంట పనులు చేస్తే ఇక తాము ఎప్పుడు చదువుకోవాలని ఇంటికెళ్లి పోతామని వారు హెచ్చరిస్తున్నారు.