* దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు
* నల్లగొండ జిల్లాలో హైవేపై భారీగా నిలిచిన నీరు
* కేతేపల్లి పోలీస్‌స్టేషన్‌లోకి నీళ్లు
* భద్రాచలంలో పెరిగిన వరద ఉధృతి
సాక్షి, నెట్‌వర్క్ : గత నాలుగు రోజులుగా వివిధ జిల్లాల్లో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్నిచోట్ల రోడ్లపైనే చెట్లు కూలడం, భారీగా నీరు చేరడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. రోజంతా ముసురుపట్టి ఉండటంతో జనజీవనం స్తంభించింది. ఖమ్మం జిల్లాలో పలుచోట్ల శుక్రవారం కూడా భారీ వర్షం కురిసింది. కొత్తగూడెం నియోజకవర్గంలో 7.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
సింగరేణి ఓపెన్‌కాస్టు గనుల్లో నీరు చేరడంతో 10వేల టన్నుల మేర బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. కిన్నెరసాని ప్రాజెక్టు 5గేట్లు ఎత్తేశారు. భారీ వర్షానికి ఇల్లెందు-మహబూబాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నామాలపాడు గ్రామం వ ద్ద రోడ్డు మీదుగా జిన్నెల వర్రె వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బయ్యారం పెద్ద చెరువు అలుగు పడటంతో నీరు రోడ్డెక్కింది. దొరన్న తండా పందిపంపుల వాగులో బీరోనిమడువ గ్రామానికి చెందిన భూక్య రాజు(16) గల్లంతయ్యాడు. గార్ల మండలంలో పాకాల ఏరు పొంగి ప్రవహిస్తోంది.
ముర్రేడు వాగుపై తాత్కాలిక వంతెన తెగిపోవటంతో గుండాల- ఇల్లెందు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరి మళ్లీ పెరుగుతుండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉంది. రామగోపాలపురానికి చెందిన రైతు మడికి మూడయ్య(32) పిడుగుపడటంతో ఎద్దుతో సహా మృతిచెందాడు. వాజేడు మండలంలోని 32 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
వరంగల్ జిల్లాలో చెరువులతోపాటు పాకాల సరస్సు అలుగు పోస్తోంది. జిల్లాలో సగటున 4.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, కొడకండ్లలో 17 సెంటీమీటర్లు, తాడ్వాయిలో 16, ఏటూరునాగారంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏజెన్సీలోని జంపన్నవాగు స్నాన ఘట్టాల మీది నుంచి ప్రవహిస్తోంది. దొడ్లవాగు, జీడీవాగు, రాంనగర్‌వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నర్సింహులపేట, జఫర్‌గఢ్ మండలాల్లో కొన్నిచోట్ల ఇళ్లు నేలకూలాయి.
నల్లగొండ జిల్లా సూర్యాపేటలో వీధులన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. స్తంభాలు కూలిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్ల వెంట చెట్లు విరిగిపడటంతో పాటు హైవేపై 3 అడుగుల మేర నీరు నిలిచి ట్రాఫిక్ ఆగిపోయింది. కేతేపల్లి పోలీస్‌స్టేషన్‌లోకి నీళ్లు రావడంతో సామాన్లు, రికార్డులు బయటపెట్టారు. జిల్లాలో సగటున 31.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై పలు చెరువులకు గండ్లు పడ్డాయి. దాదాపు 10 వేల హెక్టార్లలో పత్తి, వరి తదితర పంటలు నీటమునగడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మాడ్గుల సమీపంలో నార్కట్‌పల్లి- అద్దంకి రహదారిపై ఆర్టీసీ బస్సు అదుపు తప్పి గుంతలో పడగా, 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
కరీంనగర్ జిల్లా మంథని డివిజన్‌లో 10 నుంచి 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహదేవ్‌పూర్ మండలం పెద్దంపేట వాగు ఉప్పొంగడంతో అవతలి వైపు ఉన్న 12గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోనంపేట, దౌతుపల్లి, మహముత్తారం, పెద్దవాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మండల కేంద్రానికి సంబంధాలు తెగిపోయాయి. వందలాది ఎకరాల్లో పంటపొలాలు నీటమునగగా, 50 ఇళ్లు దెబ్బతిన్నాయి.
మహబూబ్‌నగర్ జిల్లాలో శుక్రవారం 41.6 మి.మీ వర్షపాతం నమోదైంది. హస్నాపూర్ వాగులో బొంతల మాసమ్మ అనే మహిళ గల్లంతైంది. నల్లమల అటవీప్రాంతంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చంద్రవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. తాత్కాలికంగా నిర్మించిన కల్వర్టు తెగిపోవడంతో అచ్చంపేట నుంచి శ్రీశైలం, అమ్రాబాద్ మార్గంలో వెళ్లే వాహనాల ను దారి మళ్లించారు. ద్రోణి ప్రభావంతో ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
కర్నూలు జిల్లాలో సగటున 37.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నంద్యాలలో కుందూ నది, చామ కాలువ, మద్దిలేరు వాగు పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాల్లోని 3 వేల ఇళ్లు నీట మునిగి, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో నీరంతా గోకవరం ఊరకాలువలోకి చేరింది. విశాఖ జిల్లా కశింకోట మండలంలోని తాళ్లపాలెం వద్ద ఉన్న డిస్టిలరీ పరిశ్రమపై పిడుగు పడి అగ్ని ప్రమాదం సంభవిం చింది. పరిశ్రమ మూత పడి ఉండటం వల్ల ప్రాణ నష్టం జరగలేదు.
మరో రెండు రోజులు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాబోయే 48 గంటల్లో తెలంగాణ, కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అతి భారీగా... నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, గుంటూరు, ప్రకాశం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ, కోస్తాల్లోని మిగతా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
శుక్రవారం నల్లగొండ జిల్లాలో కుండపోతగా వర్షం కురిసింది. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 6 గంటల్లోపే ఈ జిల్లాలోని మామిడాలలో 196.75 మిల్లీమీటర్లు, లింగాపూర్‌లో 186, తాడికమల్‌లో 186.50, టేకుమట్లలో 173.75, వేములపల్లిలో 150, కృష్ణా జిల్లా చిన్నాపురంలో 117.75 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లక్షలాది ఎకరాల్లో నీరు నిలిచింది. పలు గ్రామాల్లో ఇళ్లు కూలిపోయాయి. ఖమ్మం జిల్లాలో శుక్రవారం కురిసిన వడగళ్ల వానకు ఏడుగురు మృత్యువాత పడ్డారు. దీంతో గత నెలన్నర రోజుల్లో వర్షాలు, వరదలవల్ల మరణించిన వారి సంఖ్య 62కు పెరిగింది. వర్షాలు, వరదలతో 3లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని సమాచారం.
మహబూబ్‌నగర్ జిల్లాలో గురు, శుక్రవారాల్లో కురిసిన భారీ వర్షాలవల్ల రెండు వేల ఇళ్లు దెబ్బతిన్నాయని తెలుస్తోంది. కుండపోత వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు.. ఈ వర్షాలతో పారిశుధ్యం దెబ్బతినడం, దోమలు పెరగడం, నీరు కలుషితం కావడంవల్ల పలు జిల్లాల్లో వ్యాధులు ప్రబలుతున్నాయి. ఆదిలాబాద్ ఏజెన్సీ, గోదావరి మన్యం ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో గిరిజనులు మలేరియాతో మంచానపడ్డారు.
పలు జిల్లాల్లో ఎడతెరపిలేకుండా వర్షాలు
Published Sat, Aug 17 2013 3:13 AM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM
Advertisement
Advertisement