వెల్దుర్తి దేవతల చెరువు అలుగుపై నుంచి పొంగుతున్న వరద
వెల్దుర్తి: మూడురోజులుగా కురిసిన భారీ వర్షాలకు మండలవ్యాప్తంగా వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు, చెరువు, కుంటలు, అలుగులు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు రోడ్లకు అడ్డంగా ఉన్న కల్వర్టుల ద్వారా భారీగా తరలి వెళ్లడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పాత ఇళ్లు కూలుతున్నాయి.
శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 9 సెం.మీ వర్షపాతం నమోదైందని, మండలంలో 220 ఇళ్లు పాక్షికంగా, శెట్టిపల్లి, బండపోసాన్‌పల్లి ఒక్కో ఇల్లు పూర్తిస్థాయిలో కూలిపోయినట్లు డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ తెలిపారు. వరద తాకిడికి మండలంలో రెండు హెక్టార్లలో కంది, 20 హెక్టార్లలో వరి, 10 హెక్టార్లలో మొక్కజొన్న పంటలు నీట మునిగాయని వ్యవసాయ శాఖ అధికారులు రాజనారాయణ, హజార్ తెలిపారు.
దేవతల చెరువు అలుగు పొంగిపొర్లడంతో ఎల్కపల్లి వద్ద గల కుమ్మరి వాగు వరద ఉధృతికి రోడ్డుపై భారీ ఎత్తున నీరు పారడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వెల్దుర్తి నుంచి దామరంచకు పోయే రహదారికి కుకునూరు వద్ద వంతెన పైనుంచి అరగజం ఎత్తులో నీరు పొంగిపొర్లడంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. హకీంపేట హల్దీవాగుపై గల ప్రాజెక్టు ద్వారా వరద నీరు పొంగిపొర్లుతోంది.