బీసీ హాస్టల్‌ మూసివేత | BC hostel lockdown | Sakshi
Sakshi News home page

బీసీ హాస్టల్‌ మూసివేత

Published Sun, Aug 7 2016 7:21 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

మాసాయిపేటలో మూసివేసిన హాస్టల్‌

మాసాయిపేటలో మూసివేసిన హాస్టల్‌

  • ఆగమైన విద్యార్థులు.. పట్టించుకోని అధికారులు
  • వెల్దుర్తి: గత 40 ఏళ్ల నుంచి వేలాది మంది నిరుపేద విద్యార్థులకు వసతి కల్పించి... వారి జీవితాల్లో వెలుగు నింపిన బీసీ సంక్షేమ వసతి గృహం అమాంతరంగా మూసివేయడంతో విద్యార్థులు ఆగమయ్యారు. అధికారుల ఆలసత్వం, పాలకుల నిర్లక్ష్యంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.

    మండలంలోని మాసాయిపేట గ్రామంలో గల బీసీ హాస్టల్‌ను గత 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. వేలాది మంది విద్యార్థులకు వసతి లభించింది. రెండేళ్ల నుంచి అధికారులు చుట్టపు చూపుగా హాస్టల్‌కు రావడం... నిర్వాహణ లోపించడంతో విద్యార్థులు హాస్టల్‌కు రావడానికి ఇష్టపడటం లేదు. ఇదే అదునుగా భావించి... విద్యార్థుల సంఖ్య తగ్గిందని హాస్టల్‌ను ఈసారి ఎత్తివేశారు.

    హాస్టల్‌లో ఉండటానికి రామంతాపూర్‌, బొమ్మారం, నాగ్సాన్‌పల్లి గ్రామాల నుంచి మాసాయిపేట ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతుల్లో 55 మందికి పైగా విద్యార్థులు చేరారు. పాఠశాలలో చేరిన విద్యార్థులకు హాస్టల్ ఎత్తివేయడంతో కలత చెందుతున్నారు. అసలే కరువు కాలం, దీనికి తోడు పాఠశాలకు రావడానికి ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరం ఉంది.

    వాహన సదుపాయం లేక కాలినడకతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ముందే తెలిస్తే పాఠశాలలో చేరకుంటిమని, దగ్గరలో ఉన్న పాఠశాలల్లో చేరేవారిమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్‌ ఎత్తివేతపై విద్యార్థులు, గ్రామస్తులు ఆందోళన చేయడంతో అమాత్యులు హామీ ఇచ్చారు.

    నెలన్నర రోజులు గడుస్తున్నా హాస్టల్‌ తెరవకపోవడంతో వారి మాటలు గాలిలో కలిసాయని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న మంత్రి హరీశ్‌రావు హాస్టల్‌ భవన నిర్మాణానికి రూ.90 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని, హాస్టల్‌ ఎక్కడా పోదని ఇచ్చిన హామీ నెలన్నర రోజులు గడుస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తక్షణమే హాస్టల్‌ను తెరిపించాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

    ముందే తెలిస్తే..
    హాస్టల్‌ ఎత్తివేస్తారని ముందే తెలిస్తే మాసాయిపేట పాఠశాలలో చేరకుంటిమి. మా రామంతాపూర్‌ నుండి వడ్యారం పాఠశాలకు రెండు కిలోమీటర్ల దూరం. ఈ పాఠశాలకు ఆరు కిలోమీటర్లు దూరం ఉంది. వాహన సౌకర్యం లేక రానుపోను కాలినడకతో ఇబ్బందులు పడుతున్నాం. కాళ్లు నొప్పులు పెడుతున్నాయి. - విష్ణు, 6వ తరగతి విద్యార్థి.

    ఇబ్బందిగా..
    రామంతాపూర్‌ నుంచి మాసాయిపేట పాఠశాలకు కాలి నడకతో రావడానికి ఇబ్బంది పడుతున్నాం. కరువు కాలం, దూరభారంతో హాస్టల్‌లో ఉండొచ్చని అనుకున్నాం. ఇక్కడికి వస్తే హాస్టల్‌ మూతపడటంతో అవాక్కయ్యాం. వచ్చే ఏడు ఇక్కడి నుంచి వెళ్లిపోయి వడ్యారం పాఠశాలలో చేరతాం. - వినాయక్‌, 6వ తరగతి విద్యార్థి

    నట్టేట ముంచారు
    నాలుగేళ్ల నుంచి హాస్టల్‌లో ఉంటున్నాం. మాది నాగ్సాన్‌పల్లి. కొప్పులపల్లి గ్రామంలో పదో తరగతి ఏర్పాటైంది. కొప్పులపల్లి పాఠశాలకు పోదామనుకున్నాం. ఒక సంవత్సరమే ఉన్నందున హాస్టల్‌లో ఉండొచ్చని నమ్ముకున్నాం. మా నమ్మకాన్ని నట్టేట ముంచారు. 6 కిలోమీటర్ల దూరభారంతో ఇబ్బందులు పడుతున్నాం. - సాయికుమార్‌, 10వ తరగతి విద్యార్థి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement