చెరువులు నిండె .. అలుగులు పారె! | heavy rains.. lakes overflown | Sakshi
Sakshi News home page

చెరువులు నిండె .. అలుగులు పారె!

Published Thu, Sep 15 2016 9:07 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

నీటితో నిండిన ఎల్కపల్లి ఖాన్‌ చెరువు

నీటితో నిండిన ఎల్కపల్లి ఖాన్‌ చెరువు

వెల్దుర్తి: ఎణ్ణాళ్ల కెన్నేళ్లకో తీపి కబురు వినిపిస్తోంది పల్లెల్లో.. వర్షాల కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూసిన జనానికి పట్టలేనంత ఆనందాన్ని మిగిల్చాడు వరుణుడు.. వరుసగా మూడేళ్ల నుంచి తీవ్ర వర్షాభావంతో చెరువు, కుంటలు ఎండిపోయి.. వర్షాలు లేక.. పంటలు సాగు చేయలేక నీటి గోసతో ఇటు ప్రజలు, అటు పశు పక్ష్యాదులు అల్లాడుతున్న తరుణంలో వరుణుడు కరుణించాడు..

వర్షాకాలం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా ఆశించిన వర్షాలు లేక ఆందోళన చెందుతున్న తరుణంలో నాలుగు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండుకుంటున్నాయి. అలుగులు పారుతున్నాయి. హల్దీవాగుపై ఉన్న చెక్‌డ్యాంలలోకి ఇప్పుడిప్పుడే భారీగా వరద నీరు చేరుతోంది.

కుంటలు నిండి, అటవీ ప్రాంతాల నుండి భారీగా వరద  నీరు చెరువులలోకి పారుతున్నాయి. సోమవారం నుండి గురువారం వరకు వరుసగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం 28.4 మి.మీలు, మంగళవారం 150.8 మి.మీలు , బుధవారం 11.8 మి,మీలు వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.

దీంతో మండలంలోని చెర్లపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న నర్సిన్‌ చెరువులోకి భారీగా వరద నీరు చేరడంతో చెరువు నిండిపోయి అలుగు పారుతోంది. అలుగు ద్వారా భారీగా నీరు వెల్దుర్తి శివారులో ఉన్న దేవతల చెరువులోకి పారుతోంది. ప్రస్తుతం దేవతల చెరువు 30 ఫీట్ల లోతు ఉండగా గురువారం నాటికి 19 ఫీట్ల నీరు చేరింది. ఇంకా నర్సిన్‌ చెరువు అలుగు నుండే కాకుండా అల్లీపూర్‌ అటవీ ప్రాంతం నుండి భారీగా వరద నీరు చేరుతోంది.

ఇదిలా ఉండగా ఎల్కపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న ఖాన్‌ చెరువులోకి భారీగా నీరు చేరి నిండిపోయింది. మరి కొన్ని గంటలు గడిస్తే అలుగు పారే అవకాశం ఉంది. ఈ చెరువులోకి అల్లీపూర్‌, యశ్వంతరావుపేట అటవీ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు చేరుతోంది. చెరువులు నిండి అలుగులు పారడంతో  ఆయా గ్రామాల ప్రజలు, ఆయకట్టు పొలాల రైతులు సంబరపడిపోతున్నారు.

నర్సిన్‌ చెరువుకు పొంచి ఉన్న ప్రమాదం
చెర్లపల్లి అటవీ ప్రాంతంలో ఉన్నచెరువుకు ప్రమాదం పొంచి ఉంది. గత ఏడాది మిషన్‌ కాకతీయ మొదటి ఫేజ్‌లో చెరువును పునరుద్ధరించారు. అధికారుల పర్యవేక్షణ లేక కాంట్రాక్టరు నాసిరకంగా పనులు చేసి చేతులు దులుపుకున్నాడు. తూము దిగువ భాగంలో ఉన్న కట్టకు రాతి తెట్టెను ఏర్పాటు చేయకపోవడంతో కట్ట కుంగిపోయింది.

ఈ చెరువు పూర్తిగా నీటితో నిండడంతో ప్రమాదం సంభవించే అవకాశం ఉందని, బుంగ పడితే నీరు వృథాగా పోయే అవకాశం ఉందని రైతులు తెలిపారు. ఇరిగేషన్‌ అధికారులకు సమాచారం ఇచ్చినా నేటికీ వచ్చి పరిశీలించలేదని అధికారులపై రైతులు మండిపడుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement